సాక్షి, చైన్నె: ‘మేమే ప్రత్యామ్నాయం.. సరికొత్త స్వచ్ఛమైన రాజకీయ శక్తి’ అంటూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇచ్చి, 108 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన ‘తమిళనాడు వెట్రి కళగం’ అధినేత విజయ్ సీఎం పగ్గాలు చేపట్టి మూడు వారాలు అయింది. సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పుడు విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో మార్పు కోసం ఓట్లేసి గెలిపించిన సామాన్య ప్రజలు, క్షేత్రస్థాయి సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం విజయ్ ముందు 7 కీలక ప్రశ్నలను ఉంచుతున్నారు. వీటిని సామాజిక మాధ్యమాల రూపంలో, లేఖల రూపంలో విజయ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారింది.
1.శాంతిభద్రతలు – మహిళల భద్రత
ఎన్నికల ప్రచారంలో ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అని విమర్శించిన విజయ్, అధికారంలోకి రాగానే శ్రీసింగప్పెన్ అదిరడి పడైశ్రీ (మహిళా స్పెషల్ ఫోర్స్) పథకంపై తొలి సంతకాల్లో ఒకటి చేశారు. అయితే, ఇది ఆచరణలో గత ప్రభుత్వంలో ఉన్న పింక్ పెట్రోల్ పథకానికి కేవలం పేరు మార్చడమే (స్టిక్కర్ రాజకీయం) అని విమర్శలు వస్తున్నాయి. గత 15 రోజుల్లోనే రాష్ట్రంలో 19 లైంగిక నేరాలు నమోదయ్యాయని గణాంకాలు చెబుతుండటంతో, మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకోబోయే నిర్మాణాత్మక చర్యలేమిటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
2.అవినీతి నిర్మూలన – రిజిస్ట్రేషన్ శాఖ
గత డీఎంకే ప్రభుత్వం చివర్లో తెచ్చిన శ్రీస్టార్ 3.0శ్రీ సాఫ్ట్‌వేర్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసినా, ఇంటర్నెట్ పరిజ్ఞానం లేని సామాన్యులకు దళారీల వేధింపులు ఇంకా తప్పడం లేదు. భూమి పత్రాల సవరణ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఖజానా ఖాళీ అయింది.. శ్వేతపత్రం విడుదల చేస్తాం అని ప్రకటించిన సీఎం విజయ్, ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రిజిస్ట్రేషన్ , ఆర్‌టీవీ కార్యాలయాల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అవినీతిని ఎలా అంతమొందిస్తారనే అంచనాలు పెరిగినట్టు ఎదురు చూస్తున్నారు.
3.మహిళల నిరీక్షణ – ఉచిత గ్యాస్, బస్సు ప్రయాణం
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్నపూర్ణి సూపర్ సిక్స్ పథకం కింద ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, కుటుంబ మహిళలకు నెలకు రూ. 2,500 పెట్టుబడి సాయం, శ్రీవెట్రి పయన తిట్టంశ్రీ కింద అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి హామీల అమలు కోసం మహిళా లోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ప్రశ్నించే వారు అధికమయ్యారు. తమకు ఉచిత ఫ్రిజ్‌లు, రూ. 8,000 కూపన్లు వద్దు.. నిజమైన మార్పు కావాలి అని ఓట్లేసిన తమ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నినాదిస్తున్నారు.
4.నిరుద్యోగ యువత – నన్బాస్, నన్బీస్ ఆశలు
తమిళనాడు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే కేటాయిస్తామని, ఉన్నత చదువుల కోసం భరోసా లేకుండా రూ. 20 లక్షల వరకు విద్యా రుణాలు ఇస్తామని, నిరుద్యోగ యువతకు రూ. 4,000 భృతి కల్పిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. అయితే, రెండు వారాల పాలనలో యువత సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించలేదని సామాన్య యువత అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
5.మత్స్యకారుల సమస్య – కచ్చతీవుపై మౌనం
శ్రీలంక నావికాదళం చేతిలో బందీలుగా చిక్కుకున్న తమిళనాడు మత్స్యకారులను, వారి పడవలను విడిపించాలని కేంద్రానికి లేఖలు రాయడం వంటి ప్రక్రియ పాత పద్ధతిలోనే రాష్ట్రంలో కొనసాగుతోంది. మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ కచ్చతీవు వివాదంపై నో కామెంట్స్ అని దాటవేయడం మత్స్యకార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సున్నితమైన అంశంపై సీఎం విజయ్ స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని తీరప్రాంత ప్రజలు కోరుతున్నారు.
6.ప్రభుత్వ ఉపాధ్యాయుల డిమాండ్లు
ప్రభుత్వ బదిలీలు, పదోన్నతుల్లో అవినీతిని అంతమొందిస్తామని టీవీకే హామీ ఇచ్చింది. అయితే, మే నెల ముగుస్తున్నా ఉపాధ్యాయుల సాధారణ బదిలీల కౌన్సెలింగ్‌పై ఎలాంటి ప్రకటన రాలేదు. గత ప్రభుత్వం తెచ్చిన జీవో 243 (రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్)ను రద్దు చేయాలని జాక్టో–జియో వంటి ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బదిలీల ప్రక్రియలో పారదర్శకతను పాటిస్తారా లేదా అని ఉపాధ్యాయ లోకం నిలదీస్తుంటం గమనార్హం.
7.రైతుల ఆవేదన – రుణమాఫీపై అసంతృప్తి
వ్యవసాయ రుణాల పూర్తి మాఫీపై ప్రభుత్వం ఇచ్చిన హామీకి, ప్రస్తుత ఉత్తర్వులకు పొంతన లేదని రైతులు మండిపడుతున్నారు. సహకార బ్యాంకుల్లో రూ. 50 వేల వరకు రుణం ఉన్న చిన్న, సన్నకారు రైతులకు పూర్తి మాఫీ అని, అంతకు మించి ఉన్నవారికి రేషియో పద్ధతిలో మాఫీ అని ప్రభుత్వం ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూమి పరిమాణాన్ని బట్టి కాకుండా, రుణ మొత్తాన్ని బట్టి రైతులను వర్గీకరించడం మోసపూరితమని వామపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. అలాగే, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తాకు రూ. 60 వరకు వసూలు చేస్తున్న అక్రమాలను అరికట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


