హైదరాబాద్‌కు చెందిన ఓ టెకీ గ్యాస్ బుకింగ్ చేసుకున్నాడు. ఎప్పటిలాగే ఆన్‌లైన్ పేమెంట్ యాప్ ద్వారా చెల్లింపు చేశాడు. బుకింగ్ కన్ఫర్మ్ అయ్యిందని.. వారం రోజుల్లో సిలిండర్ డెలివరీ అవుతుంది ఓ మెసేజ్ వచ్చింది. కానీ, వెంటనే రావాల్సిన డీఏసీ కోడ్ మాత్రం రాలేదు. అయితే ఇంకా టైం ఉంది కదా అని కూల్‌గా ఉండిపోయాడు. వారం గడిచింది..
డీఏసీ కోడ్, సిలిండర్.. రెండూ రాలేదు. పది రోజులకు డీఏసీ కోడ్ వచ్చింది. హమ్మయ్యా.. ఇక రేపో, మాపో సిలిండర్ వస్తుంది లే అనుకున్నాడు. కానీ పేమెంట్ చేసి రెండు వారాలు గడిచినా సిలిండర్ రాకపోవడంతో అసహనానికి గురయ్యాడు. డెలివరీ బాయ్స్ అని అడిగితే.. ఏం చేయలేమన్న సమాధానం. గ్యాజ్ ఏజెన్సీ వద్దకు వెళ్తే వాళ్లూ చేతులెత్తేశారు. దీంతో సిలిండర్ ఎప్పుడు వస్తే.. అప్పుడే అన్నట్లు ఉండిపోయాడు. ఒక హైదరాబాద్‌లోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో, ఆ మాటకు వస్తే దేశంలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితితేనే ఎదుర్కొంటున్నారు వినియోగదారులు.
దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేనేలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ అయితే.. ఓ అడుగు ముందుకు వేసి ఎన్ని ఎల్పీజీ సిలిండర్లు పంపిణీ అయ్యాయో లెక్కలేసి చెబుతోంది. వినియోగదారులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని ప్రభుత్వం, మంత్రిత్వ శాఖ చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగానే కనిపిస్తోంది.
ఇదో భారీ స్కామ్?!
ఎల్పీజీ సిలిండర్ సరఫరాలో ఆలస్యానికి ‘గోస్ట్ డెలివరీలు’ ప్రధాన కారణంగా తెలుస్తోంది. అంటే.. బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు చెప్పిన టైంలో సిలిండర్ అందదు. కొన్ని సందర్భాల్లో ఏకంగా సిలిండర్ డెలివరీ అయినట్లు మెసేజ్ మాత్రం వస్తుంది. అలా.. డెలివరీ అయ్యిందని రికార్డుల్లోకి ఎక్కుతోంది. ఆందోళన చెందుతున్న కస్టమర్లకు ఏదో ఒకటి సర్ది చెబుతున్నారు. కొన్నిరోజులు పోయాక.. నెమ్మదిగా మరో సిలిండర్‌ను కస్టమర్లకు అడ్జస్ట్ చేసి అందిస్తున్నారు. మరి మధ్యలో ఆ సిలిండర్ ఏమైనట్లు?..
అలాంటి వాటిని బ్లాక్ మార్కెట్‌లోకి చేర్చి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. తాజాగా ఢిల్లీ, మహారాష్ట్ర, పుణేతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్నిచోట్ల అధికారుల దాడుల్లో పెద్ద సంఖ్యలో సిలిండర్లు పట్టుబడ్డాయి. ఎస్‌ఎంఎస్, ఐవీఆర్‌ఎస్ లేదంటే మనీపే యాప్‌ల ద్వారా బుకింగ్ చేసిన ఎల్పీజీ సిలిండర్ల విషయంలో ఇలా ప్రధానంగా జరుగుతోందని గుర్తించారు.
గోస్ట్ డెలివరీ స్కామ్ కారణంగా వినియోగదారుడు తీవ్ర గందరగోళానికి గురవుతున్నాడు. కొందరైతే మళ్లీ బుకింగ్ చేసుకుని మరీ ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. గ్యాస్ కంపెనీలు మాత్రం గోస్ట్ డెలివరీ ఆరోపణల్ని తోసిపుచ్చుతున్నాయి. తమ యాప్‌లు క్రాష్ కావడం, సర్వర్ సమస్యలు, బుకింగ్.. డెలివరీ రికార్డుల్లో లోపాల వల్లే ఆలస్యం జరుగుతోందని చెబుతున్నాయి.
