రూ.3 వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టే కుట్ర | Former Minister Harish Rao fires on government | Sakshi
Sakshi News home page

రూ.3 వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టే కుట్ర

Apr 7 2026 4:52 AM | Updated on Apr 7 2026 4:52 AM

Former Minister Harish Rao fires on government

కోహెడలో మార్కెట్‌ నిర్మాణానికి 200 ఎకరాల అనువైన స్థలం, డీపీఆర్‌ సహా రూ.350 కోట్లు సిద్ధంగా ఉన్నా పనులెందుకు ప్రారంభించలేదు ?

కోర్టు వివాదంలో ఉన్న ‘దిల్‌’భూములను మార్కెట్‌కు ఎలా ఇస్తారు ?

రైతులు ముఖ్యమా ? వ్యాపారులు ముఖ్యమా తేల్చుకోవాలి

ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్‌రావు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘అసైన్డ్‌ భూములకు పట్టాలిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఆ తర్వాత కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి.. సెటిల్‌మెంట్లకు దిగుతోంది. ఇప్పటికే నాదర్‌గుల్‌లోని రూ.7 వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టేందుకు యత్నించిన ప్రభుత్వ పెద్దలు.. తాజాగా కోహెడలోని మరో రూ.3 వేల కోట్ల విలువ చేసే 200 ఎకరాల పండ్ల మార్కెట్‌ భూములను కూడా తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు’అని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. 

ఎమ్మెల్యేలు పి.సబితారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత క్యామ మల్లేశ్‌తో కలిసి సోమవారం ఆయన కోహెడలో పర్యటించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. 

భూములను కొల్లగొట్టేందుకే
‘కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కోహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్ల మార్కెట్‌ను కట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆ మేరకు 2020లో జీఓ నంబర్‌ 11 తీసుకొచ్చి మార్కెట్‌ను నోటిఫై చేశాం. భూములు కోల్పోయిన రైతులకు రూ.10 కోట్ల నష్టపరిహారం కూడా చెల్లించాం. జీఓ నంబర్‌ 216 ద్వారా మార్కెట్‌ ఖాతాలో రూ.350 కోట్లు జమ చేశాం.

రూ.1,000 కోట్ల అంచనాలతో అత్యాధునిక మార్కెట్‌ యార్డ్‌కు డీపీఆర్‌ కూడా సిద్ధం చేశాం. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయలేదు. టీజీఐఐసీ పేరుతో విలువైన ఈ భూములను తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది పూర్తిగా రైతుల సమస్య. ఏ ప్రభుత్వమైనా రైతుల కోసం పని చేయాలి. కానీ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం కమీషన్ల కోసం పనిచేస్తోంది. 

‘దిల్‌’భూములను మార్కెట్‌కెలా కేటాయిస్తారు?
ఇక్కడ భూములకు ప్రత్యామ్నాయంగా దిల్‌ భూముల్లో మార్కెట్‌ కట్టిస్తాం అంటున్నారు. ఏపీ హౌసింగ్‌ బోర్డు ఆధ్వర్యంలోని డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌(దిల్‌) భూములపై అనేక వివాదాలు ఉన్నాయి. వీటిలో ఏపీ వాటా అడుగుతోంది. ఈ భూములపై కోర్టు కేసులు కూడా ఉన్నాయి. పలువురు పేద రైతులు ఈ భూములపై ఆధారపడి ఉన్నారు. ఎలాంటి వివాదాలు లేని భూములను అనుయా యులకు అప్పగించి.. వివాదాస్పద దిల్‌ భూములను మార్కెట్‌కు ఎలా కేటాయిస్తారు? రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కన్ను కోహెడ భూములపై పడింది. 

ఇప్పటికే లీలా హోటల్‌ కేంద్రంగా కేరళకు చెందిన నలుగురు దళారులు వీటిని కొల్లగొట్టే ప్రయత్నం మొదలు పెట్టారు. 30 వేల మంది రైతులు కావాలో? లేక ముగ్గురు దళారులు కావాలో? ప్రభుత్వమే తేల్చుకో వాల్సి ఉంది. ఇక్కడ మార్కెట్‌ నిర్మించకపోతే ఎంత దూరమైనా పోరాడుతాం. రైతుల పక్షాన కొట్లాడుతాం’అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement