వచ్చేస్తోంది.. దేశంలో తొలి డిజిటల్‌ వర్సిటీ 

UGC Chairman Reveals First National Digital University - Sakshi

జాతీయ స్థాయిలో ఏర్పాటుకు యూజీసీ శ్రీకారం

దేశంలోని అనేక యూనివర్సిటీల అనుసంధానంతో సేవలు

విద్యార్థులకు అందుబాటులోకి బోలెడన్ని ఆన్‌లైన్‌ కోర్సులు

ఇకపై యూనివర్సిటీల్లో సీట్లు లేవనే మాటే ఉండదు

2023–24 విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి వచ్చే అవకాశం

దేశంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో డిజిటల్‌ యూనివర్సిటీ (ఎన్‌డీయూ) అందుబాటులోకి రాబోతోంది. 2023–24 విద్యాసంవత్సరం నుంచే దీని సేవలు ప్రారంభించేలా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) సన్నాహాలు చేస్తోంది. విద్యార్థులు కోరుకున్న కోర్సులను ఆన్‌లైన్‌ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం ప్రపంచస్థాయి ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆదేశాలతో యూజీసీ ఈ యూనివర్సిటీకి శ్రీకారం చుడుతోంది.

విద్యార్థుల వ్యక్తిగత ఆసక్తులను అనుసరించి వారి ఇంటివద్దే నచ్చిన కోర్సులను డిజిటల్‌ విశ్వవిద్యాలయం అందించనుంది. ఉన్నత విద్యాశాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సహా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలను ఇందులో భాగస్వామ్యం చేసి ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులకు వివిధ కోర్సులను అందుబాటులోకి తీసుకురానుంది. విద్యను అందించడం, పరీక్షలు నిర్వహించడం, సర్టిఫికెట్ల ప్రదానం వంటివన్నీ కేంద్రీకృత వ్యవస్థగా డిజిటల్‌ వర్సిటీ వ్యవహరిస్తుంది. ప్రస్తుతం వివిధ విద్యాసంస్థల ద్వారా అమలవుతున్న విధానాలకు భిన్నమైన రీతిలో ఈ యూనివర్సిటీ సేవలందించనుంది.  

హబ్‌–స్పోక్‌ మోడల్‌లో సేవలు 
స్పోక్‌ అండ్‌ హబ్‌ అంటే ఒక కేంద్రీకృత పంపిణీ వ్యవస్థలా డిజిటల్‌ వర్సిటీ పనిచేస్తుంది. సైకిల్‌ చక్రానికి హబ్‌ మాదిరిగా యూనివర్సిటీ ఉంటుంది. ఊచలు (స్పోక్‌) కేంద్ర ప్రదేశంలో కలుస్తూ తిరిగి అన్ని వైపులకు తమ సేవలను పంపిణీ చేసేలా వివిధ విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఇది పని చేయనుంది.

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థలన్నీ ఈ డిజిటల్‌ వర్సిటీ పరిధిలో తమ కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తేనున్నాయి. విద్యార్థులు తమ సంస్థలలో చదువుతూనే డిజిటల్‌ వర్సిటీ ద్వారా ఇతర సంస్థల కోర్సులను అభ్యసించడానికి వీలు కల్పిస్తుంది. వారు ఆ సంస్థల ద్వారా క్రెడిట్లను అందుకోగలుగుతారు. సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీలను ఈ క్రెడిట్ల ఆధారంగా వారు అందుకోగలుగుతారు.   

సీట్లు లేవనే సమస్య ఉండదు 
విద్యార్థి తాను కోరుకొనే వర్సిటీలో అభ్యసించాలనుకునే కోర్సులో చేరే వెసులుబాటును డిజిటల్‌ వర్సిటీ కల్పించనుంది. సీట్లు లేకపోవడం లేదా ప్రవేశ పరీక్షలో అర్హత సాధించకపోవడం వంటి వాటితో సంబంధం లేకుండా విద్యార్థులు ఆసక్తి ఉన్న కోర్సును అభ్యసించడానికి వీలవుతుంది. ప్రస్తుతానికి సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీలతో ప్రారంభమయ్యే ఈ వర్సిటీ సేవలు రానున్న కాలంలో పీజీ డిగ్రీలు, డాక్టరేట్లను కూడా అందించేలా యూజీసీ సన్నాహాలు చేస్తోంది. ఈ డిజిటల్‌ వర్సిటీ ద్వారా ప్రస్తుత వర్సిటీల్లో అదనపు సీట్ల ఏర్పాటు, అందుకు తగ్గ సిబ్బంది నియామకం, మౌలిక వసతుల కల్పన వంటి భారాలు తగ్గుతాయి.  

50% క్రెడిట్లు సాధిస్తేనే అర్హత 
విద్యార్థులు ఏ కోర్సులో అయినా 50 శాతం క్రెడిట్లు సాధిస్తేనే డిగ్రీలకు అర్హులవుతారు. ఈ క్రెడిట్లను ఒకేసారి కాకున్నా తమకు నచ్చిన సమయాల్లో సాధించినా డిగ్రీని ప్రదానం చేస్తారు. అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ ద్వారా విద్యార్థులు తమ క్రెడిట్లను బదలాయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ల్యాబ్‌లు, ప్రాక్టికల్‌ వర్కులతో సంబంధం లేని కోర్సులు మాత్రమే ప్రస్తుతం డిజిటల్‌ వర్సిటీ ద్వారా అందిస్తారు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం ఇప్పటికే డిజిటల్‌ యూనివర్సిటీ ద్వారా కోర్సులు అందించేందుకు రంగం సిద్ధం చేశాయి.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top