
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఓట్ల చోరీ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేసిందని, ఈవీఎంలపైనా అనుమానాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలే చేశారాయన. ఈ క్రమంలో.. 2024 ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఒక్క మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోనే లక్షకుపైగా ఫేక్ ఓట్లు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. అయితే..
రెండేళ్ల కిందట.. ఓ మీడియా సంస్థ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లోనూ ఈ అవకతవకలే బయటపడడం గమనార్హం. రాహుల్ గాంధీ ప్రెస్‌మీట్ నేపథ్యంలో ఆ మీడియా సంస్థ ఎడిటర్ ఇన్ చీఫ్ ధన్య రాజేంద్రన్ ఆ విషయాన్ని స్వయంగా తన ఎక్స్ ఖాతాలో గుర్తు చేశారు. అయితే ఆనాడు జరిగిన ఆ ఓట్ల చోరీ గురించి ఆమె మాటల్లోనే ఇలా..
ద న్యూస్ మినిట్ 2023లో నిర్వహించిన ఓ ఇన్వెస్టిగేషన్‌ను అందరికీ గుర్తు చేయాలని అనుకుంటున్నా. ఈ పరిశోధన కూడా బెంగళూరు సెంట్రల్‌లోని మహదేవపురతోపాటు ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లపై దృష్టి పెట్టింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) నియమించిన ఒక స్వచ్ఛంద సంస్థ ఎన్నికల సంఘంతో కలిసి పనిచేస్తూ ఓటర్ల సమాచారం చోరీ చేసింది. ఆ ఎన్‌జీవో పేరు చిలుమే. ఇది ఎన్నికల నిర్వహణ సంస్థతోపాటు, డిజిటల్ సమీక్ష అనే మొబైల్ అప్లికేషన్‌ను కూడా నడిపేది. ఈ యాప్ ఓటర్ల సమాచారాన్ని క్రోడీకరించి రాజకీయ పార్టీలు, నేతలకు విక్రయించేది. ఒక బీజేపీ నేత కొనుగోళ్లను మేము సాక్ష్యంగా ఆనాడు చూపించాం కూడా. ఇందుకోసం బీజేపీ వార్డు కార్యాలయాల్లో చిలుమే తన కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేది. మా మనిషి ఒకరు ఆ శిక్షణ కేంద్రంలో చేరి అక్కడ ఫొటోలతో సహా ఆధారాలు కూడా సేకరించారు.
ఇదెలా జరిగిందంటే..
ఈ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు.. బూత్ లెవల్ అధికారులుగా చెలామణి అవుతూ సమాచారం సేకరించారు. ఆ సేకరణ తర్వాత ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న శివాజీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీజేపీ పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపునకు ఒత్తిడి తీసుకొచ్చింది. ఇదెలా జరిగిందంటే.. బీజేపీ సానుభూతి పరులు ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో సుమారు 26,000 ఫేక్ ఓటర్లు ఉన్నట్లు ఆరోపించారు. అవసరమైన పత్రాలను నింపకుండానే వాటి తొలగింపునకు పట్టుపట్టారు. చివరకు ఒక కోర్టు కేసు తరువాత ఏడువేల ఓట్లు తొలగించారు. అయితే ద న్యూస్ మినిట్ క్షేత్రస్థాయి పరిశీలన జరిపినప్పుడు.. తొలగించిన ఓటర్లలో చాలామంది అదే అసెంబ్లీ సెగ్మెంట్లో, అవే చిరునామాల్లో నివసిస్తున్నట్లు స్పష్టమైంది.
అంతేకాదు.. మా స్టింగ్ ఆపరేషన్‌లో.. చిలుమే వ్యవస్థాపకుడు కృష్ణప్ప రవికుమార్ సొంతూరులో కొంతమంది వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లలో రూ.1.4 లక్షల నుంచి రూ.40 వేల వరకూ డబ్బులు పడ్డాయి. వీటిల్లో ఎక్కువ శాతం ‘సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్’ నుంచి వచ్చినవే ఉండేవి. ఆ ఊరి ప్రజలు డబ్బు విత్‌డ్రా చేసుకుని కృష్ణప్ప రవికుమార్‌కు ఇచ్చేవారు. ఈ సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్ ఇండియా లిమిటెడ్ అనేది కేంద్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా ఏర్పాటు చేసిన సంస్థ కావడం గమనార్హం.
మా స్టింగ్ ఆపరేషన్ తర్వాత.. చాలామంది అరెస్ట్ అయ్యారు. మరికొందరిపై సస్పెన్షన్ వేటు పడింది. చిలుమేతో బీబీఎంపీ సంబంధాలు లేవని ప్రకటించుకుంది. శివాజినగర, చిక్‌పేట్, మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా సవరించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది కూడా. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో గ్రామస్తుల అకౌంట్లలోకి డబ్బులెందుకు వచ్చాయి? చిలుమే సంస్థ సిద్ధం చేసిన ఓటర్ల జాబితాలు ఏమయ్యాయి? ఈ అంశంపై ప్రభుత్వ విచారణ సక్రమంగా జరగలేదు(కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ..)’’ అని ఆమె పోస్ట్ చేశారు.
Just wanted to remind everyone of TNM's investigation in 2023- which also focused on assembly segments in Bangalore Central seat including Mahadevapura.
We found that a Bengaluru NGO- recruited by the BBMP- working with the ECI- was stealing voter data.
Chilume NGO also ran…— Dhanya Rajendran (@dhanyarajendran) August 7, 2025