ఇలా చేయండి..
సిలిండర్ డెలివరీకి డీఏసీ(Delivery Authentication Code) కోడ్ అనేది తప్పనిసరి. ఆ కోడ్ చెబితేనే డెలివరీ బాయ్ సిలిండర్ ఇస్తాడు. కానీ, ఘోస్ట్ డెలివరీ దందా ఆ కోడ్‌తో సంబంధం లేకుండానే నడుస్తోందని తెలుస్తోంది. మీకు DAC కోడ్ రాకపోవడం లేదంటే డెలివరీ ఆలస్యం అవ్వడం వెనుక సిస్టమ్ లోపాలతో పాటు డీలర్ల దుర్వినియోగం, బ్లాక్ మార్కెట్‌కి మళ్లింపు కారణాలు ఉండే అవకాశం ఉండొచ్చు. కాబట్టి డీఏసీ కోడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మోసం జరిగితే ఆలస్యం చేయకుండా వెంటనే కస్టమర్ కేర్‌కి ఫిర్యాదు చేయండి.
బుకింగ్ వివరాలు, నగదు చెల్లింపు రసీదులు, స్క్రీన్‌షాట్‌లను భద్రంగా ఉంచుకోండి. ఇవి ఫిర్యాదుల టైంలో సాక్ష్యంగా ఉపయోగపడతాయి.
సిలిండర్ రాలేదన్న ఆందోళనతో డబ్బులు చెల్లించి మళ్లీ డబుల్ బుకింగ్ చేస్కోవద్దు
డీఏసీ కోడ్ రాకుండా.. సిలిండర్లతో గ్యాస్ ఏజెన్సీలకు, గోదాంలకు పరుగులు తీయొద్దు
ఆన్‌లైన్ మోసాలు జరిగే అవకాశం ఉంటుంది గనుక అధికారిక పోర్టల్/మనీ యాప్‌ల ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలి
చెప్పిన టైంలో గనుక సిలిండర్ డెలివరీ జరగకపోయినా, డీఏసీ కోడ్ విషయంలో ఆలస్యం లేదంటే ఏదైనా మతలబు జరిగినా.. సంబంధిత గ్యాస్ కస్టమర్ కేర్ నంబర్లకు సంప్రదించి ఫిర్యాదు చేయడం ఉత్తమ మార్గం
ఫిర్యాదుల కోసం..
• ఇండియన్ గ్యాస్ (IndianOil): 1800-2333-555
• హెచ్‌పీ గ్యాస్ (HPCL): 1800-233-3555
• భారత్ గ్యాస్ (BPCL): 1800-22-4344
ఈ టోల్ ఫ్రీ నెంబర్లే కాదు.. అధికారిక పోర్టల్/యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అందుకోసం ఆ యాప్/వెబ్‌సైట్‌లలో Complaints/Feedback అనే విభాగం ఒకటి ఉంటుంది. లేదంటే.. స్థానిక డీలర్‌కి రాతపూర్వకంగా ఫిర్యాదును అందజేయవచ్చు. ఇవేకాదు.. వినియోగదారుల కోసం హెల్ప్‌లైన్ నెంబర్ 1915కి కూడా కాల్ చేసి ఏ గ్యాస్ కంపెనీ మీద అయినా ఫిర్యాదు చేయొచ్చు. లేదంటే.. 8800001915 అనే నెంబర్‌కు మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే consumerhelpline.gov.in అనే వెబ్‌సైట్ ద్వారానూ ఫిర్యాదు చేయొచ్చు. అయితే.. ఫిర్యాదులు చేసే టైంలో మీ గ్యాస్ బుక్ కన్జూమర్ నెంబర్, ఎల్పీజీ ఐడీ నెంబర్, అలాగే గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసిన ID.. పేమెంట్ రసీదు, మెసేజ్ స్క్రీన్‌షాట్ వంటి సాక్ష్యాలుగా అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది.


