
న్యూఢిల్లీ: గాలిమరలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంపై ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మోదీ అర్థం చేసుకోలేకపోవడం భారత్‌కు ఉన్న ప్రధాన సమస్య కాదు. కానీ ప్రధాని చుట్టూ ఉన్నవారెవరూ ఆయనకు చెప్పే సాహసం చేయలేకపోవడమే అసలు సమస్య’అంటూ మోదీ మాట్లాడుతున్న వీడియోను జత చేస్తూ ట్వీట్ చేశారు. ఆ వీడియోలో మోదీ గాలి మరలకు సంబంధించిన ఓ ప్రముఖ కంపెనీ సీఈఓతో మాట్లాడుతున్నారు. గాలి మరల నుంచి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆక్సీజన్, శక్తిని పొందవచ్చని మోదీ ఆ కంపెనీ సీఈఓకి సూచిస్తూ ఉండటం ఆ వీడియోలో కనిపించింది. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడా ఘాటుగా స్పందించారు.
కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందిస్తూ.. ‘రాహుల్ గాంధీ చుట్టు ఉన్న వారెవరూ ఆయనకు అర్థం కావడం లేదని చెప్పడానికి సాహసించడం లేదు. ఓ పెద్ద కంపెనీ సీఈఓనే మోదీ ఆలోచనలను ఆలకిస్తుంటే, రాహుల్ మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు’అని ట్వీట్ చేశారు. దాంతో పాటు గాలి నుంచి నీటిని తయారు చేయవచ్చని చెప్పే ఓ న్యూస్ రిపోర్టును జత చేశారు. రాహుల్ గాంధీ సైన్స్ పరిశోధనా పత్రాలు చదవాలంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర కూడా ట్వీట్ చేశారు. మోదీ వ్యాఖ్యలపై ట్విట్టర్‌లో భారీగా ట్వీట్లు నమోదయ్యాయి. అందులో కొందరు మోదీకి మద్దతుగా ట్వీట్లు చేయగా మరికొందరు ఆయనకు వ్యతిరేకంగా ట్వీట్లు చేశారు.