కుంగిపోతున్న జోషిమఠ్‌: పాతిక శాతం ఇళ్లకే పగుళ్లు!!.. ఉత్తరాఖండ్‌ సీఎం కీలక ప్రకటన

Uttarakhand CM Pushkar Dhami Key Statement On Joshimath Cracks - Sakshi

డెహ్రాడూన్‌: బ్రదినాథ్‌ లాంటి పుణ్యక్షేత్రానికి ద్వారంగా పేరున్న ఉత్తరాఖండ్‌ పట్టణం జోషిమఠ్‌ కుంగిపోతుండడం, ఇళ్లకు పగుళ్లు రావడంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి కీలక ప్రకటన చేశారు. జోషిమఠ్‌ ప్రభావిత కుటుంబాలకు ఇవాళ(గురువారం) సాయంత్రంకల్లా పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. అలాగే.. జోషిమఠ్‌లో కేవలం 25 శాతం ఇళ్లకు మాత్రమే పగుళ్లు వచ్చాయని ఆయన ప్రకటించారు. 

జ్యోతిమఠ్‌ కుంగిపోతుండడంతో.. కేవలం నాలుగోవంతు ఇళ్లకు మాత్రమే పగుళ్లు వచ్చాయి. బాధిత కుటుంబాలకు లక్షన్నర రూపాయల సాయాన్ని ఇవాళ సాయంత్రంకల్లా అందజేస్తాం. పూర్తి నివేదికలు అందిన తర్వాతే ఈ ప్రకటన చేస్తున్నాం. అలాగే.. ఇతర ఊళ్లలోనూ ఇలాంటి సమస్య ఉందేమో ప్రభుత్వం పరిశీలిస్తుంది. దానిని బట్టి నిర్ణయాలు తీసుకుంటాం అని సీఎం ధామి ప్రకటించారు. అంతకు ముందు జోషిమఠ్‌లో స్వయంగా పర్యటించిన ఆయన.. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులను అధైర్యపడొద్దని చెబుతూ.. సురక్షిత ప్రాంతాల తరలింపునకు అధికారులను ఆదేశించారు కూడా. ఆ మరునాడే ఆయన కీలక ప్రకటన చేయడం గమనార్హం.

జోషిమఠ్‌లో గత కొన్నేళ్లుగా భూమి కుంగిపోతూ వస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పిదాలు తోడు కావడంతోనే.. పరమ పవిత్ర ప్రాంతం కుంగుబాటుకు లోనవుతోంది. ఇళ్లకు, రోడ్లకు పగుళ్లు వస్తున్నాయి. జనాలు కొంతవరకు ఖాళీ చేసి వెళ్లిపోగా.. ఆరువందలకు పైగా ఇళ్లు, హోటళ్లలతో 20వేల మందికిపైగా ప్రభావితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రమాదకారకంగా ఉన్న భవనాలను పడగొట్టి.. వాళ్లకు తక్షణం తాత్కాలిక సదుపాయాల్ని అందజేస్తోంది ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. చైనా సరిహద్దులో కీలకంగా భావించే ఆర్మీ బేస్‌కి కూడా పగుళ్లు వస్తున్నాయి. 

గ్లేసియర్లు కరగడం, కన్‌స్ట్రక్షన్‌ పనులు, కొండల తవ్వకం, భూభాగం కిందుగా నీటి ప్రవాహం.. తదితర కారణాలతో ఈ పరిణామాలు సంభవిస్తున్నాయని పరిశోధకులు ఇప్పటికే ఓ అంచనాకి వచ్చారు. అభివృద్ధి పేరిట ఇక్కడ జరిగిన పనుల వల్లే.. 2021లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 200 మంది బలైయ్యారనే విమర్శ ఒకటి ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top