
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి యువత.. అతిగా వ్యవహరిస్తున్నారు. ఒడిశాలో 'స్పైడర్‌మ్యాన్' వేషధారణలో బైక్‌పై స్టంట్లు చేసిన ఓ యువకుడికి పోలీసులు షాక్ ఇచ్చారు. రూ. 15,000 జరిమానా విధించారు. ఒడిశాలోని రౌర్కెలాలో ఈ ఘటన జరిగింది. "స్పైడర్‌మ్యాన్" డ్రెస్‌లో అధిక వేగంతో రోడ్డుపై బైక్ నడుపుతూ కనిపించాడు. కనీసం హల్మెట్ కూడా లేకుండా నేనే స్పైడర్‌మ్యాన్ అంటూ స్టంట్లు చేస్తూ.. వాహనదారులు, పాదచారులకు తీవ్ర అసౌకర్యం కలిగించాడు.
పెద్దగా శబ్ధం చేసే విధంగా మోడిఫైడ్ లౌడ్ సైలెన్సర్‌తో హల్‌చల్ చేశాడు. ఆ యువకుడి ఓవర్‌యాక్షన్‌కు ట్రాఫిక్ పోలీసులు బ్రేక్‌లు వేశారు. అతని బైక్‌ను స్వాధీనం చేసుకుని రూ. 15,000 జరిమానా విధించారు. హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, వేగం, మోడిఫైడ్ లౌడ్ సైలెన్సర్ వాడినందుకు జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇలాంటి ఘటనలు తరుచూ వెలుగులోకి వస్తున్నాయి. గత ఏడాది ఢిల్లీలో స్పైడర్‌మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తులు ధరించిన ఓ జంట బైక్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ.. పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఢిల్లీలో జరిగినట్లు తెలిసింది. ప్రమాదకరమైన విన్యాసాలు చేయడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ పాటించని కారణంగా ఢిల్లీ పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారు 20 ఏళ్ల ఆదిత్య మరియు 19 ఏళ్ల అంజలి అని తెలుస్తోంది.
ఢిల్లీలోనే జరిగిన మరో ఘటనలో స్పైడర్‌మ్యాన్ వేషంలో ఉన్న ఒక వ్యక్తి ఎస్‌యూవీ బానెట్‌పై కూర్చొని విన్యాసాలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. స్పైడర్ మ్యాన్ వేషంలో ఉన్న వ్యక్తిని నజాఫ్‌గఢ్ నివాసి ఆదిత్య (20) గా గుర్తించారు. మరో వైపు, వాహనం నడుపుతున్న వ్యక్తిని మహావీర్ ఎన్‌క్లేవ్ నివాసి గౌరవ్ సింగ్‌కు కూడా పోలీసులు జరిమానా విధించారు.