సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎన్నికల నిర్వహణ బాధ్యతల్లో ఉన్నవారు పోటీచేసే అభ్యర్థులపై ఆధారపడితే అవి నిష్పక్షపాతంగా జరుగుతాయని హామీ ఇవ్వలేమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న పేర్కొన్నారు. పటా్నలోని చాణక్య లా యూనివర్సిటీలో రాజేంద్ర ప్రసాద్ మెమోరియల్ లెక్చర్‌లో ఆమె మాట్లాడారు. ఎన్నికలను పర్యవేక్షించే బాధ్యత కలిగిన వారి స్వతంత్రత గురించి ప్రస్తావించారు.
ఎన్నికల సంఘం అత్యున్నత ప్రాధాన్యత కలిగిన రాజ్యాంగబద్ధమైన సంస్థగా 1995 నాటి తీర్పులో సుప్రీంకోర్టు గుర్తించిందని తెలిపారు. ఎన్నికల సమగ్రతను కాపాడే విధిని ఈసీకి అప్పగించారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈసీ గనక పోటీచేసే అభ్యర్థులపై ఆధారపడితే ఎన్నికలు సజావుగా, తటస్థంగా, నిష్పక్షపాతంగా జరుగుతాయని భావించలేమన్నారు. ‘‘ఎన్నికల ప్రక్రియపై నియంత్రణ అంటే రాజకీయాలపైనే నియంత్రణ.
రాజ్యాంగ నిర్మాణం బలహీనపడితే రాజ్యాంగం కుప్పకూలుతుంది. హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఇది చరిత్ర నుండి నేర్చుకోవాల్సిన గుణపాఠం. ప్రజాస్వామ్యంలో ఒక సంస్థ మరో సంస్థను నియంత్రించలేని పరిస్థితి ఉన్నప్పుడు వ్యవస్థ కుప్పకూలుతుంది. అలాంటప్పుడు ఎన్నికలు కొనసాగినా, కోర్టులు పనిచేసినా, పార్లమెంట్ చట్టాలను రూపొందించినా అధికారంపై వాస్తవిక నియంత్రణ అంటూ ఉండదు. వ్యవస్థాగత క్రమశిక్షణా ఉండదు’’ అన్నారు.
రాష్ట్రాలను సబ్‌ఆర్డినేట్లుగా కాకుండా, కో–ఆర్డినేట్లుగా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి జస్టిస్ నాగరత్న సూచించారు. ‘‘రాష్ట్రాలు కేంద్రం కంటే తక్కువ కాదు. వాటిని కేంద్రంతో సమానంగా పరిగణించాలి’’ అని తేల్చిచెప్పారు. అధికారాల విభజన సమానుల మధ్య రాజ్యాంగం చేసిన ఏర్పాటన్నారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాల విషయంలో పార్టీ విభేదాలను పక్కనపెట్టాలని అన్నారు. పరిపాలన అనేది ‘కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది’అనే అంశంపై ఆధారపడకూడదని స్పష్టంచేశారు.


