రసాభాసగా మారిన ఈసీ–టీఎంసీ భేటీ
గొడవపడిన టీఎంసీ ఎంపీలపై సీఈసీ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియపై దృష్టిసారించాల్సిన ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర అధికారులు బీజేపీ నేతలతో అంటకాగుతున్నారంటూ తృణమూల్‌కాంగ్రెస్ చేసిన ఆరోపణలతో ఆ పార్టీ నేతలు, ప్రధాన ఎన్నికల కమిషన్ సభ్యుల మధ్య జరిగిన సమావేశం కొన్ని నిమిషాల్లోనే రసాభాసగా మారి అర్ధంతరంగా ముగిసింది. తర్వాత అటు ఈసీ, ఇటు టీఎంసీ నేతలు పరస్పర ఆరోపణలు గుప్పించుకున్నారు. సమావేశంలో వాగ్వాదం జరగడానికి మీరే కారణమని రెండు వర్గాలూ వాదించుకున్నాయి. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఈ వాగ్వాదానికి వేదికగా మారింది.
బీజేపీ ముఖ్యులతో ఎన్నికల అధికారులకు సత్సంబంధాలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)లో లోపాలను ఎత్తిచూపుతూ తృణమూల్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాసిన పలు లేఖలను టీఎంసీ ప్రతినిధి బృందం ఈసీకి అందజేసింది. భేటీ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఒబ్రియాన్, సాగరికా ఘోష్, ఎంపీలు సాకేత్ గోఖలే, మేనకా గురుస్వామిల ప్రతినిధి బృందం ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ సారథ్యంలోని ఎన్నికల సంఘానికి ఈ లేఖలను ఇచ్చారు.
ఈ సందర్భంగా బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో స్థానిక బీజేపీ నేతతో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు ఉన్న అనుబంధం సహా ఆరు ఘటనల సాక్ష్యాధారాలతో టీఎంసీ నేతలు అందించారు. ఎస్‌ఐఆర్ పేరిట లక్షలాది నిజమైన ఓటర్ల పేర్లను జాబితాను నుంచి తొలగించారని టీఎంసీ నేతలు వాదించారు. మమత రాసిన 9 లేఖలను సీఈసీకి ఇచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నికల అధికారులను రాష్ట్రం నుంచి బదిలీచేయాలని డిమాండ్‌చేశారు.
భేటీ అర్ధంతరంగా ముగిశాక మీడియాతో ఓబ్రియాన్ మాట్లాడారు. ‘‘ఆరోపణలున్న అధికారుల సమక్షంలో పారదర్శకంగా ఎన్నికలు ఎలా జరుపుతారు? అని ప్రశ్నించాం. అందుకు సీఈసీ సమాధానం చెప్పాల్సిందిపోయి మీరంతా బయటకు వెళ్లండి అని గెంటేశారు. గతంలో 8–9 సార్లు ఎలక్షన్ కమిషన్‌తో భేటీ అయ్యాం. ప్రతిసారీ సీఈసీనే మాట్లాడారు. ఎవరినీ మాట్లాడనివ్వట్లేరు. అందుకే ఈసారి తిరిగొచ్చేటప్పుడు ఆయనను అభినందించా. పదవి నుంచి తొలగించాలని ఏకంగా పార్లమెంట్‌లో మీకు వ్యతిరేకంగా నోటీసులు జారీఅయ్యాయి అని చెప్పి బయటికొచ్చేశా’’అని ఓబ్రియాన్ వెల్లడించారు.
ఇష్టారీతిన మాట్లాడారు: ఈసీ
వాగ్వాదంపై ఈసీ తన వాదనను తర్వాత ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేసింది. ‘‘టీఎంసీ ప్రతినిధి బృందంతో ఈసీ ఉన్నతాధికారులు నిక్కచ్చిగా మాట్లాడారు. టీఎంసీ ఎంపీ ఓబ్రియాన్ గట్టిగా అరుస్తూ ఎలక్షన్ కమిషనర్లలో ఎవరినీ మాట్లాడనివ్వలేదు. హోదా మరచి అనుచితంగా ప్రవర్తించారు. ఆరోపణల అంశంపై సీఈసీ మాట్లాడబోతే ఆయననూ ఓబ్రియాన్ అడ్డుకున్నారు. దాంతో సీఈసీ ఆగ్రహంతో బయటకు వెళ్లండి అని చెప్పాల్సి వచ్చింది.
పోలింగ్‌కేంద్రాల్లో రిగ్గింగ్, బూత్ జామింగ్, సోర్స్ జామింగ్ వంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని ఈసీ హెచ్చరించింది. ప్రతినిధి బృందంలో ముందుగా అనుమతి పొందిన వ్యక్తులు ఎందుకు రాలేదని నిలదీశాం. వాళ్లలో అసహనం పెరిగింది’’అని ఈసీ పేర్కొంది. ఈసీ వివరణపై టీఎంసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ముక్కుసూటిగా మాట్లాడటంతోనే మాకు కోపం వచ్చిందని ఈసీ చెబుతోంది. మరి ఇంతే ముక్కుసూటిగా బీజేపీ నేతలకు ఆదేశాలిచ్చే దమ్ము ఈసీకి ఉందా?’’అని టీఎంసీ నాయకురాలు సాగరికా ఘోష్ ప్రశ్నించారు.


