డీకే శివకుమార్ మంత్రివర్గ కూర్పుపై రాహుల్ ఆదేశాలు | What Rahul Gandhi Wants New DK Shivakumar Government To Look Like | Sakshi
Sakshi News home page

డీకే శివకుమార్ మంత్రివర్గ కూర్పుపై రాహుల్ ఆదేశాలు

May 28 2026 1:08 PM | Updated on May 28 2026 1:24 PM

What Rahul Gandhi Wants New DK Shivakumar Government To Look Like

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి పీఠాన్ని డీకే శివకుమార్‌కు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వం కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై దృష్టి సారించింది. శివకుమార్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఎలా ఉండాలనేదానిపై పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. కొత్త మంత్రివర్గంలో దళితులు, ఓబీసీలు, మైనారిటీలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన కోరినట్లు సమాచారం.

యువతకు ‍ప్రాధాన్యత
మంత్రివర్గంలోకి అధికశాతం యువకులను తీసుకోవాలని రాహుల్ గాంధీ యోచిస్తున్నారని ఎన్‌డీటీవీ తన కథనంలో పేర్కొంది. 2028లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, పార్టీలో మార్పును ప్రతిబింబించేలా, యువతను ఆకర్షించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేరళ తరహాలోనే యువ కాంగ్రెస్ నేపథ్యం ఉన్న యువ నేతలకు మంత్రి పదవులు ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. పార్టీ తన వ్యూహంలో భాగంగా, ప్రస్తుతమున్న 35 మంది మంత్రులలో 25 మందిని తొలగించి, వారిని పార్టీ సంస్థాగత పనులకు పరిమితం చేసే అవకాశం ఉంది.

ఇద్దరు ఉపముఖ్యమంత్రుల ప్రతిపాదన
కొత్త ప్రభుత్వంలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులను నియమించాలనే ప్రతిపాదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వారిలో ఒకరిని దళిత నేతకు కేటాయించే అవకాశం ఉంది. కర్ణాటకలో ఇప్పటివరకు దళిత ముఖ్యమంత్రి లేరు. ఉపముఖ్యమంత్రి పదవిని దళిత నేతకు ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి భరోసా కల్పించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న జి. పరమేశ్వర దళిత నేత కావడం గమనార్హం. సిద్ధరామయ్యకు మద్దతుగా ఉన్న దళిత, వెనుకబడిన తరగతులు, మైనారిటీల ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి కూడా ఈ నిర్ణయం తోడ్పడుతుందని పార్టీ భావిస్తోంది.

భిన్నాభిప్రాయాలు
అయితే ఉపముఖ్యమంత్రుల సంఖ్య విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శివకుమార్ వర్గం ఒక్కరికే అవకాశం ఇవ్వాలని కోరుతుండగా, సిద్ధరామయ్య వర్గం మాత్రం ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉండాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే కొత్త మంత్రివర్గం రాజకీయంగా సమతుల్యంగా ఉండాలని, ఏ ఒక్క వర్గం లేదా క్యాంపునకు అనుకూలంగా ఉండకూడదని రాహుల్ గాంధీ పార్టీకి స్పష్టమైన సందేశాన్ని పంపారు. నెలల తరబడి సాగిన అంతర్గత పోరుకు తెరదించుతూ, మంగళవారం ఢిల్లీలో జరిగిన సుదీర్ఘ సమావేశాల అనంతరం సిద్ధరామయ్యను ఒప్పించడంలో కాంగ్రెస్ హైకమాండ్ విజయం సాధించింది. జూన్ 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికల ద్వారా సిద్ధరామయ్య ఎగువ సభలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: బీజేపీలో భారీ ప్రక్షాళన: కీలక రాష్ట్రాలకు కొత్త సారథులు!

Advertisement
 
Advertisement
Advertisement