
భవిష్యత్తులో భారత్‌లో కనిపించకపోవచ్చంటున్న శాస్త్రవేత్తలు
అత్యంత అరుదుగా కనిపించే అవకాశం ఉందన్న అధ్యయనం
ఇంద్రధనస్సు. కొత్త ఆనందాలకు ఉషస్సు. ఆకాశంలో హరివిల్లు కనిపించిందంటే చాలు చిన్నారులు మొదలు పెద్దల దాకా అందరూ ఆసక్తిగా చూస్తారు. రంగురంగుల ఇంద్రధనస్సు ఎంతో మందికి ప్రేమానురాగాల విరిజల్లును కురిపిస్తుంది. వర్షం ఆగిపోగానే, కొన్ని సార్లు చిరుజల్లులు పడుతున్నప్పుడే వినీలాకాశంలో అర్థచంద్రాకృతి ఆవిష్కృతమై కనువిందు చేస్తుంది. హరివిల్లులోని రంగులను లెక్కబెట్టేవాళ్లు కొందరైతే ఆ మొత్తం హరివిల్లు తమకు పూర్తిగా కనిపించట్లేదే అని బాధపడే వాళ్లు ఇంకొందరు. భారతీయులు మెచ్చే అందాల ఇంద్రధనస్సు ఇకపై కనిపించకపోచ్చన్న చేదు నిజాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందమొకటి నిర్ధారించింది. కాలుష్యం, భూతాపోన్నతి, వాతావరణ మార్పులు కారణంగా మళ్లీ మార్చలేనంతగా మారిపోతున్న వాతావరణ పరిస్థితుల కారణంగానే హరివిల్లు అంతర్థానమయ్యే అవకాశాలు బాగా పెరిగిపోయాయని అధ్యయన బృందం వెల్లడించింది. ఈ పరిశోధనా తాలూకు వివరాలు తాజాగా ‘గ్లోబల్ ఎని్వరోన్మెంటల్ ఛేంజ్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం
ఆనందానికి, ఆశకు ప్రతిరూపంగా కనిపించే ఇంద్రధనస్సు భారతదేశంతోపాటు మరికొన్ని దేశాల్లో ఏర్పడే అవకాశాలు బాగా సన్నగిల్లుతున్నాయని అధ్యయనం పేర్కొంది. వర్షపాతం నమోదయ్యే రేటు, మేఘావృతమయ్యే పరిస్థితులు ఇటీవలికాలంలో వాతావరణ మార్పుల కారణంగా మారిపోయాయి. వర్షం పడినప్పుడు తప్పితే మిగతా సందర్భాల్లో హరివిల్లు కనిపించదు. ఈ దృగి్వíÙయం ప్రకారమే వర్షాలకు, ఇంద్రధనస్సు ఆవిర్భావ సందర్భాలకు అవినాభావ సంబంధం ఉంది. ఎక్కడైతే వర్షాలు తగ్గిపోతాయో అక్కడ హరివిల్లు అంతర్థానమవుతుంది. మేఘాల్లోని నీటి ఆవిరి వర్షపు చినుకులుగా మారే సందర్భాల్లో వాటి మీదుగా సూర్యకాంతి ప్రసరించి పరావర్తనం చెందినప్పుడు దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంద్రధనస్సు కనిపిస్తుంది.
ఇలా ఏర్పడిన హరివిల్లులను తమ కెమెరాల్లో బంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు శాస్త్రవేత్తలకు పంపించారు. అలా వేర్వేరు ఖండాల్లో భిన్న ప్రాంతాల్లో ఏర్పడిన హరివిల్లు ఛాయాచిత్రాలతో ఒక పేద్ద డేటాబేస్‌ను అధ్యయనకారులు సిద్ధంచేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుత వాతావరణ మార్పులు, వాతావరణ పరిస్థితులను క్రోడీకరించి భవిష్యత్తు వాతావరణ అంచనాలను రాబట్టారు. దీంతో ప్రస్తుతం ప్రపంచంలో ఏడాదికి 117 రోజులపాటు ఇంద్రధనస్సులు ఏర్పడుతుండగా భవిష్యత్తులో మరింతగా ఏర్పడే అవకాశాలు ఉండటం విశేషం. 2100 ఏడాదికల్లా మరో 4 నుంచి 4.9 శాతం అధికంగా ఇంద్రధనస్సులు ఏర్పడొచ్చని శాస్త్రవేత్తలు అంచానావేశారు. అయితే అన్ని దేశాల్లో సమసంఖ్య ఏర్పడకుండా కొన్ని చోట్ల అత్యధికంగా, కొన్ని దేశాల్లో అత్యల్పంగా ఏర్పడతాయిన తేలింది. అత్యల్పంగా ఏర్పడే దేశాల్లో భారత్ కూడా ఉంది.
భారత్‌లోనే ఎందుకు తక్కువ?
మంచుమయ ప్రదేశాలతో పోలిస్తే మైదానాల వంటి నేలమయ ప్రాంతాల్లో హరివిల్లు ఏర్పడే అవకాశాలు 21 శాతం నుంచి 34 శాతం తగ్గిపోతున్నాయని అధ్యయనం తెలిపింది. మిగతా ప్రాంతాల్లో ఇంద్రధనస్సు ఏర్పడే అవకాశాలు 66 నుంచి 79 శాతం మెరుగుపడ్డాయి. చల్లటి, పర్వతమయ ప్రాంతాల్లోనే హరివిల్లులు అధికంగా ఏర్పడే ఛాన్సుంది. అధిక జనాభా దేశాల్లో ఇంద్రధనస్సు కనివిందు చేయడం తగ్గిపోనుంది. ఆర్కిటిక్, హిమాలయాల్లో రెయిన్‌బో ఏర్పడే సంభావ్యత అధికంగా ఉందని గణాంకాల్లో తేలింది. సముద్రమట్టానికి అత్యంత ఎత్తులో ఉండే ప్రదేశాల్లో హరివిల్లు సాక్షాత్కార ఘటనలు అధికంకానున్నాయి.
భూమధ్యరేఖ నుంచి దూరంగా వెళ్లేకొద్దీ ఇంద్రధనస్సు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఆ లెక్కన భారతదేశం భూమధ్యరేఖకు సమీపంలో ఉంది. భూమధ్యరేఖకు దూరంగా ఉండే అంటార్కిటి ఖండం వంటి ప్రదేశాల్లో అత్యధికంగా హరివిల్లులు ఎక్కువగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు అంచనావేశారు. ఇప్పటికైనా కట్టుతప్పిన శిలాజఇంధన అతి వినియోగం, అడవుల నరికివేత, దారుణంగా పెరిగిపోయిన కాలుష్యం వంటివి తగ్గిపోతే భారత్‌ను హరివిల్లులు వదిలిపోవని భావించవచ్చు. ఆ మేరకు ప్రజల జీవనశైలిలో మార్పులొస్తాయని, ఆ మేరకు మళ్లీ హరివిల్లులు సందడి చేస్తాయని ఆశిద్దాం.