ఏపీ జెన్‌కోలో రూ.5 వేలకోట్ల కాంట్రాక్టుపై కూటమి నేతల కన్ను
కాంట్రాక్టు కోసం ఇప్పటికే ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ఒక బడా సంస్థ ప్రయత్నం
ఊహించని విధంగా ఇప్పుడు ఓ మంత్రి తరపున రంగంలోకి లింగ బృందం
కమీషన్ల కోసం ఏపీ జెన్‌కో ప్రాజెక్టుల అంచనాలు 20 శాతం పెంపు
తాజాగా అనంతపురం జిల్లాలో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు కోసం స్కెచ్
ప్రభుత్వరంగ సంస్థలు టెండర్ వేయకుండా నిబంధనలనే అనుమానాలు
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ శాఖలో టెండర్లన్నీ కొన్ని సంస్థలకు, కొందరు వ్యక్తులకే దక్కుతున్నాయి. ఇదెలా సాధ్యమవుతోందనేది ఇప్పటికే ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇప్పుడు ఆ జాబితాలోకి రూ.5 వేలకోట్ల భారీ ప్రాజెక్టు కూడా చేరబోతోంది. ఇప్పటివరకు ఇచ్చిన ప్రాజెక్టులు ఒక ఎత్తయితే, ఈ ఒక్క ప్రాజెక్టు మరో ఎత్తు కాబట్టి దాన్లో ఎలాగైనా భారీగా సొమ్ము వెనకేసుకోవాలని ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు. నేరుగా వారు ఈ పని చేయలేరు కాబట్టి.. ఇప్పటికే ఇలాంటి పనుల్లో ఆరితేరిన ‘లింగ’ని రంగంలోకి దింపారు. సదరు లింగ ఈ కాంట్రాక్టును తాను సూచించిన సంస్థలకే ఇవ్వాలని ఏపీ జెన్‌కో అధికారులపై ఒత్తిడి చేస్తూ, టెండర్ దక్కించుకోవడం కోసం ఇంధనశాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
మళ్లీ టెండర్ల గడువు పొడిగింపు
అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడులో 950 మెగావాట్లతో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ (పీఎస్‌పీ) కోసం ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్‌కో) ఈ ఏడాది జనవరి 22న టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు రూ.5 వేలకోట్లుగా నిర్ణయించింది. అయితే ఈ టెండర్‌లో కొన్ని నిబంధనలను సీఈఏ మార్గదర్శకాలకు విరుద్ధంగా పెట్టింది. దానివల్ల భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు టెండర్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. అయితే దీనివెనుక అసలు కారణం ఈ ప్రాజెక్టును తామనుకున్న సంస్థలకు దక్కేలా ‘లింగ’ చేస్తున్న తెరవెనుక లాబీయింగ్ అని తెలుస్తోంది. కూటమిలో ప్రధాన భాగస్వామి పార్టీకి చెందిన లింగ ఎప్పటి నుంచో బినామీగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది.
కూటమి భాగస్వామ్య పార్టీల్లోని నేతలకు ఇప్పటికే ఈ లింగ వేలకోట్ల రూపాయల ప్రాజెక్టుల్లో కమీషన్లు ముట్టేలా కథ నడిపారని సమాచారం. ఇదే కాంట్రాక్టు కోసం ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ఒక బడా కాంట్రాక్టు సంస్థ అంతా సిద్ధం చేసుకుంది. కానీ ఊహించని విధంగా ఇప్పుడు కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పార్టీకి చెందిన మంత్రి తరఫున లింగ రంగంలోకి దిగడంతో ఆ సంస్థకు షాక్ తగిలింది. ఎలాగైనా ఇతర సంస్థలేవీ పోటీలోకి రాకుండా.. ఒకవేళ వచ్చినా తాము చెప్పిన వాళ్లకే టెండర్ దక్కేలా చూడాలని లింగ విద్యుత్ శాఖలోని ఉన్నతాధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పార్టీ తరఫున ఒకరు.. ప్రభుత్వ పెద్దల వద్ద పట్టు ఉన్న ఓ ‘మెగా’ కంపెనీ ఈ పనుల కోసం పట్టుబడుతుండంతో టెండర్ల ప్రక్రియ గత జనవరి నుంచి పూర్తికావడం లేదు. అప్పటి నుంచి గడువు ఇవ్వడం, వాయిదాలు వేయడం జరుగుతోంది. టెండర్ల దాఖలుకు తాజాగా సోమవారంతో గడువు ముగిసింది. మళ్లీ ఈ గడువును ఏపీ జెన్‌కో మూడువారాలు పొడిగించింది. కమీషన్ల పంపకాల కోసమే ఈ వాయిదాల పర్వం కొనసాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కాంట్రాక్టుల్లో రింగ్ మాస్టర్లు.. తమ వారికి తగ్గట్టుగా నిబంధనలు
విద్యుత్ సంస్థలపై పడి దోచుకుతినడానికి, కాంట్రాక్టుల్లో వాటాల కోసం కొందరు కాంట్రాక్టర్లు రింగ్ (కూటమి) మాస్టర్లుగా ఏర్పడ్డారు. టెండర్ల విలువను 20 శాతం వరకు పెంచేసి, ఎవరికి టెండర్ రావాలో వారికి అనుకూలంగా నిబంధనలు మార్చేసి, అనుకున్నవిధంగా టెండర్లు దక్కేలా చేసి ఆపైన వాటాలను పంచుకుంటున్నారు. ఈ రింగ్ కాంట్రాక్టర్లు తమ కూటమిలో లేని సంస్థలు టెండర్లలో పాల్గొంటే వారిని ఏదో విధంగా అనర్హులుగా చూపించాలని అధికారులపై ఒత్తిడి తీసుకువస్తుంటారు. అందుకోసం పాలకుల వద్ద నుంచి సిఫారసు చేయించుకుంటున్నారు.
టెండర్లను బడా సంస్థలకు కట్టబెట్టేందుకు.. చిన్న, మధ్యతరహా కంపెనీలను కనీసం టెండర్ దాఖలు వరకు కూడా రానివ్వకుండా ఆపేందుకు చంద్రబాబు ప్రభుత్వం 150 మార్కులకు గాను 124 మార్కులు రావాలని నిబంధన విధించింది. గతంలో ఇది 113 మార్కులు వరకే ఉండేది. దీనివల్ల చిన్న, మధ్యతరహా సంస్థలేవీ టెండర్లలో పాల్గొనలేవు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను సైతం పక్కన పెట్టేలా నిబంధనలు మార్చేశారు. కేవలం తాము కోరుకున్న ప్రైవేటు సంస్థలకే టెండర్లు దక్కేలా మార్గాలు వేసుకుంటున్నారు.


