సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో మేట్టూరు కూడా ఒకటి. ఇక్కడి నుండి నామ్ తమిళర్ కట్చి తరపున అడవి బిడ్డ, స్మగ్లర్ వీరప్పన్ పెద్ద కుమార్తె విద్యా రాణి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న వేళ, ఆమె తన ఎన్నికల ఖర్చుల కోసం ప్రజల సహాయాన్ని అర్థించారు.
వీడియో ద్వారా విజ్ఞప్తి
విద్యారాణి సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేస్తూ, అందులో తన భావాలను పంచుకున్నారు. ఎన్నికల ప్రచారానికి అవసరమైన వాహన డీజిల్, ఆహారం, ఇతర రోజువారీ ఖర్చుల కోసం తనకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన సోదర సోదరీమణులు, పెద్దలు, తమిళ బంధువులందరూ ఏకమై తోచిన సహాయం చేస్తే, అది తన విజయాన్ని సులభతరం చేస్తుందని ఆమె ఉద్వేగంగా వ్యాఖ్యలు చేశారు. విద్యా రాణి కేవలం విజ్ఞప్తి చేయడమే కాకుండా, తన వీడియోలో ఆర్థిక సహాయం పంపడానికి వీలుగా జీ పే, పోన్ పే నెంబర్లతో పాటుగా బ్యాంక్ ఖాతా వివరాలను జత చేశారు. సామాన్యుల పక్షాన నిలబడి పోరాడటానికి తనకు ఈ సహాయం ఎంతో అవసరమని ఆమె విజ్ఞప్తి చేశారు.
విద్యారాణి రాజకీయ నేపథ్యం
గతంలో బీజేపీ , పీఎంకే పారీ్టల్లో పనిచేసిన విద్యా రాణి, ఇటీవల సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చిలో చేరారు. ఆమె వృత్తిరీత్యా న్యాయవాది , సామాజిక కార్యకర్త. తన తండ్రి వీరప్పన్‌పై ఇప్పటికీ సానుభూతి ఉన్న ప్రాంతాల్లో ఆమెకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఓ వైపు ప్రధాన పారీ్టలు భారీ ఎత్తున నిధులు ఖర్చు చేస్తుంటే, విద్యా రాణి వీడియో సందేశంలో ఉద్వేగ పూరిత వ్యాఖ్యలతో ప్రజల నుండి చందాలు సేకరించే పనిలో పడ్డారు. చందనపు దుంగల, ఎనుగుల దంతాల స్మగ్లర్‌గా పశి్చమ పర్వత శ్రేణుల్లోని ఈరోడ్ జిల్లా సత్యమంగళం కేంద్రంగా ఒకప్పుడు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు ముచ్చెమటలు పట్టించిన వీరప్పన్ తనయ తాజాగా నిధుల కోసం ఎదురు చూడటం గమనార్హం.


