ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోదీ | PM Narendra Modi Visits Ahmedabad Plane Crash Site | Sakshi
Sakshi News home page

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోదీ

Jun 14 2025 6:11 AM | Updated on Jun 14 2025 6:11 AM

PM Narendra Modi Visits Ahmedabad Plane Crash Site

ప్రాణాలతో బయటపడిన విశ్వాస్‌ కుమార్‌ రమేశ్‌కు పరామర్శ 
 

అహ్మదాబాద్‌: దేశ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచిన ఎయిర్‌ ఇండియా బోయింగ్‌ విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్వయంగా పరిశీలించారు. ఆయన ఉదయం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయి పటేల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఘటనా స్థలానికి వచ్చారు. 20 నిమిషాల పాటు ఇక్కడే ఉన్నారు. విమానం కూలిపోవడంతో ధ్వంసమైన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వెంట పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు, గుజరాత్‌ మంత్రి హర్ష్ సంఘావీ ఉన్నారు.

 ప్రమాదం గురించి వారు ప్రధానమంత్రికి తెలియజేశారు. మెడికల్‌ కాలేజీ హాస్టల్, మెస్‌ ధ్వంసమైన తీరును వివరించారు. అనంతరం మోదీ సిటీ సివిల్‌ ఆసుపత్రికి చేరుకున్నారు. విమాన ప్రమాదంలో గాయాలతో బయటపడి చికిత్స పొందుతున్న విశ్వాస్‌ కుమార్‌ రమేశ్‌ను పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో 25 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్న సీ7 వార్డును మోదీ సందర్శించారు. అక్కడున్న డాక్టర్లతో మాట్లాడారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. 

విజయ్‌ రూపానీ కుటుంబానికి ఓదార్పు 
విమాన ప్రమాదంలో మృతిచెందిన గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ కుటుంబాన్ని ప్రధాని మోదీ ఓదార్చారు. అహ్మదాబాద్‌ ఎయిర్‌ పోర్టు సమీపంలోని గుజ్‌సెయిల్‌ కార్యాలయంలో విజయ్‌ రూపానీ భార్య అంజలి రూపానీతోపాటు ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ విపత్కర సమయంలో గుండె నిబ్బరం కోల్పోవొద్దని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. అధికారులతో సమీక్ష ప్రధాని మోదీ గుజ్‌సెయిల్‌ ఆఫీసులో గుజరాత్‌ ప్రభుత్వ అధికారులతో, పౌర విమానయాన శాఖ అధికారులతో సమావేశమయ్యారు. విమాన ప్రమా దం, తాజా పరిణామాలపై సమీక్ష నిర్వహించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement