అసెంబ్లీ ఎన్నికలు: నన్ను అడగకుండా నా పేరెలా ప్రకటిస్తారు

Sikha Mitra Comments On Announcing Her Name In Candidates List Without Her Consent - Sakshi

కోల్‌కతా : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు తమ వ్యూహాలను రచిస్తున్నాయి. సత్తా ఉన్న అభ్యర్థులను రంగంలోకి దించుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న బీజేపీ గురువారం అభ్యర్థుల రెండవ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో తన పేరు ఉండటంపై దివంగత కాంగ్రెస్‌ నాయకుడు సోమెన్‌ మిత్ర భార్య సిఖ మిత్ర మండిపడుతున్నారు. తనను సంప్రదించకుండానే కోల్‌కతా చౌరింఘీ నియోజకవర్గ అభ్యర్థిగా తన పేరును ప్రకటించారని ఆమె పేర్కొన్నారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘‘ లేదు! నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. నన్ను సంప్రదించకుండానే నా పేరును ప్రకటించారు. నేను బీజేపీలో జాయిన్‌ అవ్వటం లేదు’’ అని పేర్కొన్నారు. 

కాగా, కొద్దిరోజుల క్రితం బీజేపీ నాయకుడు సువేధు అధికారితో సిఖ మిత్ర భేటీ అయిన నేపథ్యంలో  ఆమె బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరిగింది. సిఖ మిత్ర తాజా ప్రకటనతో అవన్నీ ఒట్టి పుకార్లేనని తేలింది. దానికి తోడు అభ్యర్థి సమ్మతం లేనిదే పేరు ప్రకటించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యర్థి పార్టీలకు ఈ అంశం బ్రహ్మాస్త్రంగా మారింది. దీనిపై ఇతర పార్టీల నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘‘ 2021 బెంగాల్‌ ఎన్నికల కోసం బీజేపీ పార్టీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన ప్రతీసారి వారి ముఖాలపై పడ్డ గుడ్లతో ఓ ఆమ్లెట్‌ తయారు చేసుకోవచ్చు’’అని టీఎంసీ సీనియర్‌ నేత బెరెక్‌ ఓ బ్రియెన్‌ ఎద్దేవా చేశారు. 

చదవండి : భారత సమాఖ్య వ్యవస్థపై బీజేపీ ‘సర్జికల్ స్ట్రైక్’: దీదీ ఫైర్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top