లాకప్‌డెత్‌ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష | Madurai Court Verdict: 9 policemen sentenced to death in lockup death case | Sakshi
Sakshi News home page

లాకప్‌డెత్‌ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష

Apr 7 2026 4:59 AM | Updated on Apr 7 2026 5:26 AM

Madurai Court Verdict: 9 policemen sentenced to death in lockup death case

కోర్టు ఆవరణలో దోషులను తరలిస్తున్న పోలీసులు

అరుదైన కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు

శాంతి భద్రతలను కాపాడాల్సిన వారే చట్టాన్ని ఉల్లంఘించారు

ఎలాంటి నేరచరిత్ర లేని తండ్రీ కుమారులను క్రూరంగా హింసించి చంపారు.. మృతుల శరీరాలపై గాయాలు ‘అసాధారణమైనవి..’ 

మృతుల కుటుంబాలకు రూ.1.40 కోట్లు పరిహారం చెల్లించాలని ఆదేశం

కేసు విచారణలో ఉండగా కరోనాతో నిందితుడు ఎస్‌ఐ పాల్‌దొరై మృతి

లాకప్‌ డెత్‌ కేసులో ఇంత మంది పోలీసులకు మరణ శిక్ష దేశ న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి

సాక్షి, చెన్నై/అమరావతి: తమిళనాడులో కలకలం సృష్టించిన తండ్రీ కుమారుల లాకప్‌ డెత్‌ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వారిద్దరి మృతికి కారణమైన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. మృతుల కుటుంబాలకు రూ.1.40 కోట్లను పరిహారంగా చెల్లించాలని తొమ్మిది మంది పోలీసులను కోర్టు ఆదేశించింది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘించి ఎటువంటి నేర చరిత్ర లేని తండ్రీ కుమారులను అత్యంత క్రూరంగా హింసించి చంపడం ‘అరుదైన కేసు‘గా న్యాయస్థానం అభివర్ణించింది. ఈ మేరకు మదురై అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు జడ్జి జి.ముత్తుకుమార్‌ సోమవారం తీర్పు వెలువరించారు. దేశ న్యాయ చరిత్రలో లాకప్‌ డెత్‌ కేసులో ఇంత మంది పోలీసులకు ఓ కోర్టు మూకుమ్మడిగా మరణ శిక్ష విధించడం ఇదే తొలిసారి. మరణశిక్ష పడిన వారిలో ఎస్‌.శ్రీధర్‌ (అప్పటి ఇన్‌స్పెక్టర్‌). పి.రఘు గణేష్‌ (సబ్‌–ఇన్‌స్పెక్టర్‌), కె.బాలకృష్ణన్‌ (సబ్‌–ఇన్‌స్పెక్టర్‌), ఎస్‌.మురుగన్‌ (హెడ్‌ కానిస్టేబుల్‌), ఏ.సామిదురై (హెడ్‌ కానిస్టేబుల్‌), ఎం.ముత్తురాజ్‌ (కానిస్టేబుల్‌), ఎస్‌.చెల్లదురై (కానిస్టేబుల్‌), థామస్‌ ఫ్రాన్సిస్‌ (కానిస్టేబుల్‌), ఎస్‌.వెయిలుముత్తు (కానిస్టేబుల్‌) ఉన్నారు. మరో నిందితుడిగా ఉన్న స్పెషల్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పాల్‌దొరై కేసు విచారణలో ఉండగా కరోనాతో మరణించారు.

షాపు ఎక్కువ సేపు తెరిచి ఉండటమే వారు చేసిన పాపం..
తండ్రీ కుమారులైన జయరాజ్, బెన్నిక్స్‌లు మొబైల్‌ దుకాణం నిర్వహించేవారు. కోవిడ్‌ సమయంలో వీరు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ సేపు షాపు తెరిచారన్న ఆరోపణలతో (ఆ తరువాత దర్యాప్తులో ఇది అవాస్తమని తేలింది) 2020 జూన్‌ 19న తుత్తుకూడి జిల్లా సత్తాన్‌కులం పోలీసులు వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. లాకప్‌లో వారిని తీవ్రంగా కొట్టి హింసించడంతో పోలీసుల దెబ్బలకు తట్టుకోలేక జూన్‌ 22–23 తేదీల్లో బెన్నిక్స్, జయరాజ్‌ మరణించారు. పోలీసులు దారుణంగా హింసించడం వల్లే వీరిద్దరూ మరణించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తడంతో మొత్తం 10 పోలీసులపై కేసు నమోదు చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.

