నేను కేరళ వ్యవస్థలను కించపర్చలేదు..
మీ పాలనలో డొల్లతనాన్ని మాత్రమే ఎత్తి చూపా..
7న త్రివేండ్రం వస్తా... అన్ని విషయాలు గణాంకాలతో మాట్లాడుకుందాం
కేరళ ముఖ్యమంత్రి విజయన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు లేఖ
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి, కేరళ సీఎం విజయన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా విజయన్ ఘాటుగా స్పందించగా, ఆ వ్యాఖ్యలకు దీటుగా బదులిస్తూ రేవంత్ మరింత ఘాటైన లేఖ రాశారు. అను భవజ్ఞులైన రాజకీయ నాయకుడనే గౌరవంతో ఎక్స్ వేదికగా మీ స్పందనను చదివానని, అందులో తప్పుదారి పట్టించే అంశాలతోపాటు ముఖ్యాంశాల్లో లోపాలు కనిపించాయని, రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల దృష్ట్యా నిజా లను తెలియజేయడం తన బాధ్యతగా భావిస్తూ ఈ లేఖ రాస్తున్న ట్టు పేర్కొన్నారు. అన్ని అంశాలపై చర్చించేందుకు ఈనెల 7న త్రివేండ్రంకు వస్తానని, అన్ని విషయాలపై గణాంకాలతో సహా చర్చ జరుపుదామని విజయన్‌ను ఆహ్వానించారు.
లేఖలో ఏముందంటే...
⇒ నేను కేరళ వ్యవస్థలను ఎక్కడా తప్పుపట్టలేదు. మీ ఎల్‌డీఎఫ్ పాలనలోని లోపాలను మాత్రమే ఎత్తిచూపాను.
⇒ మీరు నీతిఆయోగ్ ఇచ్చిన ఎస్‌డీజీ 2023–24 గురించి మాట్లాడారు. కానీ ఆ డేటా పాతది. తెలంగాణను వినాశనం చేసిన బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన చరమాంకంలో ఇచ్చిన గణాంకాలను పట్టుకుని మా ప్రభుత్వం గురించి చెబుతున్నారు. 2023, డిసెంబర్‌లో ఆ పాలన అయిపోయింది.
⇒ 2025 తర్వాతి కాలంలో దేశంలోనే సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా కేరళ నిలుస్తుందని మీ పోస్ట్‌లో చెప్పారు. మరి ఇప్పుడు 2026, ఏప్రిల్ నడుస్తోంది. మీ రాష్ట్రం 100 శాతం అక్షరాస్యత సాధించిందా?
⇒ కేరళలో పేదరికం తెలంగాణ కంటే తక్కువ స్థాయిలో ఉందన్నది వాస్తవమే. కానీ అది 60 కంటే ఎక్కువ సంవత్సరాల ప్రగతిశీల పాలన ద్వారా సాధ్యమైంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన గణనీయ సంపద ద్వారా జరిగింది. 12 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ–బీఆర్‌ఎస్ ద్వారా వారసత్వంగా పేదరికం వచ్చింది. అయితే, 60 ఏళ్ల తర్వాత మీరెక్కడున్నారు... అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో మేమేం సాధించామన్నది ప్రశ్న.
⇒ కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి బీ–టీం అని అసంబద్ధ ఆరోపణ చేశారు. 2020లో జరిగిన కేరళ బంగారం కుంభకోణంలో స్వయంగా మీ ముఖ్య కార్యదర్శిని ఈడీ అరెస్టు చేసింది. కీలక నిందితుడు నేరుగా మీ కార్యాలయ ప్రమేయం గురించి దర్యాప్తు సంస్థలకు చెప్పాడు. ఈ విషయంలో ఈడీ జరిపిన సోదాలు, సీబీఐ విచారణలో ఎక్కడా కేరళ సీఎం కార్యాలయానికి ఉన్న లింకుల గురించి ప్రస్తావనకు రాలేదు. కానీ గాంధీ కుటుంబాన్ని మాత్రం ఢిల్లీ పెద్దలు నిత్యం వేధిస్తున్నారు. ఎవరు ఎవరికి బీ–టీం అనేది కేరళ ప్రజల విజ్ఞతకు వదిలేస్తున్నా.
⇒ మా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నాం. బీజేపీ–బీఆర్‌ఎస్‌ల వాట్సాప్ అభిప్రాయాలను వల్లించకుండా మేం జీతాలు ఇస్తున్నామో లేదో తెలుసుకునేందుకు ఓ బృందాన్ని పంపి స్వతంత్రంగా విచారించుకోండి.
⇒ తలసరి ఆదాయంలో మాది దేశంలోనే రెండో స్థానం. దక్షిణాదిలోనే కాదు పెద్ద రాష్ట్రాల్లోనూ మేమే నంబర్‌వన్. దేశంలో భౌగోళికంగా 3.5 శాతం, జనాభా పరంగా 3 శాతం కూడా లేని తెలంగాణ జీడీపీలో 5 శాతం పాలుపంచుకుంటోంది.
⇒ మీ రాష్ట్రంలో చురుకైన యువత ఉండటం మీకు అదనపు వనరు. సుమారు 35 లక్షల మంది కేరళీయులు విదేశాల్లో ఉంటున్నారు. ఏటా 1.5 లక్షల కోట్లు వారి ద్వారా వస్తున్నాయని అంచనా. పశ్చిమాసియా భగ్గుమంటున్నా గల్ఫ్ దేశాల్లో ఉన్న మలయాళీల్లో ఒక్కరూ తిరిగి రాష్ట్రానికి రాలేదంటే కారణం మీ రాష్ట్రంలో ఉద్యోగాలు లేకపోవడమే.
⇒ మీరు ఆరోపించినట్టు బుల్డోజర్లు ఏ పేద కుటుంబాన్నీ నష్టపర్చలేదు. బుల్డోజర్ బాధితులంటూ మీరు ఆరోపణలు చేసిన వారికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, ఆర్థిక సాయం, మార్కెట్‌విలువ కంటే ఎక్కువ పరిహారం చెల్లించాం.
⇒ చివరగా మీ పాలన వద్దని,∙కాంగ్రెస్ మోడల్‌ను కేరళ ప్రజలు కోరుకుంటున్నారు.


