మా గొంతు నొక్కేస్తున్నారు!

Rahul Gandhi claims drop in follower count in twitter - Sakshi

ట్విట్టర్‌కు రాహుల్‌ లేఖ  

న్యూఢిల్లీ: భారత్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడంలో ట్విట్టర్‌ తెలియకుండానే భాగస్వామిగా మారుతోందని, తన ట్విట్టర్‌ అకౌంట్‌ ఫాలోవర్స్‌ను తగ్గిస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ ఇండియాకు లేఖ రాశారు. భారత విధ్వంసంలో ట్విట్టర్‌ పావుగా మారకూడదని, కోట్లాది భారతీయుల తరఫున ఈ లేఖ రాస్తున్నానని చెప్పారు. డిసెంబర్‌ 27న రాసిన ఈ లేఖ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది.

అయితే రాహుల్‌ అకౌంట్‌ ఫాలోవర్స్‌ సంఖ్య కచ్ఛితమైనది, సరైనదేనని ట్విట్టర్‌ వెల్లడించింది. తమ ప్లాట్‌ఫామ్‌పై ఆరోగ్యకరమైన చర్చలను కోరుకుంటున్నామని తెలిపింది. భిన్న అభిప్రాయాలను తాము గౌరవిస్తామని ట్విట్టర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సైనియడ్‌ మెక్‌స్వీనీ తెలిపారు. తాము ఎలాంటి రాజకీయపరమైన సెన్సారింగ్‌ చేయడం లేదన్నారు. దేశ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతగా అన్యాయంపై ప్రజల తరఫున గళమెత్తాల్సిన బాధ్యత తనపై ఉందని రాహుల్‌ తన లేఖలో పేర్కొన్నారు.

భారత్‌లో మీడియా అణగదొక్కుతున్న నేపథ్యంలో ప్రజల సమస్యలను లేవనెత్తి, ప్రభుత్వ బాధ్యతలను గుర్తుచేసేందుకు ట్విట్టర్‌ వంటి మాధ్యమాలు తమకు కీలకంగా మారాయని, కానీ గత కొన్ని రోజులుగా తన ట్విట్టర్‌ ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా పడిపోతూ వస్తోందని వివరించారు. తన ఫాలోయర్ల సంఖ్య రోజుకు పదివేల చొప్పున పెరిగేదని, కానీ కొన్ని రోజులుగా ఈ సంఖ్య మారడం లేదని చెప్పారు.

కేంద్రమే కారణం
తన గళాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం నుంచి ట్విట్టర్‌ ఇండియా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని తెలిసిందని రాహుల్‌ ఆరోపించారు. తప్పుదోవ పట్టించడం, తప్పుడు సమాచారాన్ని తమ వేదికపై అంగీకరించమని, అలాంటివాటిపై మెషీన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీ సాయంతో చర్యలు తీసుకుంటుమని ట్విట్టర్‌ ప్రతినిధి చెప్పారు. ఇందులో భాగంగానే కొందరి ఫాలోవర్ల సంఖ్యలో మార్పులు జరగొచ్చని, విధానాల ఉల్లంఘనకు ప్రతి వారం లక్షలాది మంది ఖాతాలను తొలగిస్తుంటామని చెప్పారు.

ప్రజాస్వామ్యం, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను ప్రభుత్వం అణచివేయకూడదన్నదే తమ నాయకుడు రాహుల్‌గాంధీ అభిప్రాయమని కాంగ్రెస్‌ ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా చెప్పారు. ఈ వారం నుంచి రాహుల్‌ ఫాలోయర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతకుముందు చాలా రోజుల పాటు ఆయన ఫాలోయర్ల సంఖ్య 1.95 కోట్ల వద్ద స్థిరంగా ఉండిపోయింది. ఈ వారం మాత్రం ఈ సంఖ్య 1.96 కోట్లకు చేరింది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top