అలా తప్పించుకున్నారు! | Sakshi Special Story on Dalai Lama Succession history | Sakshi
Sakshi News home page

అలా తప్పించుకున్నారు!

Jul 5 2025 6:18 AM | Updated on Jul 5 2025 6:18 AM

Sakshi Special Story on Dalai Lama Succession history

సైనికుడి వేషంలో రాజభవనాన్ని విడిచి...

గడ్డకట్టే మంచులో 2 వారాలు ట్రెక్కింగ్‌  చేసి.. 

23 ఏళ్ల వయసులో భారత్‌కు దలైలామా సాహస యాత్ర

టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు, 14వ దలైలామా రేపు 90వ ఏట అడుగుపెట్టనున్నారు. ఆయన 66 ఏళ్లుగా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. 23 ఏళ్ల వయసులో భారత్‌లో అడుగుపెట్టిన ఆయన మరిక తిరిగి టిబెట్‌ వెళ్లనే లేదు. టిబెటన్లు బుద్ధుని అంశగా భావించి ఆరాధించే దలైలా­మా భారత్‌కు ఎందుకు వచ్చారు? 

బుల్లెట్లను, ద్రో­హాన్ని తప్పించుకుని ఒక యువ టిబెటన్‌ ఆధ్యాత్మిక నాయకుడు మనద ఏశానికి ఎలా చేరుకున్నా­రు? గడ్డకట్టుకుపోయే వాతావరణంలో, కఠినమైన దారుల్లో రెండు వారాలు ఎలా ప్రయాణించారు? ఇది టిబెట్‌ రాజకీయ కల్లోలాన్ని తెలిపే కథ. 

అది 1950ల చివరి కాలం. చైనా ఆక్రమణలతో టిబెట్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 1951లో బలవంతంగా సంతకం చేయించిన పదిహేడు పాయింట్ల ఒప్పందం, చైనా నియంత్రణలో ఉన్న టిబెటన్‌ ప్రజలకు మతపరమైన స్వయంప్రతిపత్తిని హామీగా ఇచ్చింది. కానీ స్వయంప్రతిపత్తి ఒక భ్రమ అని త్వరలోనే తెలిసొచ్చింది. 13వ దలైలామా ముందే చెప్పినట్టుగా టిబెట్‌పైనే కాదు, వారి మతంపైనా దాడి జరిగింది.

 చైనా సైనికులు టిబెట్‌ రాజధాని లాసాలో స్వేచ్ఛగా తిరుగడం, బౌద్ధ సన్యాసుల భూములను స్వా«దీనం చేసుకోవడంతో దలైలామా అధికారం క్షీణించడం ప్రారంభమైంది. రాజీ కోసం దలైలామా మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయతి్నంచినా లాభం లేకపోయింది. 1959 నాటికి, ప్రతిఘటనలు నిరసనగా మారాయి. తమ ఆధ్యాత్మిక గురువును నిర్బంధిస్తారని, లేదంటే చంపుతారని టిబెట్‌ ప్రజలు భయపడ్డారు. ఊహించనట్టుగానే లాసాను చైనా సైనిక దళాలు, ట్యాంకులు, ఫిరంగులు చుట్టుముట్టాయి.

 అదే రోజు, లాసాలో దలైలామాను అంగరక్షకులు లేకుండా వారి సైనిక ప్రధాన కార్యాలయంలో జరిగే నృత్య ప్రదర్శనకు హాజరు కావాలని చైనా జనరల్‌ కోరాడు. వేలాది మంది టిబెటన్లు వీధుల్లోకి వచ్చి, దలైలామా వేసవి రాజభవనమైన లాసాలోని నార్బులింగకా చుట్టూ మానవహారంంగా ఏర్పడ్డారు. రాజభవనంలో చర్చల తరువాత ఆ రాత్రి దలైలామా లాసాను విడిచి భారత్‌కు వెళ్లాలని నిర్ణయమైంది. మార్చి 17న పొగమంచు కమ్ముకున్న రాత్రి, ఎప్పుడూ మెరూన్‌ కలర్‌ దుస్తుల్లో ఉండే దలైలామా తనను ఎవరూ గుర్తు పట్టకుండా సైనికుడి యూనిఫాం ధరించారు.

 తల్లి, తోబుట్టువులు, ట్యూటరు, కొందరు విశ్వాసపాత్రులైన అధికారులు వెంట రాగా చీకటి నడుమ వెనుకద్వారం నుంచి రాజభవనాన్ని వీడారు. ౖచైనా సైన్యం చెక్‌పోస్టులను తప్పించుకుంటూ వారి బృందం ముందుకు నడిచింది. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ఎక్కువగా రాత్రిపూటే ప్రయాణించింది. చుషుల్, లోకా, కైచు లోయ గుండా, ఖెంజిమనే సమీపంలోని హిమాలయాలను దాటి, నేటి అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌కు చేరుకుంది. గడ్డకట్టుకుపోయే వాతావరణం. ఆహారం లేదు. పరిస్థితి అధ్వాన్నంగా ఉంది.

