అందుకే జాతీయ భద్రత ప్రమాదంలో పడుతోంది
ప్రధాని మోదీ విమర్శలు
బార్పేట/హోజాయ్/దిబ్రూగఢ్: ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శల జడి కురిపించారు. ‘‘పాకిస్తాన్‌కు అనుగుణంగా కాంగ్రెస్ నడుచుకుంటోంది. తాజా ఘటనలే ఇందుకు సాక్ష్యం’’ అన్నారు. సోమవారం అస్సాంలోని బార్పేట, హోజాయ్, దిబ్రూగఢ్‌లలో మోదీ ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ‘‘2016 సర్జికల్ దాడులు మొదలు సిందూర్ దాకా మనం చేపట్టిన ప్రతి ఆపరేషన్‌లోనూ కాంగ్రెస్ పాక్‌కే వంతపాడుతోంది. పాక్ ఎజెండాకే విలువిస్తోంది. దశాబ్దాల తరబడి మాజీ సైనికులకు వన్‌ర్యాంక్–వన్ పెన్షన్ విధానం అమలు చేయకుండా కాంగ్రెస్ మాజీ సైనికులకు ద్రోహంచేసింది.
మేం వచ్చాక రూ.1.24 లక్షల కోట్లను నేరుగా వాళ్ల బ్యాంక్ ఖాతాలో జమచేశాం. రాహుల్‌గాంధీ ప్రేమ దుకాణాలు తెరిచానని గొప్పగా చెప్పుకుంటారుకానీ వాస్తవానికి ఆయన అబద్ధాల దుకాణాలు, అవమానకర షాప్‌లు తెరిచారు. ప్రజల నుంచి బీజేపీ భూములు లాక్కుందని ఆరోపిస్తారుగానీ నేషనల్ హెరాల్డ్, రాజీవ్‌గాంధీ చారిటబుల్ ట్రస్ట్ తదితరాల గుప్పిట్లో ఎంత భూమి ఉందో చెప్పరు. కాంగ్రెస్ హయాంలో అస్సాంలో గుంతలు పడ్డ రోడ్లపై వాహనాలు కూడా సరిగా నడపలేని దుస్థితి. మేం ఏకంగా యుద్ధ విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యేంత పటిష్టంగా రోడ్లు నిర్మించాం’’అంటూ మొరాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ రహదారిని ఉద్దేశించి మోదీ చెప్పారు.
మోదీ మెచ్చిన స్ఫటిక కమలం
ఇటీవల కేరళలోని తిరువళ్లలో ప్రచార సభలో మోదీ ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి ఎస్పీజీ కమెండోలను పిలిచారు. ‘‘స్ఫటిక కమలం ఆకృతిలోని పేపర్‌వెయిట్‌ను ఈ సభలో చూశా. అలాంటిది ఒకటి కావాలి. కుదిరితే తెప్పించండి’’ అని సూచించారు. వెంటనే రంగంలోకి దిగిన నిర్వాహకులు సభలో క్రిస్టిల్ కమలం ఎవరి వద్ద ఉందా అని ఆరా తీశారు. దాన్ని ఎక్కడ కొన్నారో కనుక్కున్నారు. తిరువళ్ల ప్రైవేట్ బస్టాండ్ సమీపంలోని ఆ దుకాణానికి వెళ్లి రెండింటిని కొని ప్రజాపనుల శాఖ గెస్ట్‌హౌస్ వద్ద ఎస్పీజీ అధికారులకు అందజేశారు. అదే రాత్రి వాటిని ఢిల్లీకి పంపించారు. మోదీ మెచ్చిన ఆ పేపర్ వెయిట్‌ను ప్రాచీన ఫెంగ్ షుయీ విధానంలో తయారు చేశారు. దాంట్లో 16 పూల రేకులు ఒక ఆధారానికి అతికించి ఉన్నాయి. దాన్ని తిప్పితే అందమైన పూల రేకులన్నీ తిరుగుతాయి.


