‘ప్రాంతీయ’ వ్యూహం!  | Assam Chief Minister Himanta Biswa Sarma denied Congress allegations | Sakshi
Sakshi News home page

‘ప్రాంతీయ’ వ్యూహం! 

Apr 7 2026 6:01 AM | Updated on Apr 7 2026 6:01 AM

Assam Chief Minister Himanta Biswa Sarma denied Congress allegations

అస్సాంలో స్థానిక పార్టీలతో జట్టు కట్టిన కాంగ్రెస్‌ పార్టీ

ఓట్ల చీలికను అడ్డుకునేలా ఎత్తుగడ 

అభివృద్ధి, హిందూత్వ ఎజెండాతో బీజేపీ

సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ప్రవేశద్వారం అస్సాంలో ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరింది. హోరాహోరీగా సాగిన ప్రచార పర్వానికి మంగళవారం సాయంత్రంతో తెరపడనుంది. పదేళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కంకణం కట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని ప్రాంతీయ పార్టీలను కలుపుకుని బరిలో దిగింది. కంచుకోటను కాపాడుకుని హ్యాట్రిక్‌ కొట్టాలని కాషాయ దళం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సంక్షేమం, జాతీయవాద అ్రస్తాలతో ఓటర్ల ముందుకు వెళ్తోంది. 

కాంగ్రెస్‌ ‘ఐక్య’మంత్రం 
2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 40 నుంచి 45 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్‌ నిలకడగా 25 నుంచి 30 శాతం ఓట్లు సాధించినా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ప్రాంతీయ పార్టీల మధ్య చీలడంతో బీజేపీ గెలుపు సునాయాసం అవుతూ వచ్చింది. దాంతో ఈసారి కాంగ్రెస్‌ జాగ్రత్త పడుతోంది. ఓట్ల విభజనకు అడ్డుకట్ట వేసే వ్యూహంతో ముందుకెళ్తోంది. రైతుల్లో, గ్రామీణ వర్గాల్లో పట్టున్న అఖిల్‌ గొగోయ్‌ సారథ్యంలోని రైజోర్‌ దళ్, యువతను ప్రభావితం చేయగల లురిన్‌జ్యోతి గొగోయ్‌ నేతృత్వంలోని అస్సాం జాతీయ పరిషత్‌ను తనవైపు తిప్పుకుంది. దీనికి తోడు సంప్రదాయ, మైనారిటీ ఓటర్లను సంఘటితం చేయడంపై పీసీసీ చీఫ్‌ నేత గౌరవ్‌ గొగోయ్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 

ఓట్ల బదిలీపైనే ఆశలు 
ప్రాంతీయ పార్టీలు గత ఎన్నికల్లో 8 నుంచి 15 శాతం ఓట్లు సాధించాయి. ఆ ఓటు బ్యాంకును ఈసారి కాంగ్రెస్‌ కూటమికి పక్కాగా బదిలీ చేసుకోగలిగితే 40 శాతానికి పైగా ఓట్లు రావడం ఖాయమని కాంగ్రెస్‌ భావిస్తోంది. 60 నుంచి 70 స్థానాలతో విజయం సాధిస్తామని గంపెడాశలు పెట్టుకుంది. కాకపోతే భిన్న సిద్ధాంతాలున్న ప్రాంతీయ పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ ఏ మేరకు సాధ్యమన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే విభేదాలను పక్కనపెట్టి పార్టీల నేతలంతా ఉమ్మడిగా పని చేసేలా ప్రత్యేక సమన్వయ కమిటీలను కాంగ్రెస్‌ ఏర్పాటు చేసింది.  

‘హిమంత’కోట పదిలమేనా? 
గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అస్సాం ప్రజలు కమలనాథులకే పట్టం కట్టారు. 2016 ఎన్నికల్లో సొంతంగా 60 స్థానాలు నెగ్గిన బీజేపీ మిత్రపక్షాలతో కలిపి 86 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2021లోనూ సొంతంగా 60, మిత్రపక్షాలతో కలిసి 75 సీట్లు నెగ్గి అధికారాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సారథ్యంలో సంస్థాగతంగా, క్షేత్రస్థాయిలో బీజేపీ మరింత బలంగా కనిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని భావిస్తోంది. మైక్రో మేనేజ్‌మెంట్, క్షేత్రస్థాయిలో శ్రేణుల మధ్య సమన్వయంతో దూసుకెళ్తోంది. భారీ మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం, సంక్షేమ పథకాలు అధికార పార్టీకి శ్రీరామరక్షగా మారాయి. శాంతిభద్రతల పరిరక్షణ కూడా సానుకూలాంశమే. పదునైన హిందూత్వ ఎజెండా, బంగ్లాదేశ్‌ చొరబాట్ల నివారణ వంటి సున్నితమైన అంశాలను ముమ్మరంగా ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్‌ను హిమంత ఆత్మరక్షణలో పడేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement