అమర్‌సింగ్‌ కన్నుమూత

Rajya Sabha Member Amar Singh Dies At 64 - Sakshi

సింగపూర్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస

రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) మాజీ నేత అమర్‌సింగ్‌(64) కన్నుమూశారు. సింగపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. 2011లో ఆయనకు కిడ్నీ మార్పిడి జరిగింది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరో కిడ్నీ మార్పిడి కోసం 8 నెలల క్రితం సింగపూర్‌లోని ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

ఆయనకు భార్య పంకజకుమారి, కుమార్తెలు దృష్టి, దిశ ఉన్నారు. అమర్‌సింగ్‌ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ సహా పార్టీలకతీతంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ‘అమర్‌సింగ్‌ మరణం ఎంతో విచారం కలిగించింది. ఆయన సమర్థుడైన పార్లమెంటేరియన్‌. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి’అని రాష్ట్రపతి కోవింద్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ప్రముఖుల సంతాపం
అమర్‌సింగ్‌ కుటుంబసభ్యులకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలో సంభవించిన కీలక రాజకీయ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి అయిన అమర్‌సింగ్‌ గొప్ప ప్రజానాయకుడని ప్రధాని మోదీ కొనియాడారు. అందరితో కలివిడిగా మెలిగే అమర్‌సింగ్‌ మంచి రాజకీయ నేత, వ్యూహకర్త అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఎస్‌పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ట్విట్టర్‌లో తన తండ్రి, పార్టీ వ్యవస్థాపకుడు ములాయంతో అమర్‌సింగ్‌ ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఆయన కుటుంబసభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమర్‌సింగ్‌ మృతికి కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ సంతాపం ప్రకటించారు.

రాజకీయ నేపథ్యం లేకుండానే...
1956 జనవరి 27న∙ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో జన్మించిన అమర్‌సింగ్‌కు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఎస్‌పీ అధినేత ములాయం సింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పలుకుబడిగల నేతల్లో ఒకరిగా ఎదిగారు. 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందానికి వ్యతిరేకంగా వామపక్షాలు యూపీఏ నుంచి వైదొలగడంతో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రమాదంలో పడింది.

ఆ సమయంలో ఎస్‌పీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అమర్‌.. ఎస్‌పీ మద్దతుతో యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషించారు. యూపీ నుంచి రాజ్యసభకు తొలిసారిగా 1996లో ఎన్నికయ్యారు. 2003, 2016లో రాజ్యసభ సభ్యుడయ్యారు. 1996 నుంచి 2010లో బహిష్కరణకు గురయ్యే వరకు ఆయన ఎస్‌పీలో కీలక నేతగా కొనసాగారు.

అనిల్‌ అంబానీ, అమితాబ్‌ బచ్చన్, ‘సహారా’ సుబ్రతా రాయ్‌ తదితరులతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. సినీనటి జయప్రద ఎస్పీలో చేరడం వెనుక అమర్‌ హస్తం ఉందని అంటుంటారు. అమితాబ్‌ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. 2016లో ఆయన అమితాబ్‌ భార్య జయా బచ్చన్‌పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో అంతరం పెరిగింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆయన్ను సమాజ్‌వాదీ పార్టీ 2010లో బహిష్కరించింది.

ఓటుకు నోటు కుంభకోణంలో 2011లో అరెస్టయ్యారు. అయినప్పటికీ, 2016లో ఎస్‌పీ మద్దతుతోనే స్వతంత్ర అభ్యర్ధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో తిరిగి పార్టీలో చేర్చుకున్న ములాయం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అయితే, ఆ తర్వాత ఎస్‌పీ పగ్గాలు చేపట్టిన అఖిలేశ్‌ యాదవ్‌ 2017లో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఎస్‌పీ నుంచి దూరమైన అమర్‌సింగ్‌ ప్రధాని మోదీకి, బీజేపీ మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌కు దగ్గరయ్యారు. ఆజంగఢ్‌లో ఉన్న తమ పూర్వీ కుల ఆస్తులను ఆర్‌ఎస్‌ఎస్‌కు విరాళంగా అందజేస్తానని ప్రకటించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top