పంచాయతీ కార్యదర్శుల కనీస బేసిక్ వేతనం రూ.25,220 మాత్రమే
గ్రామ పంచాయతీల రీ కేటగిరైజేషన్ సమయంలో రూ.28,280గా నిర్థారణ
గతేడాది నవంబర్‌లో జీవో.. 5 కేటగిరీలుగా ఉన్న గ్రామ పంచాయతీలు మూడుగా వర్గీకరణ
మూడో గ్రేడ్‌కు మారిన ఐదో కేటగిరీ పంచాయతీ కార్యదర్శులు
అప్పట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర స్థాయిలో అభినందన సభ
తాజా ఉత్తర్వుల్లో కనీస బేసిక్ వేతనం రూ.28,280 నుంచి రూ.25,220కు కుదింపు
సర్కారు నిర్వాకంతో ఏకంగా 8,500 మంది పంచాయతీ కార్యదర్శులకు అన్యాయం
ఒక్క రూపాయి కూడా వేతనం పెరగలేదని తీవ్ర ఆగ్రహం
సాక్షి, అమరావతి: ఐదో గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులకు చంద్రబాబు ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది. వారిని మూడో గ్రేడ్ కిందకు మార్చి, బేసిక్ వేతనాన్ని పెంచుతామని జీవో ఇచ్చి, రూపాయి కూడా పెంచకుండా మోసం చేసింది. గ్రామ పంచాయతీల్లో రీ కేటగిరైజేషన్ ప్రక్రియలో పంచాయతీ కార్యదర్శుల్లో అట్టడుగు ఉద్యోగుల కనీస బేసిక్ వేతనం రూ.28,280కి పెంచుతామని గతేడాది నవంబర్ 4న జీవో ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. తీరా దానిని రూ.25,220కి కుదిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఐదు నెలల క్రితం ఇచ్చిన జీవో అమలు జరిగితే రాష్ట్రంలో దాదాపు 8,500 మంది పంచాయతీ కార్యదర్శుల వేతనాలు పెరిగేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం వారి ఆశలను వమ్ము చేస్తూ వేతనాలకు కోత పెట్టేసింది. 2019–2020 సంవత్సరాల్లో గ్రామ సచివాలయాల ఉద్యోగ నియామకాల సమయంలో గ్రేడ్–5 సచివాలయ కార్యదర్శులుగా ఉద్యోగాలు పొందిన వారు ఈ ప్రక్రియలో నష్టపోతున్నారు. సంస్కరణల పేరిట జనాభా, వార్షికాదాయం ప్రాతిపదికన రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను కొత్తగా వర్గీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిగా కసరత్తు చేస్తూనే ఉంది.
ఈ క్రమంలో గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3, గ్రేడ్–4, గ్రేడ్–5 కేటగిరీలుగా ఉన్న గ్రామ పంచాయతీలను గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3 పంచాయతీలుగా వర్గీకరించాలని గత ఏడాది అక్టోబర్‌లో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో కేవలం ఐదు శాతం గ్రామ పంచాయతీలను అర్బన్ పంచాయతీలుగా పేర్కొంటూ, వాటి నిర్వహణ బాధ్యతలను డిప్యూటీ ఎంపీడీవోలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఐదు కేటగిరీల్లో కొనసాగుతున్న పంచాయతీ కార్యదర్శులను కేవలం మూడు గ్రేడ్‌లలో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో చివరి గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శుల కనీస బేసిక్ వేతనం రూ.28,280గా నిర్ణయించి, గతంలో ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. తాజాగా ఆ బేసిక్ వేతనాన్ని రూ.25,220కు తగ్గించేసింది.
అభినందన సభ సాక్షిగా మోసం
గ్రామ పంచాయతీలను రీ కేటగిరైజేషన్ ద్వారా పంచాయతీ కార్యదర్శులందరికీ పదోన్నతులు వస్తాయని ఆ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. గతేడాది నవంబర్ 4న ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పదోన్నతుల అభినందన సభ కూడా నిర్వహించారు.
తాజాగా ప్రభుత్వ నిర్వాకంతో దాదాపు 8,500 మంది పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్–5 నుంచి గ్రేడ్–3కి మారినప్పటికీ, వారి జీతాల్లో రూపాయి కూడా పెరగదని స్పష్టమైంది. ప్రభుత్వం తమను మోసం చేసిందని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు.
మొదట ప్రకటించిన పేస్కేల్ ఇవ్వాల్సిందే
ప్రభుత్వమిచ్చిన జీవో 91లో గ్రామ పంచాయతీ కార్యదర్శుల అట్టడుగు కేటగిరి ఉద్యోగుల కనీస బేసిక్ వేతనం రూ.28,280గా నిర్ధారించి, ఇప్పుడు దానిని రూ.25,220కు తగ్గించడం అత్యంత అన్యాయమని నవీన పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు బగ్గా జగదీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మార్పు వల్ల గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులకు ఆర్థికంగా తీవ్ర నష్టం కలగడమే కాకుండా, మరింత భారం పెరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు.
పే స్కేల్ తగ్గింపు ఉద్యోగుల మనోబలాన్ని దెబ్బతీసే నిర్ణయం అవుతుందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఈ సవరణను ఉపసంహరించుకొని, మొదట ప్రకటించిన విధంగా రూ.28,280 పే స్కేల్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే సంఘం తరఫున ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరిస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.


