53 అసెంబ్లీ స్థానాల్లో నిర్ణాయకం
ఆ ఓటు బ్యాంకుపై బీజేపీ కన్ను
కేరళలో ఆసక్తికర సమీకరణాలు
కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు తారస్థాయికి చేరింది. పాలక ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ కూటములు పోటాపోటీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. బీజేపీ కూడా ఈసారి రాష్ట్రంలో గట్టిగా ఉనికి చాటుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో ఈళవ సామాజికవర్గం ఓట్లపై అన్ని పార్టీలూ కన్నేశాయి. ఆరు జిల్లాల్లో కనీసం 53 అసెంబ్లీ స్థానాల్లో వీరి ఓట్లు నిర్ణాయకంగా మారనున్నాయి.
ఈళవల ప్రాబల్యం
కేరళ జనాభాలో హిందువులు 54.73%. ముస్లింలు 26.56%, క్రైస్తవులు 18.38 శాతమున్నారు. హిందూ జనాభాలో ఈళవ సామాజికవర్గం అత్యధికంగా 21.60 శాతం ఉంది. తర్వాత నాయర్లు 14.9 శాతం, ఎస్సీలు 9 శాతం, ధీవర 3 శాతం, ఓబీసీ 3 శాతం, బ్రాహ్మణులు 2 శాతం, ఎస్టీలు ఒక శాతం చొప్పున ఉన్నారు. ట్రావెన్‌కోర్ ప్రాంతంలో ఈళవ సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంది. మొ త్తం 6 జిల్లాల్లో 53 అసెంబ్లీ స్థానాల్లో 40 శాతం నుంచి 70 శాతం దాకా ఈళవ వర్గం ఓటర్లే ఉన్నా రు! తిరువనంతపురం జిల్లా లో 14 స్థానాలు, కొల్లంలో 11, కొట్టాయంలో 9, అలప్పుజలో 9, పత్థనంతిట్టలో 5, ఇడుక్కిలో 5 స్థానాల్లో ఫలితాలను వీరే శాసిస్తున్నారు.
ఓట్ల కోసం పాట్లు
ఈళవ ఓట్ల కోసం పార్టీలన్నీ తలపడుతున్నాయి. కేరళలో అణగారిన వర్గాలకు జరిగిన చారిత్రక అన్యాయాలపై పోరాడింది తామేనని వామపక్షాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఒకప్పటి నంగేలి పోరాటాన్ని, చన్నార్ తిరుగుబాటును గుర్తు చేస్తున్నాయి. ఎన్‌సీఈఆర్‌టీ 9వ తరగతి చరిత్ర పుస్తకం నుంచి ట్రావెన్‌కోర్ కుల పోరాటాల అధ్యాయాన్ని తొలగించడం కేరళలో వివాదంగా మారింది. దీన్ని బీజేపీ కుట్రగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభివరి్ణంచారు. ఆ పాఠాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా బోధించేలా చర్యలు తీసుకున్నారు. ఈళవ ఓటుబ్యాంకును కొల్లగొట్టేందుకు బీజేపీ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తోంది.
ఓటింగ్ సరళిలో మార్పులిలా
కేరళ హిందూ ఓటర్లలో అత్యధికులు వామపక్ష కూటమి వైపే నిలుస్తున్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ ఓటర్లలో 48% లెఫ్ట్‌కు మద్దతిచ్చారు. 2021 అసెంబ్లీ ఎన్నికల నాటికి అది 50 శాతానికి పెరిగింది. 25% కాంగ్రెస్ వైపు నిలవగా 21% బీజేపీకి మద్దతిచ్చారు. అయితే కులాలవారీగా సమీకరణాల్లో మార్పులు కనిపిస్తున్నాయి.
ఈళవ వర్గం: 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 49 శాతం వామపక్షాలకు, 28 శాతం కాంగ్రెస్ కు, 18 శాతం బీజేపీకి ఓటు వేశారు. 2021 నాటికి ఇది లెఫ్ట్‌కు 53 శాతానికి, బీజేపీకి 23 శాతానికి పెరగ్గా కాంగ్రెస్‌కు 21 శాతానికి పడిపోయింది.
నాయర్లు: 2016లో 45 శాతం లెఫ్ట్ కూటమికే ఓటేశారు. 2021 నాటికి ఇది 32 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్‌కు 2016లో 20 శాతం మంది ఓటేయగా 2021కల్లా 38 శాతానికి పెరిగింది. నాయర్లలో బీజేపీకి ఆదరణ 33 శాతం నుంచి 27 శాతానికి తగ్గింది.
ఎస్సీలు: లెఫ్ట్‌కు కంచుకోటలా మారారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 51 శాతం ఎల్డీఎఫ్‌కు ఓటేయగా 2021 నాటికి అది ఏకంగా 69 శాతానికి పెరిగింది.
శరత్‌చంద్ర ముక్తవరం


