రికార్డుల సీఎం!  | Pinarayi Vijayan eyes hat-trick | Sakshi
Sakshi News home page

‘హ్యాట్రిక్‌’పై గురి పెట్టిన విజయన్‌

Apr 7 2026 5:54 AM | Updated on Apr 7 2026 1:43 PM

Pinarayi Vijayan eyes hat-trick

పినరయి విజయన్‌. ఆచరణాత్మక కమ్యూనిస్టు. అభివృద్ధివాద నేత. కేరళ చరిత్రలో అత్యంత శక్తిమంతుడైన సీఎంగా నిలిచారు. రాష్ట్ర చరిత్రలో అధికారాన్ని నిలబెట్టుకున్న తొలి సీఎం కూడా. ప్రస్తుతం దేశంలోనే అత్యంత వయసు పైబడిన ముఖ్యమంత్రి కూడా విజయనే! 

రక్తపు చొక్కాతో అసెంబ్లీకి 
విజయన్‌ చిన్న వయసులోనే సీపీఎంలో చేరారు. కేరళ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐకి ముందు సంస్థ)లో ఎదిగారు. కేరళ స్టేట్‌ యూత్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా చేశారు. సీపీఎం రాష్ట్ర కమిటీ నేతగా ఎదిగారు. 25 ఏళ్ల వయసులో కుతుపరంబ అసెంబ్లీ నుంచి తొలిసారిగా గెలిచారు. కేరళలో అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా నిలిచారు. 1977లో అసెంబ్లీలో చరిత్రాత్మక ప్రసంగంతో వెలుగులోకి వచ్చారు. ఎమర్జెన్సీ సమయంలో తాను ఎదుర్కొన్న కస్టడీ చిత్రహింసల అనుభవాన్ని వివరించారు. రక్తపు మరకలున్న చొక్కాను ఈ సందర్భంగా సభలో చూపారు.

ఆ షర్టును చాలాకాలంపాటు దాచుకున్నట్లు ఇటీవల ఇంటర్వ్యూలో కూడా గుర్తు చేసుకున్నారు. 1996లో తొలిసారి విద్యుత్‌ శాఖ మంత్రి అయ్యారు. విద్యుదుత్పాదనలో రాష్ట్రాన్ని స్వయంసమృద్ధి దిశగా నడిపారు. కేరళ చూసిన అత్యుత్తమ విద్యుత్‌ శాఖ మంత్రిగా నిలిచారు. రాష్ట్ర విద్యుత్‌ బోర్డు, కెనడాకు చెందిన ఎస్‌ఎన్సి–లావాలిన్‌ సంస్థ ఒప్పందంపై అవినీతి ఆరోపణలు దుమారం రేపినా ఆ కేసులో నిర్దోషిగా తేలారు.1998లో మంత్రి పదవి వీడి సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా 18 ఏళ్లు కొనసాగారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళ సీపీఎంను విభిన్నంగా నిలబెట్టారు. పార్టీ నాయకత్వంలో కైరళి టీవీని ప్రారంభించారు. విజయన్‌ సారథ్యంలోనే సీపీఎం 2006, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గింది. 

సీఎంగా కీలక చర్యలు 
సీఎం అయ్యాక తొలి మంత్రివర్గ భేటీలోనే విజయన్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిరాశ్రయులకు ఇళ్లు, ఆర్థిక సాధికారత మిషన్, ఆరోగ్య రంగం ఆధునీకరణ, వ్యర్థాల నిర్వహణ పథకాలు చేపట్టారు. 2018 కేరళ వరదలు, నిఫా, కోవిడ్‌ వంటి సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్నారు. పార్టీలో ‘కెప్టెన్‌’గా పేరు తెచ్చుకున్నారు. అధికారుల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ విజయన్‌ను విలక్షణంగా నిలబెట్టింది. దాంతో ఐదేళ్లకోసారి అనివార్యంగా అధికార మార్పిడి జరిగే కేరళలో 2021లో సీపీఎం కూటమి వరుసగా రెండోసారి గెలిచి రికార్డు సృష్టించింది. విజయన్‌ రెండోసారి సీఎం కాగానే మంత్రివర్గాన్ని యువతతో నింపేశారు. అయితే అల్లుడు రియాజ్‌ను మంత్రిని చేయడం విమర్శలకు దారితీసింది. పెట్టుబడిదారి విధానంలో తలమునకలై కమ్యూనిస్టు సిద్ధాంతం నుంచి పక్కదారి పడుతోందనే విమర్శలూ వచ్చాయి. శబరిమలలో ప్రభుత్వపరంగా గ్లోబల్‌ అయ్యప్ప సదస్సు నిర్వహణ కూడా చర్చనీయాంశమైంది. 

బీడీలు చుట్టి.. మగ్గం నేసి..  
విజయన్‌ 1945లో కన్నూర్‌లోని పినరయిలో జన్మించారు. కోరన్, కళ్యాణి దంపతులకు ఆఖరి సంతానం. బాల్యంలో సిగ్గరి. కాకపోతే చురుకైన విద్యార్థి. తండ్రి అకాల మరణంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దాంతో ప్రాథమిక విద్య కాగానే విజయన్‌ను తల్లి బీడీలు చుట్టే పనికి పంపింది. టీచర్లు తల్లిని ఒప్పించి తనను బడిబాట పట్టించారు. చేనేత కార్మికునిగా పనిచేస్తూ తలస్సేరి ప్రభుత్వ కాలేజీలో అర్థశాస్త్రంలో డిగ్రీ చేశారు. ఉపాధ్యాయురాలైన కమలను వివాహం చేసుకున్నారు. వారికిద్దరు పిల్లలు. చేపలు విజయన్‌కు ఇష్టమైన ఆహారం. చదవడం, సినిమాలు చూడటం హాబీలు. ఇష్టమైన నటుడు రజనీకాంత్‌. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మదామ్‌ నియోజకవర్గం నుంచి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తున్నారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Advertisement
 
Advertisement
Advertisement