 అయినా కెచు నది దాటి, ఎత్తైన లోయల గుండా, మఠాలు, తిరుగుబాటు శిబిరాల గుండా ముందుకు సాగారు. ఒకసారి చైనీస్‌ నిఘా విమానం వీరిపైనుంచే వెళ్లింది. కానీ దాన్నుంచి తప్పించుకున్నారు. ఎట్టకేలకు మార్చి 26న భారత సరిహద్దుకు మైళ్ల దూరంలో ఉన్న లుంట్సే జోంగ్‌కు చేరుకుంది. వెంటనే ప్రధాని నెహ్రూకు సమాచారం అందింది. అప్పటికే చైనా నుంచి హెచ్చరికలున్నప్పటికీ ఖాతరు చేయ­కుండా నెహ్రూ నిర్ణయాత్మకంగా వ్యవహరించారు. తవాంగ్‌ సమీపంలోని చుటాంగ్ము సరిహద్దు పోస్టు­కు వెళ్లి, దలైలామా, ఇతర టిబెటన్‌ శరణార్థులకు స్వాగతం పలకాల్సిందిగా అస్సాం రైఫిల్స్‌ను ఆదేశించారు.

 మార్చి 31 నాటికి, దలైలామా, ఆయన పరివారం ఖెన్జిమనే పాస్‌ ద్వారా భారత్‌లోకి ప్రవేశించారు. భారత్, చైనాలను విడదీసే అంతర్జాతీయ సరిహద్దు మెక్‌మోహాన్‌ రేఖ సమీపంలో ఒక చిన్న పోస్ట్‌ వద్ద అస్సాం రైఫిల్స్‌కు చెందిన భారత జవాను హవల్దార్‌ నరేన్‌ చంద్ర దాస్‌ కంటికి అలసిపోయి, నలిగిన దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి సమీపించడం కనిపించింది. 

ఆయనే 14వ దలైలామా అని ఆయనకే కాదు.. చాలామంది భారతీయులకు తెలియదు. అలా దలైలామా భారత్‌లో అడుగు పెట్టారు. ఆ వెంటనే, ‘టిబెటన్‌ ఆధ్యాత్మిక నాయకునికి భారత్‌లో ఉండేందుకు స్వాగతం’అంటూ నెహ్రూ నుంచి సందేశం వచ్చింది. దాస్‌తో పాటు ఇతర అస్సాం రైఫిల్స్‌ సిబ్బంది దలైలామా, ఆయన పరివారాన్ని తవాంగ్‌కు తీసుకెళ్లారు. అక్కడ వారికి వైద్యం అందించారు. తరువాత కొన్ని నెలలు ఆయన ముస్సోరీలో ఉన్నారు. అనంతరం హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలకు వెళ్లారు. అప్పటినుంచీ అదే టిబెటన్ల ప్రవాస ప్రభుత్వ కేంద్రంగా మారింది. 

స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నా 
దలైలామా సాహసోపేత భారత యాత్రకు ఆరు దశాబ్దాలు నిండాయి. ‘నేను శరణార్థిని. అయినా భారత్‌లో స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాను’అని దలైలామా అనేక సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, భారత్‌లో తనకు స్వాగతం పలికిన హవల్దార్‌ నరేన్‌ చంద్ర దాస్‌ను 2017లో కలిసి భావోద్వేగానికి లోనయ్యారు కూడా! అప్పటికి దాస్‌కు 79 ఏళ్లు కాగా దలైలామాకు 81 ఏళ్లు. ‘‘నేను కూడా వృద్ధుడిని అయ్యానని మీ ముఖం చూస్తుంటే నాకర్థమైంది. 58 ఏళ్ల కిందట నాకు భారత్‌లో రక్షణగా నిలిచినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది’’అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. దలైలామాను అనుసరించి చాలామంది టిబెట్‌ను విడిచి భారత్‌కు చేరారు. కానీ టిబెట్‌ సమస్యకు ఇప్పటికీ పరిష్కారం లభించలేదు. 60 ఏళ్లకిందట ౖసైనికుడి వేషంలో దలైలామా భారత్‌లో అడుగుపెట్టినప్పుడు టిబెట్‌ పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. లక్షలాది మంది టిబెటన్ల రాజకీయ, మత, సాంస్కృతికి జీవితాలపై ఇప్పటికీ కత్తి వేలాడుతూనే ఉంది. 

 – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement