మరో వాణిజ్యనౌకపై అమెరికా దాడి  | US strikes tanker near Oman, sparking India protest over missing crew | Sakshi
Sakshi News home page

మరో వాణిజ్యనౌకపై అమెరికా దాడి 

Jun 11 2026 4:37 AM | Updated on Jun 11 2026 4:37 AM

US strikes tanker near Oman, sparking India protest over missing crew

ముగ్గురు భారతీయులు గల్లంతు  

అమెరికా ఉన్నతాధికారికి సమన్లు 

న్యూఢిల్లీ: ఒమన్‌లోని సోహర్‌ నగరానికి సమీప హార్మూజ్‌ జలసంధి సముద్రజలాల్లో వాణిజ్య నౌక ‘ఎంటీ సెటెబెల్లో’పై బుధవారం అమెరికా సైన్యం దాడికి దిగింది. ఆ సమయంలో నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దాడి ఘటనలో ముగ్గురి జాడ గల్లంతైంది. అంతే సంఖ్యలో భారతీయులున్న మరో చమురు రవాణా నౌక ‘ఎంటీ మ్యారీవెక్స్‌’పై అమెరికా రెండ్రోజుల క్రితం దాడి చేయడంపై భారత్‌ ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న వేళ ‘ఎంటీ సెటెబెల్లో’ నౌకపై దాడి జరగడం గమనార్హం. 

దాడి ఘటనపై భారత్‌ బుధవారం ఘాటుగా స్పందించింది. ఢిల్లీలో అమెరికా రాయబార కార్యాలయంలోని ఉన్నతాధికారి, చార్జ్‌డి అఫైర్స్‌ జేసన్‌ మీక్స్‌ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. ఈ మేరకు భారత్‌ అధికారిక ప్రకటన వెలువర్చింది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని మోదీ సర్కార్‌ తప్పుబట్టింది.

 పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఇకనైనా ఆపాలని డిమాండ్‌ చేసింది. అంతర్జాతీయ జలమార్గాలల్లో స్వేచ్ఛాయుత, నిరాటంకమైన నౌకాయానాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని పేర్కొంది. సెటెబెల్లో నౌకలోని 24 మంది భారతీయ సిబ్బందిలో ఇప్పటివరకు 21 మందిని రక్షించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోందని వార్తలొచ్చాయి.   
 

Advertisement
 
Advertisement
Advertisement