పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టుల పూర్తికి సంపూర్ణ సహకారం | Full support for the completion of pending railway projects | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టుల పూర్తికి సంపూర్ణ సహకారం

Sep 12 2025 5:17 AM | Updated on Sep 12 2025 5:17 AM

Full support for the completion of pending railway projects

సీఎం రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందిస్తున్న దక్షిణమధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్‌

రైలు–రోడ్డు–పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేసేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలి 

ఫ్యూచర్‌ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు వరకు అలైన్‌మెంట్‌ తయారు చేశాం  

ట్రిపుల్‌ ఆర్‌ చుట్టూరా 362 కిలోమీటర్ల మేర రింగ్‌రైల్‌ నిర్మాణం చేపట్టాలి 

రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికులకు వేగవంతమైన, రైలు–రోడ్డు–పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేసేలా రైల్వే ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులను కోరారు. రాష్ట్రంలోని పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులు, కొత్త ప్రతిపాదనలకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవతోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి  సీఎం రేవంత్‌రెడ్డి గురువారం పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సమీక్షించారు. వివరాలు సీఎం మాటల్లోనే.... 

పెండింగ్‌లో ఉన్న రైలు ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి  సహాయ సహకారాలు అందిస్తుంది. అవసరమైన నిధులను సమకూర్చటంతోపాటు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్‌మెంట్లు ఉండాలి. దూరాభారం తగ్గించి, అంచనా ఖర్చును కూడా తగ్గించుకోవాలి.  

– రాష్ట్ర పునరి్వభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్‌ నుంచి అమరావతికి ర్యాపిడ్‌ రైల్‌ అండ్‌ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉంది.  

– రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్‌ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్‌ వరకు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. అందుకు సంబంధించి 300 కిలోమీటర్ల అలైన్‌మెంట్‌ ప్రతిపాదనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది. దానికి అనుగుణంగా రైల్వేలైన్‌ ఏర్పాటు చేయాలి. రైల్వే విభాగ పరిశీలనలో ఉన్న అన్‌లైన్‌మెంట్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన అలైన్‌మెంట్‌ను పరిశీలించి భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలి. హైవే వెంట రైలుమార్గం ఉండాలి, హైవేకు ఇరువైపులా కిలోమీటరన్నర దూరం వరకు ఇండ్రస్టియల్‌ కారిడార్‌ను విస్తరించాలనే ప్రతిపాదనలున్నాయి. 

– కొత్తగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ప్రతిపాదనలకు అనుగుణంగా హైదరాబాద్‌–చెన్నై, హైదరాబాద్‌–బెంగుళూరు హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టుల సర్వే, అలైన్‌మెంట్‌ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలి. ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సదుపాయాలు అందించటంతోపాటు కొత్తగా వేసే రైలు మార్గాలన్నీ ఆయా ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలి. విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్ట్‌ కనెక్టివిటీని అధునాతనంగా అభివృద్ధి చేయాలి.  

– వికారాబాద్‌– కృష్ణా కొత్త రైల్వే లైన్‌ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలి. గద్వాల–డోర్నకల్‌ రైల్వే లైన్‌ పనుల డీపీఆర్‌ పూర్తి చేసి వేగంగా పనులు చేపట్టాలి. వరంగల్‌లోనూ రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలి. భూపాలపల్లి నుంచి వరంగల్‌ కొత్త మార్గాన్ని పరిశీలించాలి. కాజీపేట జంక్షన్‌లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలి. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్‌తోపాటు వరంగల్‌ను అభివృద్ధి చేయాలి. అందుకు అనుగుణంగా రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలి’అని ముఖ్యమంత్రి రైల్వే అధికారులకు సూచించారు. 

ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూరా రీజనల్‌ రింగ్‌ రైల్‌  
హైదరాబాద్‌ చుట్టూ రీజనల్‌ రింగ్‌ రైల్‌ ఆవశ్యకతను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైల్వే అధికారులకు వివరించారు. దాదాపు 362 కిలోమీటర్ల మేరకు రీజనల్‌ రింగ్‌ రోడ్డు వెంట రింగ్‌ రైలు ఏర్పాటు చేస్తే.. హైదరాబాద్‌ మహానగర భవిష్యత్‌ స్వరూపం మారిపోతుందన్నారు. వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రైల్వే అధికారులకు సీఎం సూచించారు. 

తెలంగాణ ఇండ్రస్టియల్‌ సెక్టార్‌ కోసం ప్రత్యేక రైల్వేలైన్‌ ఉండేలా ఈ కనెక్టివిటీ ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి వరంగల్‌ ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్‌అండ్‌బీ స్పెషల్‌ సెక్రెటరీ వికాస్‌రాజ్, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శ్రీనివాసరాజు, ఆర్థికశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement