స్వేచ్ఛా విగ్రహం కంటే ఐక్యతా విగ్రహమే ఘనం

PM Narendra Modi to flag off 8 trains to boost connectivity to Statue of Unity - Sakshi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

నిత్యం లక్ష మంది సందర్శిస్తారు

వివిధ ప్రాంతాల నుంచి కేవాడియాకు 8 రైళ్లు ప్రారంభం

అహ్మదాబాద్‌: అమెరికాలోని స్వేచ్ఛా విగ్రహం(స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ) కంటే గుజరాత్‌లోని సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ ఐక్యతా విగ్రహాన్ని(స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ) సందర్శించడానికే ఎక్కువ మంది వస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గుజరాత్‌లోని గిరిజన ప్రాంతమైన కేవాడియాలో నెలకొల్పిన ఈ విగ్రహాన్ని 2018 అక్టోబర్‌లో ప్రారంభించగా, ఇప్పటివరకు 50 లక్షల మంది సందర్శించారని పేర్కొన్నారు. అహ్మదాబాద్, వారణాసి, దాదర్, హజ్రత్‌ నిజాముద్దీన్, రేవా, చెన్నై, ప్రతాప్‌నగర్‌ ప్రాంతాలను కేవాడియాతో అనుసంధానించేందుకుగాను కొత్తగా 8 రైళ్లను ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ రైళ్లతో ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఐక్యతా విగ్రహాన్ని చూసేందుకు వచ్చే సందర్శకుల సంఖ్య భారీగా పెరుగుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో నిత్యం లక్ష మంది ఐక్యతా విగ్రహాన్ని సందర్శిస్తారని ఒక సర్వేలో తేలిందని వివరించారు.

దబోయి, చందోడ్, కేవాడియా రైల్వే స్టేషన్లను, దబోయి–చందోడ్, చందోడ్‌–కేవాడియా బ్రాడ్‌గేజ్‌ లైన్లను, నూతనంగా విద్యుదీకరించిన ప్రతాప్‌నగర్‌–కేవాడియా సెక్షన్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఒకే గమ్యస్థానానికి చేరుకునే 8 రైళ్లకు ఒకే సమయంలో పచ్చజెండా ఊపడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. కేవాడియా అనేది ఇకపై మారుమూల చిన్న పట్టణం కాదని, ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మారబోతోందని స్పష్టం చేశారు.   పర్యావరణ హిత రైల్వే ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. అందుకు కేవాడియా రైల్వే స్టేషన్‌ ఒక ఉదాహరణ అని చెప్పారు.  మోదీ ప్రారంభించిన 8 రైళ్లలో అహ్మదాబాద్‌–కేవాడియా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ కూడా ఉంది. ఈ రైల్‌లో ప్రత్యేక ఏమిటంటే ఇందులో విస్టాడోమ్‌ కోచ్‌లు ఉన్నాయి. కోచ్‌ కిటీకలు, తలుపులే కాకుండా పైభాగాన్ని కూడా అద్దాలతోనే తీర్చిదిద్దారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top