న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటన అనూహ్య మలుపు తిరిగింది(Delhi Acid Attack). ప్రకారమే ఆమె టాయిలెట్ క్లీనర్‌ను యాసిడ్ అంటూ కథ అల్లినట్లు పోలీసు విచారణలో తేలింది. అంతేకాదు, తనపై అత్యాచారం ఆరోపణలు చేసిన మహిళపై ప్రతీకారంతో యాసిడ్ దాడికి పాల్పడ్డాడంటూ ఆమె భర్తను ఇరికించేందుకే బాధిత విద్యార్థిని తండ్రి అకీల్ ఖాన్ ఈ కుట్ర పన్నినట్లు వెల్లడైంది.
ఆదివారం ఉదయం బీకామ్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ప్రైవేట్ క్లాసుకోసం వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి తనపై యాసిడ్ చల్లారని ఆరోపించింది. జితేందర్‌తోపాటు అతడి మిత్రులు ఇషాన్, అర్మాన్ అనే వారి పేర్లు చెప్పింది. అయితే, ఇషాన్, అర్మాన్ అనే ఇద్దరు సోదరులు బాధితురాలికి బంధువులని పోలీసులకు తెలిసింది. ఘటన సమయంలో జితేందర్ తన భార్యతో కలిసి అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలోని కరోల్ బాగ్‌లో ఉన్నట్లు సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తులో తేలింది. ఘటన సమయంలో వాడినట్లు చెబుతున్న బైక్ కూడా కరోల్ బాగ్‌లోనే ఉన్నట్లు సీసీకెమెరాల ద్వారా తెలుసుకున్నారు.
దీంతోపాటు, అకీల్ ఖాన్ తనపై అత్యాచారం చేసినట్లు జితేందర్ భార్య పోలీసులు ఈ నెల 24, 25 తేదీల్లో మౌఖికంగా చేసిన ఫిర్యాదు చేసిన విషయం బయటకు వచ్చింది. ఆమె ఇదివరకు అకీల్ ఖాన్ నడిపే సాక్స్ దుకాణంలో పనిచేసేది. అప్పట్లో ఆమెపై అత్యాచారానికి, వేధింపులకు పాల్పడి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు తీశాడు. జితేందర్ భార్య చేసిన ఆరోపణల మేరకు పోలీసులు అకీల్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. యాసిడ్ దాడి పేరుతో జితేందర్‌ను కేసులో ఇరికించి, అతడి భార్యపై కక్ష తీర్చుకునేందుకు ఇదంతా చేసినట్లు అకీల్ అంగీకరించాడు.
కాలేజీకి ఈ–రిక్షాలో బయలుదేరిన తన కుమార్తె ప్రణాళిక ప్రకారం ముందుగానే కిందికి దిగిందని, ఇంట్లో నుంచి తీసుకెళ్లిన టాయిలెట్ క్లీనర్‌ను పోసుకుని కేకలు వేసిందని అకీల్ తెలిపాడు. అంతేకాదు, యాసిడ్ చల్లారని బాధితురాలు ఆరోపించిన ఇషాన్, అర్మాన్‌లు సైతం ఆ సమయంలో తమ తల్లి షబ్నంతోపాటు ఆగ్రాలో ఉన్నట్లు విచారణలో గుర్తించారు.
2018లో షబ్నం కూడా అకీల్ ఖాన్‌పై అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. ఈ రెండు కుటుంబాలకు మంగోల్‌పురిలో ఉన్న ఈ స్థలం విషయమై వివాదం నడుస్తోంది. షబ్నమ్‌పై అకీల్ యాసిడ్ దాడికి పాల్పడినట్లు మంగోల్‌పురి పోలీస్ స్టేషన్‌లో మరో ఎఫ్‌ఐఆర్ నమోదై ఉంది.
ఇదీ చదవండి: పౌరుల పాలిట పెనుముప్పుగా డిజిటల్ అరెస్ట్!


