శశి థరూర్ హిందీ వ్యామోహం.. నెటిజన్ల ట్రోలింగ్ | Shashi Tharoor post in Hindi Dinkar Poem | Sakshi
Sakshi News home page

శశి థరూర్ హిందీ వ్యామోహం.. నెటిజన్ల ట్రోలింగ్

Oct 12 2026 1:35 PM | Updated on Oct 12 2026 1:43 PM

Shashi Tharoor post in Hindi Dinkar Poem

న్యూఢిల్లీ: క్లిష్టమైన ఆంగ్ల పదజాలంతో మాట్లాడే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సోషల్ మీడియా ‘ఎక్స్‌’లో హిందీలో పోస్టులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ప్రఖ్యాత హిందీ కవి రామ్‌ధారీ సింగ్ ‘దినకర్’ రాసిన ‘జనతంత్ర కా జన్మ’ కవితలోని ‘సింహాసన్ ఖాలీ కరో కి జనతా ఆతీ హై’ (సింహాసనం ఖాళీ చేయండి, ప్రజలు వస్తున్నారు) అనే పంక్తులను ఆయన హిందీ, ఇంగ్లీష్ భాషల్లో షేర్ చేశారు. దీనితో పాటు రాహుల్ గాంధీ పోస్ట్‌ను ప్రస్తావిస్తూ ‘యహ్ సర్కార్ జాయేగీ’ (ఈ ప్రభుత్వం పోతుంది) అని హిందీ అనువాదం కూడా జతచేశారు.

ఎప్పుడూ హై-లెవల్ ఇంగ్లీష్ వాడే థరూర్ ఇటీవల కాలంలో వరుసగా హిందీ కవితలు, సూక్తులు పోస్ట్ చేయడంపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ప్రధానంగా హిందీ మాట్లాడే ఉత్తర భారత ప్రజలను ఆకట్టుకోవడానికే ఆయన ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

థరూర్ హిందీ పోస్టులపై సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతుంటాయి. ‘చివరికి షేక్స్‌పియర్‌ను పక్కనపెట్టి దినకర్ కవిత్వాన్ని చదువుతున్నారు, అసలైన అభిృద్ధి అంటే ఇదే’ అంటూ ఒక యూజర్ ఎద్దేవా చేయగా, ‘ఎవరికీ అర్థం కాని కవితలా మీరే మారిపోయారు’ అని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొందరు నెటిజన్లు దినకర్ ఒక గొప్ప జాతీయవాది అని, ఆయన భావాలను కాంగ్రెస్‌తో పోల్చలేమని వ్యాఖ్యానించారు.
 

ఓట్ల చోరీ ఆరోపణలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్‌తో విపక్ష ‘ఇండియా’ కూటమి సుప్రీంకోర్టు వైపు చేపట్టిన నిరసన ర్యాలీ నేపథ్యంలో ఈ పోస్టులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే, ఈ మార్చ్ సందర్భంగా విపక్ష నేతలను కలవడానికి చేసిన అభ్యర్థనను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ తిరస్కరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement