
మౌ: ఉత్తరప్రదేశ్‌లోని ఎంపీ/ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను పరారీలో ఉన్న నేరగాడిగా ప్రకటించింది. ఘోసి ఎమ్మెల్యే సుధాకర్ సింగ్‌పై దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం నమోదైన కేసుపై గురువారం మౌలో ప్రత్యేక న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దొహారీఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ విద్యుత్ ఉప కేంద్రం వద్ద 1986లో విద్యుత్ కోతలకు నిరసనగా ఆందోళన జరిగింది.
ఈ సమయంలో సుధాకర్ సింగ్ అధికారుల అనుచితంగా ప్రవర్తించడంతోపాటు విధ్వంసానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదైంది. అప్పట్లో ఈ ప్రాంతం ఆజంగఢ్ జిల్లా పరిధిలో ఉండటంతో విచారణ చేపట్టిన ఆజంగఢ్ కోర్టు సింగ్‌కు బెయిలిచ్చింది. అనంతరం, ప్రత్యేక జిల్లాగా మారడంతో కేసు ఆజంగఢ్ నుంచి మౌకు మారింది. కేసు విచారణకు హాజరు కావడం లేదంటూ మౌ కోర్టు 2023లో సింగ్‌ను పరారీలో ఉన్న నేరగాడి ప్రకటించింది. తాజాగా, ఈ కేసును విచారించిన న్యాయస్థానం మరోసారి సింగ్‌ను పరారీలో ఉన్నట్లు ప్రకటించింది.