Viral Video: ఆవుపై కుక్క దాడి.. అమాంతం నోటితో కరిచి పట్టుకొని..

Viral Video: Pit Bull Bites Cow In Mouth In Kanpur - Sakshi

లక్నో: కుక్కలు విశ్వాసానికి మారు పేరుగా వర్ణిస్తుంటారు. కానీ కొన్ని రకాల కుక్కలు మాత్రం ఉన్నట్లుండి ఒక్కసారిగా మనుషులపై దాడి చేస్తుంటాయి. ఎక్కడి పడితే అక్కడ కొరికి కరిచేస్తుంటాయి. ఇటీవల కాలంలో పెంపుడు జంతువులు దాడి చేస్తున్న ఘటన ఎక్కువ అవుతున్నాయి.  అంతేగాక కుక్కల బారిన పడి అనేక చోట్ల పలువురు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలను చాలానే చూస్తూనే ఉన్నాం.

తాజాగా ఓ కుక్క దాడిలో ఆవు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్‌లో చోటుచేసుకుంది.  పిట్‌ బుల్‌ జాతికి చెందిన పెంపుడు కుక్క ఆవుపై విచక్షణారహింతంగా దాడికి తెగబడింది. క్రూరమైన కుక్క ఆవు దవడను తన నోటితో బలంగా కరిచి పట్టుకుంది. దీంతో ఆవు నొప్పితో మెలికలు తిరుగుతూ కనిపించింది. ఆవును రక్షించడానికి  కుక్క యాజమాని తీవ్రంగా ప్రయత్నించాడు. చేతులు, కర్రతో కొట్టినప్పటికీ కుక్కు ఆవును ఎంతకూ వదిలి పెట్టలేదు. మరో ఇద్దరు, ముగ్గురు వచ్చి సాయం చేయగా చివరికి విడిచిపెట్టింది. అయితే అప్పటికే ఆవు నోటిపై లోతైన గాయాలయ్యాయి.  

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కుక్క లైసెన్స్‌ చూపించాల్సిందిగా యాజమానిని మున్సిపల్‌ అధికారులు ఆదేశించారు. కుక్కను కూడా స్వాధీనం చేసుకొని బోనులో ఉంచారు. ఆవును పశువైద్యశాలకు పంపించారు. అలాగే దానికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయనున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్కే నిరంజన్ తెలిపారు. కాగా పిట్‌బుల్ జాతికి చెందిన కుక్కలు మనుషులపై దాడి చేసే ప్రమాదాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. గత రెండు నెలల్లో వేర్వేరు సంఘటనల్లో దాదాపు అర డజను మంది పిట్‌బుల్ దాడిలో గాయపడ్డారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top