ట్రైన్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా.. ఇది చ‌ద‌వండి! | south central railway ticket cancellations full details | Sakshi
Sakshi News home page

South Central Railway: ట్రైన్ టికెట్ల ర‌ద్దు.. ఆదాయం ఎంతంటే?

Jul 11 2025 5:06 PM | Updated on Jul 11 2025 5:37 PM

south central railway ticket cancellations full details

దూర ప్ర‌యాణాలు అన‌గానే ముందుగా గుర్తుకు వ‌చ్చేది ట్రైన్‌. శుభ‌కార్యాలు, పండగ‌లు, ప‌నుల నిమిత్తం ఎక్కువ దూరం వెళ్లాల్సి వ‌చ్చిన‌ప్పుడు సాధార‌ణంగా రైలు ప్ర‌యాణానికే ప్రాధాన్య‌త ఇస్తుంటాం. అయితే ట్రైన్ జ‌ర్నీ చేయాలంటే ముందుగా టికెట్ రిజ‌ర్వు చేసుకోవాలి. పండ‌గ‌లు, సెల‌వులు, పెళ్లిళ్ల సీజ‌న్‌లో రైలు టికెట్ల‌కు ఫుల్ గిరాకీ ఉంటుంది. దీంతో వెయిటింగ్ లిస్టులు చాంతాడంత పేరుకుపోయి ఉంటాయి. ముందుగా బుక్ చేసుకున్న‌వారు టికెట్ క్యాన్సిల్ చేసుకుంటేనే వెయిటింగ్ లిస్ట్‌లోని వారికి ప్రాధాన్య‌తా క్ర‌మంలో టికెట్ దొరుకుతుంది. ప్ర‌యాణికులు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా, వెయిటింగ్ లిస్ట్‌లోని టికెట్ క‌న్ఫామ్ కాక‌పోయినా డ‌బ్బులు తిరిగి చెల్లిస్తుంది రైల్వే శాఖ‌. నిబంధ‌న‌ల మేర‌కు కొంత మిన‌హాయించుకుని మిగ‌తా మొత్తాన్ని మాత్ర‌మే ప్ర‌యాణికుల‌కు రిఫండ్ చేస్తుంది. టికెట్ క్యాన్సిలేష‌న్స్‌ ద్వారా రైల్వేకు భారీగానే ఆదాయం వ‌స్తోంద‌ని తాజాగా వెల్ల‌డైంది.

టికెట్ల ర‌ద్దు.. పెద్ద ప‌ద్దే!
సికింద్రాబాద్ కేంద్రంగా ప‌నిచేస్తున్న ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే.. టికెట్ క్యాన్సిలేష‌న్స్‌ (ticket cancellations) ద్వారా గ‌త నాలుగున్న‌రేళ్ల‌లో దాదాపు రూ. 700 కోట్లు ఆర్జించిన‌ట్టు తెలిసింది. ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే వార్షిక ఆదాయంలో ఇది 3.5 శాతం. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టీఐ ద‌ర‌ఖాస్తు ద్వారా ఈ వివ‌రాలు రాబ‌ట్టింది. ప్ర‌యాణికుల ద్వారా 2024-25లో ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వేకు వ‌చ్చిన‌ ఆదాయం రూ. 5,710 కోట్లు. 2024లో 1.4 కోట్ల టికెట్లు క్యాన్సిల్ కాగా, ఇందులో 65 ల‌క్ష‌లు వెయిటింగ్‌లిస్ట్‌లోనివే. టికెట్లు క్యాన్సిల్ చేసుకునే వెయిటింగ్‌లిస్ట్ ప్ర‌యాణికుల సంఖ్య‌ గ‌త 4 ఏళ్ల‌లో నాలుగింత‌లు పెర‌గ‌డం గ‌మ‌నార్హం. 2021లో 15.96 ల‌క్ష‌ల‌ టికెట్లు క్యాన్సిల్ కాగా, 2024లో ఈ సంఖ్య 65.62 ల‌క్ష‌ల‌కు పెరిగింది. ఈ ఏడాది జ‌న‌వరి నుంచి మే నెల‌ వ‌ర‌కు 31.52 ల‌క్ష‌ల టికెట్లు క్యాన్సిల్ అయ్యాయి. 

 

రిఫండ్ ఎంత‌?
రైల్వే నిబంధ‌న‌ల ప్ర‌కారం.. క‌న్ఫామైన టిక్కెట్‌ను.. ప్ర‌యాణానికి 12 నుంచి 48 గంట‌ల ముందు ర‌ద్దు చేసుకుంటే టికెట్ ధ‌ర‌లో 25 శాతం మిన‌హాయించుకుని మిగ‌తా మొత్తం జ‌మ అవుతుంది. ప్ర‌యాణానికి 4 నుంచి 12 గంట‌ల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే స‌గం మొత్తం మాత్ర‌మే రిఫండ్ వ‌స్తుంది. వెయిటింగ్‌లిస్ట్‌లోని టికెట్ క‌న్ఫామ్ కాకుంటే క్ల‌రిక‌ల్ చార్జి కింద రూ. 60 తీసుకుని మిగ‌తా మొత్తం తిరిగిచ్చేస్తారు.

'ర‌ద్దు'డే రుద్దుడు!
కాగా, రైల్వే శాఖ క్యాన్సిలేష‌న్ చార్జీలు ఎక్కువ‌గా వ‌సూలు చేస్తోంద‌ని ప్ర‌యాణికులు వాపోతున్నారు. క‌న్ఫార్మ‌డ్ టికెట్ బుక్ చేసినప్పుడు నామినల్ చార్జీలు తీసుకుంటున్నార‌ని, మరి వెయిటింగ్‌లిస్ట్‌లోని టికెట్ కన్ఫామ్ కాక‌పోయినా క్ల‌రిక‌ల్ చార్జి ఎందుకు వ‌సూలు చేస్తున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే ఒకేసారి ఎక్కువ టికెట్లు తీసుకోకుండా ఉండేందుకే క్యాన్సిలేష‌న్ చార్జీలు వ‌సూలు చేస్తున్న‌ట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు. త‌మ జోన్ వార్షికాదాయంలో క్యాన్సిలేష‌న్ చార్జీల ద్వారా వ‌చ్చే మొత్తం చాలా స్వ‌ల్ప‌మ‌ని ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే సీనియ‌ర్ అధికారి ఒక‌రు తెలిపారు.

చ‌ద‌వండి: మెట్రో రైల్లో ఇలాంటి అనుభ‌వం మీకు ఎదురైందా?

2024-25లో ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే ఆదాయ‌ గ‌ణాంకాలు
మొత్తం ఆదాయం: రూ.20,569 కోట్లు
స‌ర‌కు రవాణా: రూ.13,864 కోట్లు
ప్ర‌యాణికులు: రూ. 5,710 కోట్లు
పార్శిల్‌, టికెట్ చెకింగ్‌: రూ.513.6 కోట్లు
పార్కింగ్‌, కేట‌రింగ్‌, యాడ్స్‌: 402.7 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement