అది మాకు కష్టమైన పనే: సుప్రీంకోర్టు | Supreme Court In Sabarimala Case | Sakshi
Sakshi News home page

అది మాకు కష్టమైన పనే: సుప్రీంకోర్టు

Apr 16 2026 6:04 PM | Updated on Apr 16 2026 6:53 PM

  Supreme Court In Sabarimala Case

న్యూఢిల్లీ: సామాజిక సంక్షేమం, సంస్కరణల పేరిట ఏ మతంలోని సారాన్నీ తీసివేయలేమని సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. శబరిమల ఆలయంలో తరుణ వయస్సు మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ ఇచ్చిన ఆదేశంపై పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. 

సామాజిక సంస్కరణ పేరిట మతానికి సంబంధించిన ఆచారాలను తొలగించలేమని తొమ్మిది న్యాయమూర్తుల బెంచ్ తెలిపింది. లక్షలాది మంది నమ్మకాల్ని తప్పు అని ప్రకటించడం అత్యంత కష్టమైన పనుల్లో ఒకటని పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ప్రస్తుతం శబరిమల కేసుకు సంబంధించిన కీలక రాజ్యాంగ ప్రశ్నలపై వాదనలు వింటోంది.

ముఖ్యంగా మత స్వేచ్ఛ, సామాజిక సంస్కరణ మధ్య సమతుల్యతపై చర్చ జరుగుతోంది. 2018లో సుప్రీంకోర్టు అన్ని వయస్సుల మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. పరిమితులను అత్యవసర మత ఆచారంగా పరిగణించలేమని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ తెలిపింది. 10 నుంచి 50 సంవత్సరాల మధ్య మహిళలు, బాలికలు ఆలయంలోకి రాకూడదనే ఆచారాన్ని దాదాపు అంటరానితనంతో సమానమని పేర్కొంది.

తాజాగా జరిగిన విచారణ సమయంలో మత సంబంధిత విషయాల్లో ప్రజాహిత వ్యాజ్యాల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై వాదనలకు స్పందిస్తూ.. లక్షలాది మంది నమ్మకాల్ని తప్పు అని కోర్టు ఎలా ప్రకటించాలన్నదే అత్యంత కఠినమైన సమస్యగా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్య కాంత్ వ్యాఖ్యానించారు. 

కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని అనుచితమని ప్రకటించడం న్యాయస్థానాలకు కష్టమైన పనేనని తెలిపారు. ట్రావెన్కోర్ దేవస్థాన మండలి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. మతంపై నమ్మకం లేని వారు వాటిని ప్రశ్నిస్తూ దాఖలు చేసే పిటిషన్లను విచారణకు స్వీకరించడం సరైనదేనా? అని అన్నారు. అయ్యప్ప ఆలయాలు ఎన్ని ఉన్నా శబరిమలలోని ఆలయం చాలా విశిష్టమైనదని తెలిపారు. ఆచారాలను మహిళలపై వివక్షగా భావించొద్దని అన్నారు. 10-50 ఏళ్ల మధ్య వయసున్న బాలికలు, మహిళల ప్రవేశంపై మాత్రమే ఆంక్షలున్నాయని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement