
అభ్యర్థుల వివరాలను ఆమూలాగ్రం పరిశీలిస్తున్న సుప్రీం కొలీజియం
రెండు రోజుల్లో 54 మంది ఇంటర్వ్యూలు పూర్తి
దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో 371 ఖాళీలు
తెలంగాణలో 16, ఏపీలో ఎనిమిది జడ్జీ పోస్టులు ఖాళీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న జడ్జీ పోస్ట్‌లను భర్తీ చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం తన ఎంపిక విధానాన్ని మరింతగా కఠినతరం చేసింది. అనధికారిక వర్గాల సమాచారం ప్రకారం జూలై ఒకటో తేదీ నుంచి రెండు రోజుల్లో 54 మంది అభ్యర్థులతో ముఖాముఖి సమావేశమై వారి సమగ్ర వివరాలను కొలీజియం పరిశీలించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లతో కూడిన కోలీజియం జూలై 1, 2 తేదీల్లో అభ్యర్థులతో విస్తృతంగా ఇంటర్వ్యూలు నిర్వహించింది. మొదటి రోజున 20 మందితో, రెండో రోజున 34 మందితో సమావేశమైంది.
అభ్యర్థుల పనితీరు, బయోడేటా, అనుభవం వంటి అంశాలపై అరగంటపాటు ప్రశ్నలు సంధిస్తూ క్షుణ్ణంగా పరిశీలించింది. ఇప్పటివరకు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) రిపోర్టులు, అలాగే సంబంధిత హైకోర్టులకు చెందిన సుప్రీంకోర్టు జడ్జిల అభిప్రాయాలపైనే ఆధారపడుతూ నియామకాలు జరిగేవి. కొలీజియం ఇప్పటికే చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంతో సిఫారసుల ఆమోదంలో ఆలస్యాలు రావడం వల్ల సమస్యలు ఎదుర్కొంటోంది. కొంతమంది అభ్యర్థులు వీలైనంతకాలం ఎదురు చూడలేక తమ అభ్యర్థిత్వం వెనక్కి తీసుకోవడం కూడా జరిగిపోయింది.
అయితే ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో లభించిన అప్రకటిత నగదు కేసు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు వంటి పరిణామాల నేపథ్యంలో కొలీజియం ఈసారి తన పరిశీలనను కఠినతరం చేసింది. ఇందులో భాగంగా, జిల్లా న్యాయవ్యవస్థ నుంచి వచ్చే అభ్యర్థుల కోసం ఒక రోజు, బార్ అభ్యర్థుల కోసం మరొక రోజు కేటాయించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో 371 ఖాళీలుండగా ఇందులో తెలంగాణ హైకోర్టులో 16, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 8 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.