బెంగాల్ ప్రజలకు మీరంటే ఇష్టం లేదు!
అమిత్ షా ప్రకటనపై సీఎం మమత ఎద్దేవా
మాల్దా ఘటన ఎంఐఎం కుట్ర అంటూ ఆరోపణ
గజోల్: అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో 15 రోజులుపాటు ఉంటానంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై సీఎం మమతా బెనర్జీ తనదైన శైలిలో స్పందించారు. ‘అమిత్ షా అన్నా, బీజేపీ అన్నా బెంగాల్ ప్రజలకు గిట్టదు. అందుకే అమిత్ షా ఇక్కడ 15 రోజులు కాదు..ఏకంగా 365 రోజులపాటు మకాం వేసినా ఎలాంటి ఫలితమూ ఉండదు’అంటూ వ్యాఖ్యానించారు.
శుక్రవారం మాల్దా జిల్లా గజోల్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. మాల్దాలో సర్ దరఖాస్తుల పరిశీలనకు వెళ్లిన న్యాయాధికారులను 8 గంటలపాటు నిర్బంధంలో ఉంచిన ఘటనపై మమత స్పందిస్తూ.. బీజేపీ హైదరాబాద్ కోకిల ఈ కుట్రకు పథకం వేసిందంటూ పరోక్షంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇటీవల టీఎంసీ నుంచి వేరుపడి ఆమ్ జనతా ఉన్నయన్ పేరుతో పార్టీ పెట్టిన హుమాయూన్ కబీర్‌కు మద్దతు ప్రకటించిన ఎంఐఎం చీఫ్ ముస్లింల ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన ఎంఐఎం, ఐఎస్‌ఎఫ్ కార్యకర్తలకు మాల్దా ఘటనలో ప్రమేయం ఉందన్నారు. ఇందులో కాంగ్రెస్ హస్తం కూడా ఉందని చెప్పారు. ‘మాల్దా ఘటన బెంగాల్ పరువును మంటగలిపింది.
ఈ ఘటనకు కారణం స్థానికులు కారు. వాళ్లకు ఇబ్బందులు ఉండే ఉండొచ్చు. బయటి వ్యక్తులే వారిని ఈ ఉచ్చులోకి లాగారు. హైదరాబాద్ నుంచి తమ మతానికి చెందిన కొందరిని వెంటేసుకు వచ్చిన ఒక బీజేపీ కోయిల దీని వెనుక ఉంది. పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఎయిర్‌పోర్టులో మా సీఐడీ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది’అని మమత తెలిపారు. ‘బెంగాల్ అంటే ఢిల్లీ మాదిరిగా కాదు. వివిధ ప్రభుత్వ సంస్థలను వాడుకుంటూ, ఓటర్లకు డబ్బు ఎరవేసి ఏదైనా చేయొచ్చని అనుకుంటే కుదరదు’అని స్పష్టం చేశారు. బీజేపీ ఓటమి ఖాయమని తనకు తెలుసునన్నారు. రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగం ఇప్పటికీ తన నియంత్రణలోనే ఉందని, ఎన్నికల కమిషన్ అధీనంలోకి వెళ్లలేదని చెప్పారు.


