సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌లో రూ.7 వేల కోట్ల విలువైన భారీ భూ కుంభకోణం జరుగుతోందని బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ భూమిపై కన్నేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబం 373 ఎకరాల భూమిని ఆక్రమించిందన్నారు. తెలంగాణభవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. నాదర్‌గుల్‌లోని సర్వే నంబర్ 613 (కొత్త సర్వే నంబర్ 119)లో ఉన్న 373 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందినదేనని గతంలోనే స్పష్టమైందన్నారు. ఈ భూములను ప్రభుత్వ భూములుగా డిక్లేర్ చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు లేఖ రాయగా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో వీటిని ప్రభుత్వ భూములుగా అసెంబ్లీలో ప్రకటించి ఏపీఐఐసీకి అప్పగించారని తెలిపారు.2022 అక్టోబర్ 13న హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ కూడా ఈ భూముల క్రయవిక్రయాలు చెల్లవని స్పష్టం చేశాయని వివరించారు. విక్రయాల్లో పాల్గొన్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించిందన్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో జస్టిస్ పంకజ్‌మిట్టల్, జస్టిస్ ప్రసన్న ధర్మాసనం ముందు ఈనెల 7న విచారణకు ఉందని తెలిపారు. సుప్రీంకోర్టులో ఎలాంటి స్టే లేదని, కాబట్టి హైకోర్టు తీర్పే అమల్లో ఉందని చెప్పారు.
ల్యాండ్ సీలింగ్ చట్టానికి విరుద్ధంగా విక్రయాలు
ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాలు ఉండే అవకాశం లేదని, అయినా శివరాజ్ బహదూర్ 2016లో ఈ భూములను ఆల్ఫా, ఒమేగా, యునిటెక్ కంపెనీలకు విక్రయించాడని ఆరోపించారు. సెక్షన్ 8, 17 ప్రకారం డిక్లరేషన్ లేకుండా విక్రయం చెల్లదని, సెక్షన్ 22ఏ కింద ఈ భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయని కందుకూరు ఆర్డీఓ స్పష్టం చేశారని చెప్పారు. ఈ భూముల్లో సుమారు 600 మంది పేద రైతులు తాతముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్నారని వివరించారు. ప్రస్తుతం వారిని భూముల్లోకి రానివ్వకుండా బౌన్సర్లు, రౌడీలను పెట్టి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మహిళా రైతులు కౌసల్య, మమతలను బెదిరిస్తూ, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఆఫర్ చేసి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, బోర్లు, కంచెలను ధ్వంసం చేశారని చెప్పారు.
మంత్రి పొంగులేటి కుటుంబ హస్తం
ఈ కబ్జాల వెనుక సాక్షాత్తూ మంత్రి పొంగులేటి కుటుంబం ఉందని హరీశ్‌రావు ఆరోపించారు. శిల్పా ఇన్ఫ్రా, శిల్పా రాఘవ ఎల్‌ఎల్‌పీ, ఎక్యూ స్కై్వర్ రియల్టర్స్ వంటి సంస్థల్లో మంత్రి కుమారుడు హర్షారెడ్డి తదితరులు డైరెక్టర్లుగా ఉన్నారన్నారు. కోహినూర్ గ్రూప్, శిల్పా ఇన్ఫ్రా, మెగా కంపెనీ పేర్లతో బోర్డులు మారుస్తూ భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. ‘చెరువులను కాపాడుతున్నానని చెప్పే సీఎం రేవంత్‌రెడ్డికి ఈ ఆక్రమణలు కనిపించవా? ప్రతిపక్షాలపై సిట్‌లు వేస్తారు కానీ ఇక్కడ ఎందుకు స్పందించరు’అని ప్రశ్నించారు. తక్షణమే హైడ్రా ద్వారా అక్రమ కాంపౌండ్ వాల్‌ను కూల్చాలని, ఆక్రమణదారులను అరెస్ట్ చేయాలని, రైతులను తిరిగి భూముల్లోకి అనుమతించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రేపు ఉదయం వరకు హైడ్రా కమిషనర్ చర్యలు తీసుకోకపోతే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి నాదర్‌గుల్‌కు వెళ్లి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.


