మహిళలపై నేరాలు దేశ విషాద చిత్రాన్ని పట్టిచూపుతున్నాయి
ఆవేదన వ్యక్తంచేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: గృహ హింస ఘటనలు కేవలం సమాజంలో వికృత చేష్టలుగాకాకుండా ఒక సామాజిక రుగ్మతగా మారిపోయాయని సర్వోన్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలపై నేరాల చిట్టా నేటి భారత విషాద ముఖచిత్రాన్ని లిఖిస్తున్నాయని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. 14 సంవత్సరాల క్రితం భార్యను తగలబెట్టిన భర్తకు గతంలో విధించిన మరణదండన తీర్పును సమర్థిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఏప్రిల్ రెండో తేదీన ఇచ్చిన తీర్పు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
తీర్పు సందర్భంగా పితృస్వామ్య భావజాల విషపోకడలను ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘నేటి భారతంలో ఆర్థిక వృద్ధి, అక్షరాస్యత, విద్యా రంగం, కార్మికశక్తిలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతున్నాయి. కానీ పితృస్వామ్య ఆధిపత్య భావజాలం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అలాగే మాయని మచ్చగా కొనసాగుతోంది. లింగ భేదం లేకుండా సమానత్వం, స్వేచ్ఛా, జీవించే హక్కులను రాజ్యాంగం ప్రసాదించింది. కానీ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా కొందరికి అవన్నీ ఎండమావులుగా మిగిలిపోయాయి.
లింగ అసమానతలను రూపుమాపేందుకు బేటీ బచావో, బేటీ పఢావో వంటి పథకాలు ద్వారా ప్రభుత్వాలు మహిళల సంక్షేమం, సామాజిక పరిణతికి ప్రయత్నిస్తున్నాయి. సుకన్య సమృద్ధి యోజన, ఉజ్వల యోజన వంటి పథకాలు మహిళల ఆర్థిక భద్రత, మెరుగైన జీవనాలకు దోహదపడతాయి. కానీ వీటితో సమస్య సమసిపోవట్లేదని గణాంకాలు చాటుతున్నాయి. 2023లో జాతీయ నేరగణాంకాల రికార్డుల ప్రకారం మహిళలపై 4.48 లక్షల నేరాలు జరిగాయి. ఏటా వరకట్న వేధింపుల కేసులు 6,000కుపైగా నమోదవుతున్నాయి.
గృహహింస అనేది అత్యధిక కేసుల్లో కన్పిస్తోందని జాతీయ మహిళా కమిషన్ వద్ద పోగుబడిన ఫిర్యాదులు చాటిచెబుతున్నాయి. మహిళ సంపాదించినాసరే ఇంట్లో వంటచేయడం మొదలు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడందాకా పనులన్నీ మహిళే చేయాలనే ఆలోచనాధోరణి మారట్లేదు. చట్టపరంగా, ఆర్థికంగా మహిళలుపురోగమిస్తున్నా పురుషాధిక్యత, పితృసామ్యం అనేవి ప్రతిచోట ప్రతిబంధకాలుగా ఎదురుపడుతున్నాయి. దశబ్దాలుగా చట్టాలు, పథకాలు, సంస్కరణలు, ఇళ్లు, కార్యాలయాలు, వ్యక్తిగత సంబంధాలు, చివరకు సాయుధ బలగాల్లోనూ సమానత్వంకోసం ఎంతగా ప్రయత్నిస్తున్నా మహిళలపై, వాళ్ల ఇష్టాఇష్టాలపై, వాళ్ల జీవితాలపై పురుషాధిక్యత ఎందుకుంటోంది? సమాధానం బహుశా మన భారతీయ ప్రజల్లోనే దాగి ఉందేమో’’అని ధర్మాసనం ఆవేదన వ్యక్తంచేసింది.


