కేరళ సీఎం విజయన్‌దీ అదే తీరు
రాహుల్‌గాంధీ విమర్శలు
త్రిసూర్/పాలక్కడ్: ప్రధాని మోదీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోమారు విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. త్రిసూర్ జిల్లాలోని మాలా, కున్నంకులమ్ పట్టణాలతోపాటు పాలక్కడ్ జిల్లా కేంద్రంలో సోమవారం రాహుల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు. ‘‘మోదీ, పినరయి విజయన్‌లకు దురహంకారం చాలా ఎక్కువ.
ప్రజలతో కలిసి పనిచేయడం మానేసి రాజు అనే ఆలోచనాధోరణితో వ్యవహరిస్తారు. తమను విమర్శించే పార్టీలు, వ్యక్తులను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటుంది. కానీ కేరళలో సీఎం, ఆయన కుటుంబం వైపు బీజేపీ కన్నెత్తిచూడట్లేదు. కేసుల విచారణలు, ఈడీ, సీబీఐ దాడుల ఊసే ఎత్తట్లేదు. ఎల్‌డీఎఫ్, బీజేపీ రహస్య పొత్తు పెట్టుకున్నాయనడానికి ఇవే తార్కాణాలు. బీజేపీ దాడులకు కాంగ్రెస్ బెదిరిపోదు. పోరాటం కొనసాగిస్తాం’’అని రాహుల్ పునరుద్ఘాటించారు.
ముఖ్యమంత్రి విజయన్ ఫొటోను ముద్రించి విజయన్‌కాకుండా ఇంకెవరు మరోసారి సీఎం అవుతారు? అనే ధోరణిలో ‘ఇంకెవరు?’అంటూ ఎల్‌డీఎఫ్ కార్యకర్తలు ప్రచారంలోకి తీసుకొచ్చిన బిల్‌బోర్డులపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ‘‘ఇంకెవరు? అంటే అర్థమేంటి? ఆయనేమైనా దేవుడా? ఆయన ఒక్కడే రాష్ట్రం మొత్తాన్నీ పరిపాలించలేడు.
ఎంతో శక్తిసామర్థ్యాలున్న మహిళలు, ప్రతిభావంతులైన వ్యక్తుల సమన్వయంతో రాష్ట్రంలో పరిపాలన అనేది సాగుతుంది. ఇంకెవరు? అంటూ బ్యానర్లు కట్టడం అందర్నీ అవమానించడమే. ఇది దురహంకారానికి పరాకాష్ట. సీఎం ఒక్కరేకాదు అమిత్ షా, హిమంత బిశ్వ శర్మలకూ దురహంకారం పాళ్లు ఎక్కువ. ప్రధాని మోదీ అయితే తాను స్వయంగా దైవాంశగా చెప్పుకుని తిరుగుతున్నారు. ఆయన అలాగే ఊహాలోకంలో బతికేస్తున్నారు. కేరళలో సీఎం అయితే రాజునని భావిస్తున్నారు’’ అని రాహుల్ ధ్వజమెత్తారు.


