ప్రపంచ నేతగా భారత్‌! ప్రధాని మోదీ అభిలాష

PM Narendra Modi attends National Committee meeting of Azadi Ka Amrit Mahotsav - Sakshi

న్యూఢిల్లీ: కరోనా కల్లోలం ముగిసిన తర్వాత భారత్‌ ప్రపంచ నాయకురాలిగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 2047కు నూతన లక్ష్యాలతో ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌ జాతీయ కమిటీ రెండో సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. కరోనా ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పిందని, మూస భావనలను ధ్వంసం చేసిందని, దీనివల్ల భవిష్యత్‌లో ప్రపంచానికి కొత్త నాయకత్వం ఆవిర్భవించే అవకాశాలు పెరిగాయని చెప్పారు. 21వ శతాబ్దం ఆసియాదని అందరూ అంటారని, అయితే ఇందులో భారత్‌ స్థానంపై అందరం దృష్టి సారించాలని సూచించారు.

దేశ స్వాతంత్య్ర శతసంవత్సరోత్సవాల నాటికి తగిన లక్ష్యాలను రూపొందించుకోవాలన్నారు. భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు అందరూ ఎవరి బాధ్యతలు వాళ్లు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. భవిష్యత్‌ ఎప్పుడూ గతంపైనే ఆధారపడి ఉంటుందని, ప్రస్తుతం మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం మన పూర్వీకుల త్యాగఫలమని గుర్తించాలన్నారు. ఈ జాతీయ కమిటీలో లోక్‌సభ స్పీకర్, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సహా పలువురు ప్రముఖులున్నారు. ప్రస్తుత సమావేశంలో మాజీ ప్రధాని దేవేగౌడ, గవర్నర్లు ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్, ఆచార్య దేవవ్రత్, సీఎంలు వైఎస్‌ జగన్, యోగి ఆదిత్యనాధ్, అశోక్‌ గెహ్లాట్, బీజేపీ అధిపతి నడ్డా, ఎన్‌సీపీ అధిపతి శరద్‌ పవార్, ప్రముఖ గాయనీమణి లతా మంగేష్కర్, నటుడు రజనీకాంత్‌ తమ అభిప్రాయాలు వెల్లడించారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top