అతిగా ఊహించుకోకండి.. కాస్త తగ్గండి! | Supreme Court raps top Bengal officers over Malda response | Sakshi
Sakshi News home page

అతిగా ఊహించుకోకండి.. కాస్త తగ్గండి!

Apr 7 2026 5:14 AM | Updated on Apr 7 2026 5:14 AM

Supreme Court raps top Bengal officers over Malda response

బెంగాల్‌ సీఎస్, డీజీపీలపై సుప్రీం ఆగ్రహం

మాల్డా ఘటనపై ఎన్‌ఐఏ విచారణకు ఆదేశం 

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌), రాష్ట్ర డీజీలపై సుప్రీంకోర్టు తలంటింది. వారి వ్యవహార శైలిని తప్పుబట్టడంతోపాటు, మాల్డా ఘటన జరిగిన రోజున కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫోన్‌కాల్‌కు సీఎస్‌ స్పందించక పోవడాన్ని సీరియస్‌గా తీసుకుంది. అతిగా ఊహించుకోకండి..కాస్తంత తగ్గండి అంటూ మందలించింది. ఘటన విచారణ బాధ్యతలను ఎన్‌ఐఏకు అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. 

ఈ నెల ఒకటో తేదీన సర్‌ ప్రక్రియలో భాగంగా విచారణకు వెళ్లిన 9మంది న్యాయాధికారుల బృందాన్ని 9 గంటలపాటు కొందరు నిర్బంధించారు. సాయంత్రం 3.30 గంటలకు ఘెరావ్‌ మొదలుకాగా, అర్ధరాత్రి 11.30 గంటల వేళ సీజేఐకి సమాచారం అందింది. ఆయన జోక్యంతో పోలీసు యంత్రాంగం కదిలింది. ఆతర్వాతే అర్ధరాత్రి సమయంలో న్యాయాధికారులకు నిర్బంధం నుంచి విముక్తి లభించింది. 

ఈ ఘటనపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వర్చువల్‌ హాజరైన సీఎస్‌ దుష్యంత్‌ నరియాలానుద్దేశించి ధర్మాసనం.. ‘ప్రధాన న్యాయమూర్తి ఫోన్‌ చేసినా స్పందించరా?’అంటూ నిలదీసింది. తాను ఆ సమయంలో ఢిల్లీ లో ఉన్నానని, ఎటువంటి ఫోన్‌ కాల్స్‌ తనకు రాలేదని సీఎస్‌ బదులిచ్చారు. ‘మీ నంబర్‌ను హైకోర్టు సీజేకి ఇచ్చి ఉంటే ఆయనకు ఆ సమయంలో ఎంతో ఉపయోగపడేది. 

మీరు హైకోర్టు సీజేకి కూడా అందనంత ఎత్తులో ఉన్నారు. తగ్గండి. హైకోర్టు సీజేకి అయినా అందుబాటులో ఉండండి’అంటూ గట్టిగా హెచ్చరించింది. ‘యంత్రాంగం తీరు ఇలా ఉండటం వల్లే అరాచకం రాజ్యమేలుతోంది’అని వ్యాఖ్యానించింది. మాల్డా ఘటనకు సరైన రీతిలో స్పందించడంలో విఫలమైనందుకు గాను హైకోర్టు సీజేకి క్షమాపణ లేఖ రాయాలంటూ సీఎస్‌కు, డీజీపీకి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 

మాల్డా ఘటనపై కలకత్తా హైకోర్టు సీజే నివేదిక ఆధారంగానే కలెక్టర్, ఎస్‌పీలపై తీసుకునే చర్యలుంటాయని తెలిపింది. రాష్ట్రంలో సర్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు హైకోర్టు సీజేకి పూర్తి సహాయ సహకారాలను అందించాలని సీఎస్, డీజీపీ, ఇతర యంత్రాంగాన్ని ధర్మాసనం ఆదేశించింది. మాల్డాలో న్యాయాధికారుల ఘెరావ్‌కు సంబంధించి అదుపులోకి తీసుకున్న ఇద్దరినీ ఎన్‌ఐఏకి అప్పగించాలంది. ముందస్తు ప్రణాళికతో జరిగిన ఈ ఘటన వెనుక సూత్రధారులెవరో తేల్చాలని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement