బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి వస్తా  | PM Narendra Modi Predicts BJP Win In Bengal Polls | Sakshi
Sakshi News home page

బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి వస్తా 

Apr 28 2026 4:49 AM | Updated on Apr 28 2026 6:18 AM

PM Narendra Modi Predicts BJP Win In Bengal Polls

పశ్చిమ బెంగాల్‌లో కమల వికాసం తథ్యం  

తూర్పు భారతదేశ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు అత్యంత కీలకం 

ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ  

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో తాను వెళ్లిన ప్రతిచోటా ప్రజల నాడిని గమనించానని, బీజేపీ విజయం ఖాయమని తేలిపోయినట్లు వెల్లడించారు. మే 4 తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి పశ్చిమ బెంగాల్‌కు తిరిగి వస్తానని ప్రకటించారు. సోమవారం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారక్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొన్నారు.

 రెండో విడత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. సిండికేట్‌ రాజ్, రాజకీయ హింస, చొరబాట్లు, ఆర్థిక పతనానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతృత్వం వహిస్తోందని మండిపడ్డారు. తూర్పు భారతదేశ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. పశ్చిమ బెంగాల్‌ ప్రగతి దేశ అభివృద్ధితో ముడిపడి ఉందన్నారు. తూర్పు ప్రాంతం తన చారిత్రక బలాన్ని, ప్రతిష్టను తిరిగి పొందాలని ఆకాంక్షించారు.  

మా, మాటీ, మానుష్ ను వదిలేశారు  
తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనలో బెంగాల్‌ అభివృద్ధి తిరుగుముఖం పట్టింది. బెదిరింపులు, దూషణలు, అబద్ధాలకు ఆ పార్టీ పర్యాయపదంగా మారింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ పెద్దలు నన్ను, రాజ్యాంగబద్ధ సంస్థలను, చివరికి సాయుధ దళాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఇష్టానుసారంగా దూషించారు. గత 15 ఏళ్లలో ఏం సాధించారని ప్రశ్నిస్తే ఒక్కరు కూడా సమాధానం చెప్పడం లేదు. అధికారంలోకి వచ్చేందుకు వాడుకున్న నినాదాన్ని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేడు వదిలేసింది. మా, మాటీ, మానుష్‌ను పక్కనపెట్టారు. మహిళలు, రైతులు, యువత కోసం చేసిందేమీ లేదు. 

ఇది మోదీ గ్యారంటీ  
కోల్‌కతాను లండన్‌లా మారుస్తామని టీఎంసీ హామీ ఇచ్చింది. కానీ, చొరబాటుదార్లకు అడ్డాగా మార్చేసింది. బీజేపీ అధికారంలోకి రాగానే చొరబాటుదార్లను బయటకు పంపిస్తాం. భారతదేశ పౌరులకు రక్షణ కల్పిస్తాం. కుల, మతాలకు అతీతంగా భారతీయులకు రక్షణ ఉంటుంది. పొరుగు దేశాల్లో మత హింసను తట్టుకోలేక శరణార్థులుగా వచ్చినవారికి భారత పౌరసత్వం కల్పిస్తాం.  బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తాం. ఇది మోదీ గ్యారంటీ. 

ఇప్పుడు బెంగాల్‌ వంతు  
గతంలో భారతదేశం సుసంపన్నంగా ఉన్నప్పుడు.. దానికి అంగ, బంగా, కళింగ(నేటి బిహార్, బెంగాల్‌ ఒడిశా) అనే మూడు బలమైన మూలస్తంభాలు ఉండేవి. ఈ మూలస్తంభాలు బలహీనపడినప్పుడు దేశానికి పెద్ద దెబ్బ తగిలింది. తూర్పు ప్రాంతాల అభివృద్ధి లేకుండా దేశ అభివృద్ధి అసంపూర్ణం. బిహార్, ఒడిశాలో కమలం వికసించింది. ఇప్పుడు బెంగాల్‌ వంతు వచ్చింది. ఇక్కడి పరిస్థితి చూస్తూ ఉంటే కమల వికాసానికి అడ్డే లేదని స్పష్టమవుతోంది. పశ్చిమ బెంగాల్‌కు సేవ చేయడం, భద్రత కల్పించడం, కాపాడడం నా కర్తవ్యం, బాధ్యత’’అని మోదీ స్పష్టంచేశారు.

తీర్థయాత్రలాగ గడిచింది
ఆడియో సందేశం, బహిరంగ లేఖ విడుదల చేసిన మోదీ  
పశ్చిమ బెంగాల్‌లో ర్యాలీల్లో ప్రసంగించినప్పుడు, రోడ్‌ షోల్లో పాల్గొన్నప్పుడు తాను ఒక తీర్థయాత్రలో ఉన్నట్లుగా భావించానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఎన్నికల ప్రచారమంతటా కాళీమాత భక్తుల నుండి లభించిన దైవిక శక్తి, ప్రజల ఆశీర్వాదాలు తనకు ఎంతో బలాన్నిచ్చాయని వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోమవారం ఒక ఆడియో సందేశం, బహిరంగ లేఖను విడుదల చేశారు. బెంగాల్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందని పునరుద్ఘాటించారు. బీజేపీ సీఎం ప్రమాణ స్వీకార వేడుకను ప్రజలతో కలిసి జరుపుకుంటానని వివరించారు. తీవ్రమైన ఎండలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ తనకు ఏమాత్రం అలసట అనిపించలేదని పేర్కొన్నారు. ర్యాలీలు, రోడ్‌ షోల్లో పాల్గొనడం తీర్థయాత్రకు వెళ్లిన భావన కలిగించిందని స్పష్టంచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement