
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టోటల్ రిగ్గింగ్
వ్యవస్థలనూ వాడుకుంది: రాహుల్
బిహార్‌లోనూ అమలు చేస్తుందని జోస్యం
న్యూఢిల్లీ/నాగపూర్: మన దేశంలో ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులపైనే తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆవేదన వెలిబుచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మోదీ సర్కారు భారీ స్థాయిలో ఎన్నికల అక్రమాలకు పాల్పడుతూ వస్తోందని మండిపడ్డారు. అందుకోసం కీలకమైన జాతీయ స్థాయి సంస్థలను సైతం చెరబడుతోందని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు.
‘‘నేను మాట్లాడుతున్నది చిన్నా చితకా ఎన్నికల అక్రమాల గురించి కాదు. ఒక పరిశ్రమ స్థాయిలో మొత్తం ఎన్నికల ప్రక్రియనే రిగ్గింగ్ చేసేస్తున్నారు. ప్రతిసారీ కాకున్నా ఇది తరచూ జరుగుతోంది. గతంలో పలు ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలైతే అందరినీ విస్మయపరిచాయి. ఆ ఎన్నికల్లో పూర్తిగా ‘మ్యాచ్‌ఫిక్సింగ్’జరిగింది. మోదీ సర్కారు వాటి ఫలితాలను టోటల్‌గా రిగ్గింగ్ చేసింది.
ప్రజాస్వామ్యాన్ని ఎలా చెరబట్టడమెలాగో చెప్పేందుకు ఆ ఎన్నికలు బ్లూప్రింట్‌గా నిలిచిపోయాయి’’అంటూ రాహుల్ తూర్పారబట్టారు. ఈ మేరకు శనివారం ఎక్స్‌లో పలు పోస్టులు చేశారు. ‘మ్యాచ్‌ఫిక్సింగ్–మహారాష్ట్ర’అంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా పత్రికలో తాను రాసిన ఎడిట్ పేజీ వ్యాసాన్ని షేర్ చేశారు. మ్యాచ్‌ఫిక్సింగ్ ప్రక్రియను ఐదు పాయింట్లలో వివరించారు. ‘‘మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోతే పరువు పోతుందనే భయంతో బీజేపీ అన్ని అక్రమాలకూ పాల్పడింది.
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌లో కూడా మహారాష్ట్ర తరహా మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పథకరచన చేస్తోంది’’అంటూ జోస్యం చెప్పా రు. హోరాహోరీ పోరు ఖాయమని అంతా భావించిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను బీజేపీ, దాని ఎన్డీఏ భాగస్వామ్య పక్షా లు కనీవినీ ఎరగని రీతిలో ఏకంగా 235 సీట్లలో నెగ్గడం తెలిసిందే. అంతకు ఐదు నెలల క్రితమే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం రాష్ట్రంలోని 48 స్థానాల్లో విపక్ష ఎంవీఏ కూటమికి 31 రాగా ఎన్డీఏ కూటమి 17 సీట్లతో సరిపెట్టుకుంది.
వయోజనుల కంటే ఓటర్లే ఎక్కువ!
‘‘2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి మహారాష్ట్ర ఓటర్ల సంఖ్య 8.98 కోట్లు. 2024 మేలో లోక్‌సభ ఎన్నికల నాటికి 9.29 కోట్లకు పెరిగింది. అంటే ఐదేళ్ల వ్యవధిలో కేవలం 31 లక్షలు పెరిగింది. కానీ 2024 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏకంగా 9.7 కోట్లకు పెరిగింది! కేవలం ఐదు నెలల్లోనే ఓటర్లు ఏకంగా 41 లక్షల మేరకు పెరిగారు! ఇదెలా సాధ్యం? పైగా ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారమే మహారాష్ట్రలో మొత్తం వయోజనుల సంఖ్య 9.54 కోట్లు. ఓటర్ల సంఖ్య అంతకుమించి ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?’’అని రాహుల్ ప్రశ్నించారు. ‘‘ఇదొక్కటే కాదు. పోలింగ్‌లోనూ తీవ్ర అక్రమాలు జరిగాయి. సాయంత్రం ఐదింటికి 58.22 శాతం పోలింగ్ నమోదైంది. మర్నాడు ఉదయం మాత్రం మొత్తం పోలింగ్ శాతం 66.05 అని ప్రకటించారు. ఏకంగా 7.83 శాతం పెరుగుదల ఎలా సాధ్యం?’’అని ప్రశ్నించారు.
How to steal an election?
Maharashtra assembly elections in 2024 were a blueprint for rigging democracy.
My article shows how this happened, step by step:
Step 1: Rig the panel for appointing the Election Commission
Step 2: Add fake voters to the roll
Step 3: Inflate voter… pic.twitter.com/ntCwtPVXTu— Rahul Gandhi (@RahulGandhi) June 7, 2025
మళ్లీ అవే ఆరోపణలు: ఈసీ
మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న రాహుల్ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. ‘‘పోలింగ్ ప్రక్రియ మొత్తం ఆయా పారీ్టల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే పారదర్శకంగా జరిగింది. రాహుల్ ఆరోపిస్తున్నట్టు అసాధారణ ఓటింగ్ జరిగిందంటూ కాంగ్రెస్, ఆ పార్టీ పోలింగ్ ఏజెంట్లెవరూ ఫిర్యాదు చేయలేదు’’అని ఈసీ వర్గాలు గుర్తు చేశాయి. ఈసీ వర్గాల వాదనపై రాహుల్ స్పందించారు. అనధికారిక స్పందనలతో తప్పించుకోవడం ఈసీ వంటి రాజ్యాంగబద్ధ సంస్థల విశ్వసనీయతను కాపాడబోదన్నారు. ‘‘లోక్‌సభతో పాటు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలన్నింటికీ సంబంధించిన సమగ్రమైన డిజిటల్ ఓటర్ల జాబితాను ప్రచురించాలి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం ఐదింటి తర్వాత అన్ని బూత్‌ల్లో జరిగిన పోలింగ్‌కు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ విడుదల చేయాలి’’అని డిమాండ్ చేశారు.

రిగ్గింగ్‌కు ఐదు సూత్రాలు
ఎన్నికలల్లో మోదీ సర్కారు అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించిన రాహుల్‌గాం«దీ, వాటిని పాయింట్లవారీగా వివరించారు...
→ కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానల్‌ను రిగ్గింగ్ చేయడం
→ ఎలక్టోరల్ రోల్స్‌లో భారీగా నకిలీ ఓటర్లను పొందుపరచడం
→ పోలైన ఓట్ల శాతాన్ని అక్రమంగా పెంచేయడం
→ బీజేపీ గెలిచి తీరాలనుకున్న చోట్ల బోగస్ ఓటింగ్‌కు పాల్పడటం
→ సాక్ష్యాలను ఎవరికీ చిక్కకుండా దాచేయడం
ఇది కూడా చదవండి: బీజేపీ తదుపరి అధ్యక్షుడు.. ఆ ముగ్గురిలో ఎవరు?