పశ్చిమ బెంగాల్‌లో మహా జంగిల్‌రాజ్: మోదీ
చొరబాటుదార్లను ఓటు బ్యాంకుగా మార్చుకున్న సీఎం మమత
మేము అధికారంలోకి రాగానే వారిని బయటకు పంపిస్తాం
బెంగాలీలు తలెత్తుకొని జీవించేలా చేస్తామన్న ప్రధాని
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ‘మహా జంగిల్‌రాజ్’ను నడిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాష్ట్రంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు అధికార పార్టీ సృష్టించిన భయానికి, బీజేపీ ఇస్తున్న భరోసాకు మధ్య జరుగుతున్నాయని తేల్చిచెప్పారు. ఆదివారం ఉత్తర బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. మాల్డా జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) విధుల్లో ఉన్న జ్యుడీషియల్ అధికారులపై అల్లరి మూకలు దౌర్జన్యానికి దిగి, నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు.
తృణమూల్ కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని ఆరోపించారు. చొరబాటుదార్లను ఇక్కడి పాలకులు ఓటు బ్యాంకుగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ ప్రోద్బలంతోనే పొరుగుదేశం నుంచి జనం అక్రమంగా వలస వస్తున్నారని, దాంతో స్థానికంగాజనాభా నిష్పత్తిలో విపరీతమైన మార్పులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. చొరబాటుదార్ల వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు.
జ్యుడీషియల్ అధికారులకు కూడా రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ అరాచక ప్రభుత్వం ప్రజలను కాపాడుతుందన్న విశ్వాసం లేదని తేల్చిచెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ మహా జంగిల్‌రాజ్‌కు మాల్డా ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. బెంగాల్‌లో శాంతి భద్రతలకు అంత్యక్రియలు నిర్వహించడానికి అధికార పార్టీ కంకణం కట్టుకుందని దుయ్యబట్టారు.
గూండాల బెదిరింపులను లెక్కచేయొద్దు
కట్‌మనీ, అవినీతికి మారుపేరైన తృణమూల్ కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని, అభివృద్ధి చేసి చూపించే బీజేపీని గెలిపించాలని బెంగాల్ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక అక్రమ వలసలను కచ్చితంగా అడ్డుకుంటామని, చొరబాటుదార్లను బయటకు పంపిస్తామని హామీ ఇచ్చారు. మారుతున్న జనాభా నిష్పత్తి కారణంగా సొంత గడ్డపై స్వేచ్ఛను కోల్పోతామనే భయం ప్రజల్లో ఉందన్నారు.
ప్రజలు సొంత గడ్డపై గర్వంగా తల ఎత్తుకొని జీవించే పరిస్థితి తీసుకొస్తామని వెల్లడించారు. చొరబాటుదార్లను కాపాడేందుకే ఎస్‌ఐఆర్, సీఏఏను తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. హిందూ శరణార్థులకు భారతదేశ పౌరసత్వం దక్కడం ఆ పార్టీకి ఇష్టం లేదన్నారు. బుజ్జగింపు రాజకీయాల కారణంగా బెంగాల్ గుర్తింపునకు ముప్పు ఏర్పడిందన్నారు. బెంగాల్ అస్తిత్వాన్ని పణంగా పెట్టిన పార్టీలకు ఈసారి ఓటమి తప్పదని స్పష్టంచేశారు.
పోలింగ్ రోజు తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఎన్ని బెదిరింపులకు దిగితే లెక్కచేయొద్దని ప్రజలకు మోదీ సూచించారు. చట్టంపై విశ్వాసంతో పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. ఎన్నికల సంఘంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయని తెలిపారు. మే 4వ తేదీ తర్వాత చట్టం తన పని తాను చేస్తుందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అవినీతి, అరాచకాలపై తప్పనిసరిగా దర్యాప్తు జరిపిస్తామని పునరుద్ఘాటించారు.
దోషులు శిక్ష నుంచి తప్పించుకోలేరని చెప్పారు. వారు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బెంగాల్ మహిళలకు భద్రత, గౌరవం, సాధికారత కల్పిస్తామని, ఇది తన గ్యారంటీ అంటూ స్పష్టంచేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తీసుకొస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన లఖ్‌పతి దీదీ పథకం గురించి ప్రస్తావించారు. జనాభా పెరుగుదలను నియంత్రించిన రాష్ట్రాలకు నియోజకవర్గాల పెంపులో ఎలాంటి అన్యాయం జరగదని మోదీ మరోసారి హామీ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల భాగస్వామ్యం, హక్కులకు కచ్చితంగా రక్షణ ఉంటుందన్నారు.


