విజయ్‌కి సెక్యూరిటీ తొలగింపు | TVK Chief Vijay Security Convoy Removed | Sakshi
Sakshi News home page

విజయ్‌కి సెక్యూరిటీ తొలగింపు

May 7 2026 7:15 AM | Updated on May 7 2026 8:35 AM

TVK Chief Vijay Security Convoy Removed

తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో సస్పెన్స్‌ కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని టీవీకే అధినేత విజయ్‌ కోరగా గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌ అందుకు విముఖత వ్యక్తం చేశారు. సరిపడా సంఖ్యా బలం లేదని.. అది చూపించాకే ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో బలం పెంచుకునే పనిలో విజయ్‌ పడ్డారు. అయితే.. 

ఈలోపు ఆయనకు ఝలక్‌ తగిలింది. ఎన్నికల ఫలితాల్లో విజయ్‌ టీవీకే ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అత్యధిక స్థానాలు గెలవడంతో ఆయనే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం జరిగింది. దీంతో పోలీస్‌ శాఖ అప్రమత్తమై చెన్నైలోని ఆయన నివాసం ముందు భద్రతను పెంచింది. విజయ్‌ నివాసంతో పాటు టీవీకే కార్యాలయం, అలాగే టీవీకే ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్‌ వద్ద కూడా భారీ సంఖ్యలో పోలీసులు కనిపించారు. 

అయితే గవర్నర్‌ను కలిశాక పరిస్థితి మారిపోయింది. రాత్రి పట్టినపాకంలోని పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి బయల్దేరే సమయంలో విజయ్‌ సింగిల్‌ వెహికిల్‌లోనే ఇంటికి బయల్దేరారు. గత రెండ్రోజులుగా హడావిడి చేసిన కాన్వాయ్‌ కనిపించలేదు. ఆ సమయంలో ఆయన డల్‌గా కనిపించారు. పార్టీ శ్రేణుల వాహనాలు కూడా పెద్దగా ఆయన వెంట లేవు. 

సీఎం హోదాలో ఇచ్చే జెడ్‌ఫ్లస్‌ సెక్యూరిటీని విజయ్‌కు కేటాయించింది తమిళనాడు పోలీస్‌ శాఖ. అయితే తాజా పరిణామాలతో ఆ భద్రతను కనీసానికి కుదించినట్లు స్పష్టమవుతోంది. అలాగే నివాసం వద్ద నుంచి కూడా సిబ్బందిని బాగా తగ్గించినట్లు సమాచారం. బుధవారం సాయంత్రం ఆర్బీ చౌదరికి నివాళులర్పించి.. ఆయన తనయుడు జీవా(కోలీవుడ్‌ హీరో)ను విజయ్‌ ఓదార్చారు. ఆ సమయంలోనూ విజయ్‌ వెంట పెద్దగా సెక్యూరిటీ లేదు.

మరోవైపు.. గవర్నర్‌ విజయ్‌ను కలిశాక మరో పరిణామం చోటు చేసుకుంది. టీవీకే కీలక నేత, ఎమ్మెల్యే అథర్వ్‌ అర్జున మరోసారి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానించాలని కోరారు. ముందుగా సీఎంగా విజయ్‌ ప్రమాణం చేస్తారని.. ఆ తర్వాత శాసనసభలో బలనిరూపణ చేసుకుంటామని విజ్ఞప్తి చేశారు. అయితే.. ముందు మ్యాజిక్‌ ఫిగర్‌ (118) చూపించాకే ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేసుకోవాలని గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ తేల్చి చెప్పారు. దీంతో తమిళ రాజకీయం రసకందాయంలో పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement