మన దేశానికి సంబంధించినంతవరకూ అధికారం దైవదత్తమేమీ కాదు. అదిరాజ్యాంగం ద్వారా సమకూడిన బాధ్యత. అధికారమైనా, విధులైనా నిర్వర్తించేవారు ఈ సంగతి మరిస్తే దేశంలో అరాచకం రాజ్యమేలుతుంది. పాలకులు మొదలు సామాన్య ప్రభుత్వోద్యోగి వరకూ అందరూ దీన్ని పాటించి తీరాల్సిందే. మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులు ఈమధ్య వరసబెట్టి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కొందరు యువకుల్ని ‘నేరగాళ్లు’గా చిత్రిస్తూ వారిని తాళ్లతోకట్టి పబ్లిగ్గా నడిరోడ్లపై నడిపిస్తున్నారు.
ఒకటి రెండు సందర్భాల్లో మోకాళ్లపై పాకించారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టి తమ ఘనకార్యాలను చాటుతున్నారు. ఈ ‘పేరుప్రఖ్యాతులు’ చూసి ఆ రాష్ట్రంలో ఇతర చోట్ల కూడా కొందరు ఇలాంటి పనులకే దిగారు. పోలీసుల మతిమాలిన చేష్టలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇటువంటి వైపరీత్యాలు తక్కువేం కాదు. తెనాలిలో నిరుడు మే నెలలో దళిత వర్గాల యువకులు ముగ్గుర్ని నడిరోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలతో మోది హింసించారు.
ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పడానికి వారి దగ్గర సమాధానాలు సిద్ధంగా ఉంటాయి. కోడిని కోశారని కేసు పెట్టవచ్చు... గ్రహస్థితి బాగో లేకపోతే డ్రగ్స్ విక్రయిస్తున్నారని అభాండం వేయొచ్చు. ఆ ఉదంతాన్ని నిరసిస్తూగుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో న్యాయవాదులు కోర్టులు బహిష్కరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అయినా ఆ మాదిరి ఘటనలు ఆగింది లేదు. ఆ మరుసటి నెలలో నెల్లూరు పోలీసులు సైతం మరో అయిదుగురు యువకులను నడిరోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లారు.
చేతిలో లాఠీ ఉంటే చాలు... తాము సర్వం సహాధికారులమన్నట్టు ప్రవర్తించే పోలీ సుల తీరు గర్హనీయమైనది. ఉద్యోగులకైనా, సాధారణ పౌరులకైనా చట్టాలు, రాజ్యాంగం ఒక్కలాగే వర్తిస్తాయి. అధికారంలో ఉన్నవారు తమ కర్తవ్య నిర్వహణలో భాగంగా తీసుకునే ఏ చర్య అయినా వాటికి లోబడే ఉంటుంది. పోలీసులు సభ్యసమాజ పోకడలకు విరుద్ధంగా పోకూడదని షీలాబార్సే దాఖలు చేసిన ఒక కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. డీకే బసు కేసులో సైతం నిందితులతో ఎలా మెలగాలో నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. అసలు పోలీసు మాన్యువల్స్‌లోనే నిందితులతో ఎలా వ్యవహరించాలన్న విషయంలో స్పష్టమైన నియమ నిబంధనలున్నాయి.
సాధారణ పౌరుల విషయంలో చిన్న చిన్న అంశాల్లో కూడా చెలరేగిపోయేపోలీ సులు... బడా బాబులు పెద్ద నేరాలు చేసినప్పుడు మాత్రం ‘శవాసనం’ వేసిన చందాన మిన్నకుండిపోతారు. ఏపీలో రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడనీ, బలవంతంగా అబార్షన్ చేయించాడనీ ఒక మహిళా ప్రభుత్వోద్యోగి ఆరోపిస్తే నెలలు గడుస్తున్నా చర్యలు లేవు. పైగా ఆమె బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారంటూ ఎదురు కేసులు పెట్టారు.
మరో మహిళా మంత్రి పీఏపై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అయినా జరిగింది శూన్యం. 60వ దశకంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ నారాయణ్ ముల్లా పోలీసులుసంఘటిత నేరగాళ్ల గుంపుగా తయారయ్యారని వ్యాఖ్యానించారు. వినడానికి అవి కటువుగా ఉన్నా, ఆయనన్నది నిజమే అన్నట్టు ప్రవర్తించే పోలీసులకు మన దేశంలో ఎప్పుడూ కొదవలేదు.
ప్రజాస్వామ్యంలో వ్యక్తులైనా, వ్యవస్థలైనా ఇష్టానుసారం ప్రవర్తించటానికి లేదు. ఒక వ్యక్తి నిజంగా తప్పుచేసినా వారి చర్యను న్యాయస్థానంలో నిరూపించి తగిన శిక్ష పడేలా చూడటమే పోలీసుల కర్తవ్యం. ప్రతి నేరానికీ గతంలో ఐపీసీలోనూ, ఇప్పుడు భారతీయ న్యాయసంహితలోనూ నిర్దిష్టమైన శిక్ష ఉంటుంది. నేరగాళ్లు సిగ్గుపడేలా చేయటమనే శిక్ష ఎక్కడా లేదు. తెనాలి ఉదంతంలో విచిత్రమేమంటే... ఒక పోలీసు ఫిర్యాదు చేశాడు. దాని ఆధారంగా అతగాడి సహోద్యోగులు శిక్ష అమలు చేశారు. మరి న్యాయస్థానాలెందుకున్నట్టు? చవకబారు సినిమాలు చూసి, ‘రెడ్‌బుక్’ రాజ్యాంగంలో ఏదైనా చెల్లుతుందనుకుని చిత్తం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఈ బాపతు అత్యుత్సాహపరులు ఏదో ఒకరోజు చట్టానికి చిక్కక తప్పదు.


