వి.వైతిలింగం... పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో వివాద రహితుడు. నిష్కళంక నాయకుడు. పార్టీ అంతర్గత సవాళ్లను ఎదుర్కోవడంలో సమర్థుడు. ఎంతటి రాజకీయ గందరగోళంలో అయినా.. నిబ్బరంగా, సౌమ్యంగా ఉండటం ఆయన విలక్షణ శైలి. సరళంగా, సూటిగా మాట్లాడటంలో ఆయనకు ఆయనేసాటి. ఒకప్పుడు సహచరుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామితో తట్టంచవాడి నియోజకవర్గంలో పోటీ పడుతున్నారు.
సుస్థిర పాలన...
వైతిలింగం తండ్రి వి.వెంకటసుభ రెడ్డియార్ పాండిచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన స్ఫూర్తితో 1971లో యూత్ కాంగ్రెస్ సభ్యునిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 30 ఏళ్ల వయసులో నెట్టపాక్కం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, కేవలం 90 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1985లో రెండోసారి పోటీ చేసి గెలుపొందారు. 1996 నుంచి 2001 వరకు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ పదవిని చేపట్టిన అతి పిన్న వయసు్కలలో ఒకరు.
తాను ముఖ్యమంత్రికాగానే బడ్జెట్ లోటుపై దృష్టి సారించారు. ఆర్థిక వృద్ధి తోడ్పాటుకోసం ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరిచారు. పొత్తుల విషయంలో పార్టీ హైకమాండ్‌తో విభేదాల కారణంగా కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్.రంగస్వామి రాజీనామా చేయడంతో, 2008లో ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. పుదుచ్చేరి శాసనసభకు ఎనిమిది సార్లు ఎన్నికైన సీనియర్ నేత. తాను అధికారంలో ఉన్న రెండు పర్యాయాలు స్థిరమైన పాలనను అందించిన నాయకుడు.
అసెంబ్లీ నుంచి లోక్‌సభకు...
2011 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తారు. 2016 జూన్‌లో అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పుదుచ్చేరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2024లో మరోసారి పోటీ చేసి ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అధికార కూటమిపై ప్రతిపక్షం విజయం సాధించడం పుదుచ్చేరి లోక్‌సభ చరిత్రలో అదే మొదటిసారి.
2021 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు సీట్లను మాత్రమే గెలుచుకుని, పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఓటమిని చవిచూసింది. ఆ ఓటమితో కేడర్‌లో నైతిక స్థైర్యం తగ్గడం, వర్గపోరాటాల నేపథ్యంలో, 75 ఏళ్ల వైతిలింగం జూన్ 2023లో పుదుచ్చేరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి... పార్టీని చక్కబెట్టే పనిలో పడ్డారు. పుదుచ్చేరి ఏకైక లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనను ఈసారి అనూహ్యంగా బరిలోకి దిగారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామిపై తట్టంచవాడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
వ్యవసాయం చేస్తూ...
1950లో అక్టోబర్ 5న తమిళనాడులోని కడలూరులో జన్మించారు. పుదుచ్చేరిలోని మదుక్కరైలో పెరిగారు. అక్కడ పాఠశాల విద్య పూర్తి చేశాక, చెన్నైలోని లయోలా కళాశాలలో చేరారు. మదుక్కరైలో కుటుంబ వ్యవసాయం మధ్య పెరిగిన ఆయనకు చిన్న వయస్సు నుండే వ్యవసాయ పనులంటే ఆసక్తి. తన మాధ్యమిక విద్యను పూర్తిచేసి వ్యవసాయంపై దృష్టి సారించారు. ఆ తరువాత డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. పుదుచ్చేరికి వైద్య సేవల సంచాలకుడిగా విశేష సేవలు అందించిన డాక్టర్ సాంబశివం కుమార్తె అయిన శశికళను 1969లో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి కుట్ర పన్నారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. తగినంత సాక్ష్యాధారాలు లేకపోవడంతో వైతిలింగంతోపాటు సహ నిందితులందరినీ నిర్దోషులుగా విడుదలయ్యారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