హైకోర్టు జోక్యంతో సీబీఐకి...
ఈ ఘటనపై మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌ సుమోటోగా విచారణ చేపట్టింది. పోలీసు అధికారులపై హత్యాయత్నం మోపడానికి తగిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు స్పష్టంగా వ్యాఖ్యానించింది. నిందితులైన పోలీసు అధికారులు ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని హైకోర్టు గుర్తించింది. దీంతో దర్యాప్తులో జాప్యం జరగకుండా, సాక్ష్యాలు తారుమారు కాకుండా ఉండేందుకు పారదర్శక విచారణ కోసం సీఐడీకి అప్పగించింది. అటు తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. హత్య, అక్రమ నిర్బంధం, తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం, తప్పుడు అభియోగాలు మోపడం, ప్రభుత్వ రికార్డులను తారుమారు చేయడం, నేరాన్ని ప్రేరేపించడం వంటి అభియోగాల కింద సీబీఐ కేసు దర్యాప్తు జరిపింది.

కీలకంగా మహిళా కానిస్టేబుల్‌ సాక్ష్యం..
మృతులు జయరాజ్, బిన్నిక్స్‌లపై పోలీసులు మోపిన ఆరోపణలు అవాస్తవమని దర్యాప్తులో సీబీఐ తేల్చింది. ఈ కేసులో ఓ మహిళా కానిస్టేబుల్‌ ఇచ్చిన వాంగ్మూలం అత్యంత కీలకంగా మారింది. తండ్రీ కుమారులను పోలీసులు రాత్రంతా కొడుతూనే ఉన్నారని.. లాఠీలపై, బల్లలపై రక్తపు మరకలు ఉన్నాయని ఆమె సీబీఐకి వెల్లడించింది. అంతేకాకుండా ఈ ఘటన బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులు సీసీ కెమెరా రికార్డింగ్‌లు ఆటోమేటిక్‌గా డిలీట్‌ అయ్యేలా సెట్‌ చేసినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. ఆ ఆధారాలన్నింటితో కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. సుదీర్ఘ విచారణ జరిపిన మదురై కోర్టు ఆరేళ్ల తరువాత తీర్పు వెలువరించింది.

ముమ్మాటికీ హత్యే...
జయరాజ్, బెన్నిక్స్‌ శరీరాలపై ఉన్న గాయాలు ‘అసాధారణమైనవి..’ అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. ఈ గాయాలే వారి మరణానికి ప్రధాన కారణమయ్యాయని పేర్కొన్నారు. జయరాజ్, బెన్నిక్స్‌లు తమను తామే గాయపరుచుకున్నారన్న నిందితుల(పోలీసులు) వాదనను తోసిపుచ్చుతున్నట్లు తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదికలను పరిశీలించిన అనంతరం పోలీసులు నిరంతరం, పదే పదే చేసిన దాడి వల్లే ఆ గాయాలు అయినట్లు స్పష్టం చేశారు. జయరాజ్‌కు గతంలో గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయని, అయితే ఆయన మరణం ఆ అనారోగ్యం వల్ల సంభవించలేదని, పోలీసుల చేతిలో అనుభవించిన తీవ్ర శారీరక హింస వల్లే ప్రాణాలు కోల్పోయారని తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు. 

జయరాజ్, బిన్నిక్స్‌ 

ఆంగ్లేయుల కాలంలో ఇలాంటి దాడులు జరిగినట్లు విన్నామని, రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు తండ్రీ కుమారులను పోలీసులు కరల్రు, ఇనుప రాడ్లతో చిత్రహింసలకు గురిచేశారని నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయడమే కాకుండా ఫోర్జరీ పత్రాలను సృష్టించినట్లు స్పష్టమైందన్నారు. ఇ¯న్‌స్పెక్టర్‌ శ్రీధర్‌ ఆదేశాల మేరకు పోలీసులు ఈ దారుణానికి పాల్పడ్డారని, వారు పైఅధికారులకు ఫిర్యాదు చేసి ఈ మరణాలను ఆపి ఉండవచ్చని, అలా కాకుండా ఈ నేరంలో భాగస్వాములయ్యారని కోర్టు వ్యాఖ్యానించింది. ఆధారాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఇది ముమ్మాటికీ హత్యేనని నిర్ధారించింది. ఈ క్రూరమైన చర్యకు పాల్పడిన తొమ్మిది మంది పోలీసు అధికారులను దోషులుగా ప్రకటించి వారికి మరణశిక్షను విధించింది.  

Advertisement
 
Advertisement
Advertisement