ఎంపీగా కొనసాగుతా.. రాజకీయాల్లో ఉండను

Will Remain MP But Quit Politics: Babul Supriyo - Sakshi

బీజేపీ చీఫ్‌ నడ్డాతో భేటీ అనంతరం బాబుల్‌ సుప్రియో వెల్లడి

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లోని అసన్‌సోల్‌ లోక్‌సభ సభ్యుడు, కేంద్రమాజీ మంత్రి బాబుల్‌ సుప్రియో మనస్సు మార్చడంలో బీజేపీ అధిష్టానం కొంతమేర సఫలీకృతమైంది. పార్లమెంట్‌ సభ్యుడిగా రాజీనామా చేయాలన్న నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఆయన సోమవారం ఢిల్లీలో ప్రకటించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సోమవారం సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘పార్లమెంట్‌ సభ్యుడిగా రాజ్యాంగ బాధ్యతలను నెరవేరుస్తా. ముందుగా ప్రకటించిన విధంగా క్రియాశీల రాజకీయాల నుంచి మాత్రం వైదొలుగుతా’అని వెల్లడించారు. ఢిల్లీలోని అధికార నివాసాన్ని కూడా ఖాళీ చేశానన్నారు. ఇటీవల ప్రధాని మోదీ చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో మంత్రిగా ఉన్న బాబుల్‌ సుప్రియోతో రాజీనామా చేయించిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో మనస్తాపం చెందిన సుప్రియో ఎంపీ పదవికి రాజీనామా చేసి, క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

కానీ, పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ చేతిలో ఘోర పరాజయం షాక్‌ నుంచి తేరుకోని బీజేపీ.. సుప్రియో రాజీనామాతో జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ పడి, నెగ్గే పరిస్థితిలో లేదు. ఈ పరిణామాన్ని ఊహించిన బీజేపీ చీఫ్‌ నడ్డా, హోం మంత్రి అమిత్‌ షాలు ఎంపీ పదవిలో కొనసాగేలా సుప్రియోను ఒప్పించడంలో విజయం సాధించారు. రాష్ట్రంలో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొంతమేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు మీడియాకు తెలిపారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top