
ఏ పార్టీతో పొత్తు ఉండదు. సింహం ఎప్పటికీ సింహమే!. సింగిల్‌గానే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతాం అంటూ తమిళగ వెట్రి కళగం (Tamilaga Vetri Kazhagam) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మధురైలో జరిగిన టీవీకే మానాడు సూపర్ సక్సెస్ కావడంతో విజయ్‌ను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలను ప్రముఖ పార్టీలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో..
తమిళనాడులో జరిగిన ఓ సర్వే వెల్లడించిన విషయాలు టీవీకే సహా అక్కడి రాజకీయ పక్షాలకు ఝలక్ ఇచ్చాయి. తమిళనాడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. డీఎంకే అత్యధిక సీట్లు కైవసనం చేసుకుంటుందని తెలిపింది. ప్రతిపక్ష ఎన్డీయే కూటమికి 3 సీట్లు దక్కవచ్చని, అదే సమయంలో విజయ్ టీవీకేకు జీరో ఎదురుకావొచ్చని ఆ సర్వే పేర్కొంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి తమిళనాడులో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 39 స్థానాలను కూటమిలోనే పార్టీలోనే కైవసం చేసుకున్నాయి. అయితే ఇప్పటికిప్పడు జరిగితే మాత్రం 36 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. సంక్షేమ పథకాలతో పాటు హిందీ భాషా వ్యతిరేక ఉద్యమం, నీట్ పోరాటాలు డీఎంకే గెలుపును ప్రభావితం చేసే అంశాలుగా పేర్కొంది.
ఇక.. బీజేపీ అన్నాడీఎంకే ఎన్డీయే కూటమికి మూడు స్థానాలు మాత్రమే దక్కవచ్చని పేర్కొంది. అయితే.. ఓటు శాతం మాత్రం 18% నుంచి 37%కి పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. 2024లో ఈ కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు.
ఇక తమిళనాడులో రాబోయే కాలంలో జరిగే ఎన్నికలకు విజయ్ టీవీకే పార్టీ అదనపు ఆకర్షణగా నిలవబోతోంది. ఈ పార్టీ ఇప్పటిదాకా ఏ ఎన్నికల్లో పోటీ చేసింది లేదు. అయితే ఇప్పటికప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఏ స్థానం దక్కకపోవచ్చని(0 సీట్లు) ఆ సర్వే వెల్లడించింది.
విజయ్ పార్టీ పెట్టి ఏడాది పైనే అవుతోంది. అయితే అందులో ముఖాలేవీ జనాలకు పెద్దగా తెలిసినవి కావు. జనాలకు తెలిసిన ముఖాలు టీవీకేలో చేరేందుకు ప్రయత్నిస్తున్నా.. విజయ్ అందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు జనాల్లోకి ఇంకా బలంగా ఆ పార్టీ చొచ్చుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే డీఎంకే వ్యతిరేకతను టీవీకే ఓట్ల రూపంలో మార్చుకోవాలని విజయ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. టీవీకే పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా డీఎంకేకే లాభం కలగించవచ్చని సర్వే పేర్కొంది. తద్వారా.. టీవీకేతో ఎన్డీయే కూటమికే భారీ నష్టం కలగవచ్చని స్పష్టం చేసింది.
ఇండియా టుడే సీవోటర్ Mood of the Nation ఆగస్టు 2025 పేరిట నిర్వహించిన ఈ సర్వే నిర్వహించింది. జూలై 1 నుండి ఆగస్టు 14, 2025 మధ్య 2 లక్షల మందికి పైగా ప్రజల అభిప్రాయాలను సేకరించి రూపొందించబడింది. సర్వే లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో జరిగినప్పటికీ మరో ఏడేనిమిది నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకూ సమీకరణాలు ఇలాగే కొనసాగితే మాత్రం.. డీఎంకే నెత్తిన విజయ్ టీవీకే పాలు పోసినట్లే అవుతుందన్న చర్చ జోరుగా నడుస్తోందక్కడ.